Leopards Wander in Telangana : ఇటీవల వన్యప్రాణాలు జనవాసాల్లోకి వస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. అడవులను నరికి, కొండలను కూల్చేస్తుండటంతో ఆవాసాలు లేక వన్యప్రాణాలు జనావాసాల్లోకి వస్తున్నాయి. ఈ క్రమంలో పలుచోట్లు ప్రజలు, పశువులపై దాడులకు తెగబడుతున్నాయి. ఇటీవల రాష్ట్రంలో చిరుత, పెద్దపులి, ఎలుగుబంటి సంచారం, దాడులు ఎక్కుకవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనలే నిర్మల్, ఖమ్మం జిల్లాల్లో చోటుచేసుకున్నాయి.
Leopard Chases Goatherd in Nirmal : నిర్మల్ జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. సారంగపూర్ మండలం రవీంద్రనగర్ సమీపంలో సహ్యాద్రి కొండల వద్ద ఓ వ్యక్తి మేకలను కాసేందుకు వెళ్లాడు. మేకలు మేత మేస్తుండగా అతడు ఓ చెట్టు వద్ద కూర్చున్నాడు. ఎక్కడి నుంచి వచ్చిందో ఓ చిరుత అతని వైపు రావడం మొదలుపెట్టింది. గమనించిన మేకల కాపరి కేకలు వేస్తూ వెంటనే చెట్టెక్కాడు. అతడు బిగ్గరగా కేకలు వేయడంతో చిరుతపులి అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోయింది. అయితే అంతకంటే ముందే ఆ క్రూరమృగం రెండు మేకలను చంపింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
Leopard Wanders in Khammam : మరోవైపు ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం రేపల్లెవాడ సమీపంలోని మిరప తోటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. మిరప తోటలో చిరుత సంచరిస్తుండగా చూసిన అక్కడ పనిచేసే యువకుడు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో ఆ ప్రాంత ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో తల్లాడ రేంజ్ అధికారి శ్రీనివాస రావు తమ సిబ్బందితో ఆ ప్రాంతానికి చేరుకుని పరిశీలించారు.
పాదముద్రలను నిశితంగా గమనించి అటవీ అధికారులు దానిని చిరుత పిల్లగా నిర్ధారణ చేశారు. అనంతరం రేపల్లెవాడ గ్రామంలో బహిరంగంగా మైకు ద్వారా గ్రామస్థులు ఒంటరిగా పొలాల్లోకి వెళ్లొద్దని హెచ్చరించారు. ఉచ్చులు, విద్యుత్ తీగలు అమర్చడం లాంటి పనులు చేయవద్దని తెలిపారు. ఎక్కడికైనా వెళ్లాలంటే గుంపులు గుంపులుగా వెళ్లాలని సూచించారు. పొలాల్లో చిరుత ఉందని తెలుసుకొని రైతులు భయాందోళన చెందుతున్నారు. అటవీ శాఖ అధికారులు చిరుత పులి పిల్లను వీలైనంత తొందరగా పట్టుకుంటామని తెలిపారు. అప్పటి వరకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.