Leopard Roaming Near Bhimadolu : ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా భీమడోలు పరిసరాల్లో సంచరిస్తున్న జంతువును అటవీ శాఖ అధికారులు గుర్తించారు. అది చిరుత పులి అని నిర్ధారించారు. ఈ జంతువును కనిపెట్టేందుకు భీమడోలు శివారు ద్వారకా తిరుమల మండల పరిధిలోకి వచ్చే అందనాలమ్మ చెరువు పరిసరాల్లో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేయగా, అందులో చిరుత స్పష్టంగా కనిపించింది. దీంతో అటవీ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు, పోలీస్ శాఖ అప్రమత్తమయ్యాయి.
భీమడోలు ఇన్‌స్పెక్టర్ యు.జె.విల్సన్ ఆధ్వర్యంలో పోలీసులు ప్రజలకు పలు సూచనలు చేశారు. భీమడోలు మండలం అంబరుపేట, ద్వారకా తిరుమల మండలం ఎం.నాగులపల్లి, పోలసానిపల్లి, కాట్రగడ్డ కల్యాణ మండపం, అందనాలమ్మ చెరువు పరిసరాల్లో ప్రజలెవరూ ఒంటరిగా తిరగవద్దని పోలీసులు హెచ్చరించారు. ఈ మేరకు ఆయా గ్రామాల్లో సోమవారం దండోరా వేయించారు. చిరుతను బంధించేందుకు డీఎఫ్‌వో ఆశాకిరణ్ నేతృత్వంలో అటవీ శాఖ అధికారులు బోన్లు ఏర్పాటు చేశారు. వీలైనంత త్వరగా చిరుతను బంధిస్తామని తెలిపారు.
హైదరాబాద్‌లోనూ సేమ్ సీన్ రిపీట్ : ఇటీవల హైదరాబాద్‌లోనూ ఓ జంతువు ఇలాగే కలకలం రేపింది. మియాపూర్ మెట్రో స్టేషన్ వెనక ప్రాంతంలో శుక్రవారం రాత్రి చిరుతను చూశామంటూ సంబంధింత దృశ్యాలను కొందరు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇవి కాస్తా నెట్టింట వైరల్‌గా మారడంతో అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. మెట్రో స్టేషన్ సమీపంలోని నడిగడ్డ తండా వద్దకు చేరుకుని, ఆ ప్రాంతమంతా జల్లెడ పట్టారు. ఎట్టకేలకు ఆ జంతువు పాద ముద్రలను గుర్తించిన అధికారులు, అది పులి కాదని, అడవి పిల్లి అని నిర్ధారించారు. స్థానికంగా ఎలాంటి చిరుత తిరగలేదని, ప్రజలెవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని చెప్పారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. ఇలాంటి పుకార్లు ఎవరూ నమ్మొద్దని, ఇతరులకు షేర్ చేసి భయాందోళనలకు గురి చేయవద్దని సూచించారు. మొత్తానికి మియాపూర్ పరిసర ప్రాంతాల్లో పులి లేదని తేలడంతో స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
గుడ్ న్యూస్ - మియాపూర్‌లో రాత్రి కనిపించింది చిరుత కాదు - అది ఏంటంటే?