Locals Blocked the Regional Ring Road Survey in Medak : ప్రాంతీయ రింగు రోడ్డు సర్వేను మెదక్ జిల్లాలో రైతులు అడ్డుకున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలో సర్వే చేయడానికి వచ్చిన అధికారులు, సర్వే సిబ్బందిని అడ్డుకున్నారు. రెడ్డిపల్లి, చిన్నచింతకుంట వద్ద ఆర్‌ఆర్‌ఆర్ సర్వేను చేయనీయకుండా రైతులు ఆర్డీవో, ఇతర అధికారులతో వాగ్వాదానికి దిగారు. రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు. కాళేశ్వరం కాలువ, ఛత్తీస్‌గడ్ విద్యుత్తు లైన్, 132 కేవీ లైన్, కొండపోచమ్మ సాగర్ చిన్న కాలువ కోసం ఇప్పటికే భూములు ఇచ్చామన్న రైతులు, ఇప్పుడు రీజినల్ రింగ్ రోడ్డు కోసం భూములు అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా రైతులు సర్వేకు ఒప్పుకోలేదు.
పరిహారం చెప్పేదాక సర్వే చేయనివ్వం : సర్వే చేయడానికి వచ్చిన ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి, సీఐ జాన్ రెడ్డి, తహసిల్దార్ కమలాద్రి సర్వే అధికారులను సిబ్బందిని రైతులు అడ్డుకున్నారు. భూ పరిహారం ఎంత ఇస్తారో చెప్పాలని రైతులు డిమాండ్ చేశారు. దీనికి అధికారులు తమ చేతిలో ఏం లేదని ఉన్నతాధికారులతో మాట్లాడి తగిన న్యాయం చేస్తామని చెప్పగా రైతులు ఒప్పుకోలేదు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రీజినల్ రింగ్ రోడ్డు ఇలా ఒకే గ్రామం మీద నుంచి వెళ్తే చాలా మంది రైతులు రోడ్డు మీద పడే అవకాశముందని వాపోయారు. ఇప్పటికే పలు ప్రాజెక్టులకు చాలా భూమి ఇచ్చామని, అయినా రైతుల అనుమతి లేకుండా భూముల్లో ఎలా సర్వే చేస్తారని వారు ప్రశ్నించారు.
భూమికి భూమే కావాలి : సర్వే చేయడానికి తాము ఐదోసారి వచ్చామని రైతులు సహకరించాలని అధికారులు కోరగా రైతులు ఒప్పుకోలేదు. రోడ్డు కోసం రైతులు తమ భూములు ఇచ్చేది లేదని పట్టుపట్టారు. ప్రాణాలైనా అర్పిస్తాము కానీ భూములు మాత్రం ఇవ్వమని మొరపెట్టుకున్నారు. భూ నిర్వాసితులకు ఎంత పరిహారం ఇస్తారో చెప్పేవరకు సర్వే చేయనిచ్చేది లేదని హెచ్చరించారు. భూములకు భూమే ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. అక్కడ ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.