Lack of Facilities in Sports Ground in Jagtial : జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మినీ స్టేడియం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. అభివృద్ధి కోసం పలుమార్లు కోట్లాది రూపాయల నిధులు మంజూరైనప్పటికీ గుత్తేదారులు నామమాత్రంగా పనులు చేసి చేతులు దులుపుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన తయారైంది మినీ స్టేడియం పరిస్థితి. స్టేడియాన్ని ఎవరు పట్టించుకోకపోవడంతో అభివృద్ధికి నోచుకోక క్రీడాకారుల పాలిట శాపంగా మారిందని స్థానికులు వాపోతున్నారు.
వర్షాకాలం వచ్చిందంటే ఇబ్బందులే : ఏటా వర్షాకాలం వచ్చిందంటే వర్షపు నీరు బయటకు వెళ్లకుండా గుంతలలో నిలిచి విద్యార్థులు, క్రీడాకారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్టేడియానికి చుట్టూ ఉన్న ప్రహరీ గోడ శిథిలావస్థలకు చేరినా పట్టించుకునే వారే కరవయ్యారు. ఏటా పాఠశాల విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహిస్తున్నా కనీసం నీటి సౌకర్యం సైతం లేకపోవడంతో నానా తిప్పలు పడుతున్నారు. అధికారులు ఇప్పటికైనా స్టేడియాన్ని బాగు చేయాలని స్థానికులు కోరుతున్నారు. క్రీడాకారులకు పోత్సహించేందుకు ప్రభుత్వం సౌకర్యాలు కల్పించాలని పట్టణవాసులు డిమాండ్ చేస్తున్నారు.
'వర్షాలు పడిన ప్రతిసారి స్టేడియంలో నీళ్లు నిలిచిపోతున్నాయి. ఆ సమయంలో స్టేడియానికి వచ్చే వారందరికీ ఇబ్బందిగా ఉంటోంది. క్రీడాకారులు ఆడుకోవడానికిగానీ, మార్నింగ్ వాకింగ్‌కు వచ్చే వారు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే మినీ స్టేడియంలో నిర్మించిన భవనాలు నిరుపయోగంగా ఉండి శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. నాయకులు, అధికారులు దీనిపై స్పందించి స్టేడియాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం' - స్థానికులు
స్టేడియంలో వర్షాలు పడిన ప్రతిసారి నీళ్లు నిలిచిపోవడంతో స్పోర్ట్స్ ఈవెంట్స్‌కు ఇబ్బంది అవుతోందని వ్యాయామ ఉపాధ్యాయుడు కార్తిక్ అన్నారు. రన్నింగ్ పోటీలు పెట్టడానికి కూడా స్టేడియంలో గ్రౌండ్ సరిగ్గా లేదని తెలిపారు. స్పోర్ట్స్ స్కూల్ నిర్మించారు కానీ అది పూర్తి కాలేదని, అక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. మినీ స్టేడియంపై అధికారులు దృష్టి సారిస్తే స్కూల్ పిల్లలతోపాటు అందరికీ ఉపయోగపడుతుందని అన్నారు.
'స్టేడియంలో అన్నీ పనులు అసంతృప్తిగా ఉండటం వల్ల పిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైనేజీ వాటర్ స్టేడియంలోకి చేరి నిలిచిపోతుంది. ఈ మినీ స్టేడియానికి వందలాది మంది వస్తారు. అయినా కనీస సౌకర్యాలు లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే అభివృద్ధి పనులు చేయాలని అధికారులను కోరుకుంటున్నా'- ముత్తయరెడ్డి, జిల్లా ప్రధానకార్యదర్శి అథ్లెటిక్స్ అసోసియేషన్