Lagacharla Accused Suresh Goes Missing : కొడంగల్ లగచర్లలో అధికారులపై దాడి కేసులో ప్రధాన నిందితుడు బోగమోని సురేశ్ ఆచూకీ కనిపెట్టడం పోలీసులకు ఛాలెంజ్‌గా మారింది. దాడి జరిగిన వెంటనే అజ్ఞాతంలోకి వెళ్లిన అతడి ఆచూకీని ఆరు రోజులు దాటిన పోలీసులు కనిపెట్టలేకపోయారు. మహారాష్ట్రలోని పుణె ప్రాంతంలో తలదాచుకుని ఉంటాడని ఒక ప్రచారం ఉండగా హైదరాబాద్‌లోనే రహస్య ప్రదేశంలో దాగి ఉంటాడని మరో ప్రచారం జరుగుతోంది.
ఓ పార్టీ నేతలు అతడిని పక్కా ప్రణాళికతో అజ్ఞాతంలోని పంపించి ఉంటారని, సెల్‌ఫోన్ సైతం అందుబాటులో లేకుండా జాగ్రత్తలు తీసుకుని ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో పాటు ఆ నేతకు కుట్రలో భాగముందా? అనే విషయం తెలుసుకునేందుకు సురేశ్‌ను విచారించడమే కీలకంగా మారింది. అయితే అతను పోలీసులకు చిక్కకుండా అజ్ఞాతంలో ఉన్నాడు.. సురేశ్ చిక్కితేనే ఈ ఘటనకు బాధ్యులు ఎవరనేది స్పష్టంగా తెలుస్తోంది.
కొంతమంది చేసిన తప్పునకు ఊరంతా బలి - ప్రశాంతంగా ఉండే లగచర్లకు ఆరోజు ఏమైంది?
వీడియోలు బాగోతం బట్టబయలు : కలెక్టర్ బృందాన్ని ప్రజాభిప్రాయ సేకరణ వేదిక వద్ద నుంచి ఊరిలోను తీసుకెళ్లడంలో సురేశ్ కీలకంగా వ్యవహరించాడు. అక్కడికి వెళ్లిన వెంటనే ఆందోళనకారులు నినాదాలు చేస్తూ ముందుకు దూసుకురావడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఆ సమయంలో అక్కడే ఉన్న సురేశ్ సైతం నినాదాలు చేసినట్లు వీడియోలో కనిపించడంతో ఆయనే పక్కా ప్లాన్‌తో అధికారులను అక్కడికి రప్పించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
ముందే ప్లాన్ చేసి ఉంటారని అనుమానం : అధికారులు వచ్చేసరికే వారిని రెచ్చగొట్టి దాడికి సిద్ధం చేసి ఉంటాడని.. కలెక్టర్ వాహనం దిగిన క్షణాల వ్యవధిలోనే అందోళనకారులు ఆయనపైకి దూసుకురావడంతో పాటు వెంకట్‌రెడ్డిని వెంటాడి కొట్టేందుకు అదే కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి సెల్‌ఫోన్‌ను విశ్లేషించడంతో పాటు సురేశ్ వాంగ్మూలం కీలకమవుతుందని యోచిస్తున్నారు. సురేశ్ అరెస్టయితే కానీ కేసు దర్యాప్తు వేగవంతం కాదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటివరకు ఈ ఘటనకు సంబంధించి 20 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్నం నరేందర్ రెడ్డితో కలిపి మొత్తం 21 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు పంపించారు.