Liaquat Ali Alleged Gold Shop Owner Occupied House Land: విజయవాడలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు ప్రభుత్వానిదైనా, ప్రైవేటుదైనా కబ్జా చేసేస్తున్నారు. రాత్రికి రాత్రే నిర్మాణాలు మొదలెట్టేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తున్న స్థలం అసలు యజమానులపై దాడులకు తెగబడుతున్నారు. ఈ కబ్జాకోరుల భూదాహానికి బలైపోయానంటూ లియాఖత్ అలీ అనే పేద ముస్లిం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విజయవాడ నగరం భూచోరులకు అడ్డాగా మారింది. కొంతమంది అక్రమార్కులు అధికారుల సాయంతో ఆస్తి పన్ను, అసెస్‌మెంట్ నంబర్లు నకిలీవి సృష్టించి మరీ కబ్జాలకు పాల్పడుతున్నారు. లియాఖత్ అలీ తండ్రి మహమ్మద్ అబ్దుల్ వహాబ్ తహసీల్దార్‌గా పనిచేసేవారు. 1977లో ది రెవెన్యూ ఎంప్లాయిస్ కో-ఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ విజయవాడ రిజిస్టర్ నంబరు G-2526 ఏర్పాటైంది. 1979లో సొసైటీ ఆధ్వర్యంలో ఆర్ఎస్ నంబరు 22లో మొగల్రాజపురంలో కొంత స్థలం కొని లేఔట్ వేసి ప్లాట్లుగా విభజించారు. దీనిలో 281 చదరపు గజాల విస్తీర్ణం గల ప్లాటు నెంబర్ 38ని తన తండ్రి మహమ్మద్ వహాబ్ కొనుకున్నారని లియాఖత్ అలీ తెలిపారు.
రైతుల భూమి కాజేసిన ఎమ్మెల్యే- బాధితుల నిరసనకు టీడీపీ నేతల మద్దతు
ఆ స్థలంలో ఆయన రేకుల ఇల్లు కట్టుకున్నారని దానికి నగర పాలక సంస్థ డోర్ నెంబర్, వార్డు నెంబర్, అసెస్‌మెంట్ నెంబర్ కేటాయించినట్లు వివరించారు. 1995లో తన తండ్రి చనిపోయాక విద్యాధరపురంలోని యుద్ధనపూడి వారి వీధికి మారినట్లు తెలిపారు. క్రమంగా వచ్చి స్థలాన్ని చూసుకునేవాళ్లమన్నారు. కొన్నాళ్ల కిందట వచ్చి చూస్తే స్థలం చుట్టూ ప్రహరీ గేటు తొలగించి చెట్లు నరికేశారని తెలిపారు. ఇదేంటని నిలదీస్తే ఓ బంగారు నగల దుకాణ యజమాని ఇది తన స్థలమని కిరాయి మూకలను పెట్టి కొట్టించారని వాపోయారు.
ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి కబ్జా చేశారు. అతడు విజయవాడ కార్పొరేటర్‌తో కుమ్మక్కై దౌర్జన్యంగా నన్ను కొట్టారు. తాటాకు ఇల్లును క్రైన్లతో పీకేశారని అడిగినందుకు కొట్టారు. భవన నిర్మాణం జరుగుతున్న సమయంలో వెళ్లి అడిగితే నీ స్థలం ఇది కాదు వేరే చోట కేటాయించారని అన్నారు. పోలీసులు వద్ద స్థలానికి సంబంధించిన కాగితాలు అన్నీ పొందుపరచగా వాళ్లు ఈ విషయాన్ని సరిగా పట్టించుకోనే లేదు. మున్సిపాలిటీ, రెవెన్యూ అధికారులు మొత్తం కుమ్మక్కై స్థలం కాగితాలు నకిలీవి సృష్టించి ప్రవీణ్ కుమార్‌కు ఇవ్వడం జరిగింది. -లియాఖత్ అలీ, బాధితుడు.
కన్నుపడితే ఖతమే! - అధికార పార్టీ అండతో కలెక్టరేట్లో భూ దస్త్రాలు తారుమారు
స్థలాన్ని కబ్జా చేసేందుకు బంగారు నగల దుకాణం యజమాని తప్పుడు పత్రాలు సృష్టించారని బాధితుడు లియాఖత్ అలీ తెలిపారు. తన స్థలం ఎదురుగా ఉన్న ఇంటి నెంబర్‌తో గురునానక్ కాలనీలోని ఓ ఇంటి అసెస్‌మెంట్ నెంబర్‌తో రిజిస్ట్రేషన్ చేయించారని వివరించారు. ఈ అక్రమార్కుడికి వైసీపీ మహిళా కార్పొరేటర్ భర్త మద్దతుగా ఉన్నారని తెలిపారు. దీనిపై కోర్టును ఆశ్రయించడంతో కొన్నాళ్లు వాళ్లంతా స్తబ్దుగా ఉన్నట్లు బాధితుడు చెప్పారు. మళ్లీ ఇప్పుడు కేసు కోర్టులో పెండింగ్‌లో ఉండగానే అనుమతి పొంది భవన నిర్మాణం చేపట్టారని తెలిపారు. దీనిపై అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవట్లేదని బాధితుడు వాపోయారు.
కడపలో కొనసాగుతున్న వైసీపీ నేతల భూ కబ్జాలు - ప్రజా సంఘాల హెచ్చరిక