KTR letter to Foreign Minister : బహ్రెయిన్ జైల్లో చిక్కుకుపోయిన సిరిసిల్ల వాసి మానువాడ నర్సయ్యకు అండగా ఉంటామని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం చీర్లవంచ గ్రామానికి చెందిన 62 ఏళ్ల నర్సయ్యను వెంటనే స్వదేశానికి రప్పించాలని కోరుతూ విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్‌కు కేటీఆర్ లేఖ రాశారు. చాలా ఏళ్లుగా ఆచూకీ లేకుండా పోయిన నర్సయ్య బహ్రెయిన్ లోని జైల్లో పాస్‌పోర్ట్ సమస్యలతో చిక్కుకున్నారని లేఖలో పేర్కొన్నారు.
ఇదీ నేపథ్యం : సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం చీర్లవంచ గ్రామానికి చెందిన నర్సయ్య బతుకుదెరువు కోసం 1996లో బహ్రెయిన్ వెళ్లి అక్కడి 'ది అరబ్ ఇంజినీరింగ్ అండ్ కాంట్రాక్టింగ్' కంపెనీలో మూడేళ్ల పాటు తాపీ మేస్త్రీగా పనిచేశారు. 1999లో ఆగస్టులో వర్క్ పర్మిట్ ముగిసినప్పటికీ అతడు అక్కడే పనిచేస్తున్నాడు. ఆయన పాస్‌పోర్టు గడువు 2001న ముగియడంతో బహ్రెయిన్‌లోని ఇండియన్ ఎంబసీ రెన్యువల్ చేసింది. ప్రస్తుతం ఆ పాస్‌పోర్టు గడవుతేదీ కూడా ముగిసింది. కొద్దిరోజులకే నర్సయ్య పాస్‌పోర్ట్ పోగొట్టుకున్నాడు. వర్క్ పర్మిట్, పాస్‌పోర్టు లేకపోవడంతో అక్రమంగా తమదేశంలో ఉంటున్నాడని అతడిని బహ్రెయిన్ పోలీసులు అరెస్టు చేసి జైల్లో ఉంచారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
విదేశాంగమంత్రికి కేటీఆర్ లేఖ : నర్సయ్యను వెంటనే దేశానికి రప్పించాలని కోరుతూ విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్‌కు కేటీఆర్ లేఖ రాశారు. నర్సయ్యను భారత్‌కు రప్పించాలని అతని భార్య లక్ష్మి, కూతుళ్లు సోన, అపర్ణ, కుమారుడు బాబు కోరుతున్నారని కేటీఆర్ లేఖలో తెలిపారు. అతడిని భారత్‌కు రప్పించేందుకు అన్ని విధాలుగా తమ పార్టీ సహకారం ఉంటుందని ధైర్యం చెప్పారు.
నర్సయ్యకు తాత్కాలిక పాస్ పోర్ట్‌ను ఇచ్చే విషయంలో విదేశాంగ శాఖ చొరవ చూపాలని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్‌కు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. తాత్కాలిక పాస్ పోర్ట్‌ను జారీ చేస్తే బహ్రెయిన్ ప్రభుత్వం అతన్ని డిపోర్ట్ చేసి తిరిగి భారత్‌కు పంపించే అవకాశం ఉందని కేటీఆర్ తెలిపారు. బహ్రెయిన్‌లోని పార్టీ ఎన్ఆర్ఐ విభాగం, బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం సమన్వయం చేసుకొని నర్సయ్య విడుదలకు సహకరించాలని సూచించారు.
'సౌదీలో నరకయాతన అనుభవిస్తున్న - దయచేసి నన్ను కాపాడండి సార్' - Man Facing Problems In Saudi