KTR Wishes To Party Workers For BRS Formation Day : బీఆర్ఎస్ 23వ ఆవిర్భావ దినోత్సం సందర్భంగా పార్టీ శ్రేణులకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. పార్టీ పుట్టుకే ఓ సంచలనమైతే, దారి పొడవునా రాజీలేని పోరాటం చేసిన పార్టీ నాటి తెలంగాణ రాష్ట్ర సమితి అన్నారు. ఆత్మ గౌరవం, అభివృద్ధి పరిమళాలు అద్దుకుంటూ స్వీయ రాజకీయ చైతన్య పార్టీగా ఎదిగిందన్నారు.
గులాబీ పార్టీ ప్రయాణం అజేయం, అనితర సాధ్యమన్నారు. తెలంగాణ మట్టిలో పుట్టిన పార్టీ, ఈ నేల మేలుకోరే పార్టీ బీఆర్‌ఎస్ అని పేర్కొన్నారు. చావు నోట్లో తలపెట్టి రాష్ట్రాన్ని సాధించిన దళపతి, లాఠీ దెబ్బలకు భయపడకుండా ముందుకు సాగిన కార్యకర్తల త్యాగ నిరతిని కొనియాడారు. అనునిత్యం పార్టీని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న కార్యకర్తలకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేదని ఆయన ట్వీట్ చేశారు.
KTR Tweet ON BRS Formation Day : భారత రాష్ట్ర సమితి పార్టీ 23వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అన్ని జిల్లా పార్టీ కార్యాలయాల్లో పార్టీ జెండాను ఎగురవేయాలని ఆ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల కార్యక్రమాల్లో పార్టీ పూర్తిగా నిమగ్నమైన నేపథ్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలను జిల్లా కార్యాలయ కేంద్రంగా జరుపుకోవాలని సూచించారు. జిల్లా పార్టీ కార్యవర్గంతో పాటు, పార్టీ ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు.
బీఆర్ఎస్ ఆవిర్భావ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులకు కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. 2001 ఏప్రిల్ 27వ తేదీన స్వరాష్ట్ర సాధన కోసం పుట్టి తెలంగాణను సాధించి, బంగారు తెలంగాణ నిర్మాణం కోసం పార్టీ అహర్నిశలు చేసిందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది రైతులు, శ్రామికులు, కర్షకులు, బడుగు బలహీన వర్గాలు, పేద వర్గాలు, వారి అభివృద్ధి కోసం పార్టీ పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. రానున్న రోజుల్లోనూ పార్టీ తెలంగాణ ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూనే ఉంటుందని కేటీఆర్ అన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ తెలంగాణ భవన్ లో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.