KTR Sent Legal Notices to Minister Konda Surekha : మంత్రి కొండా సురేఖకు బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. తనపై కొండా సురేఖ చేసిన ఆరోపణలను ఖండించిన ఆయన, తన గౌరవానికి, ప్రతిష్ఠకు భంగం కలిగించాలన్న లక్ష్యంతోనే అడ్డగోలు వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం తన పేరును వాడుకుంటున్నారని అన్నారు. ఒక మహిళ అయి ఉండి మరో మహిళ పేరుతో పాటు సినిమా నటుల పేర్లను వాడుకొని వారి వ్యక్తిత్వ హననానికి పాల్పడడం దురదృష్టకరమన్నారు. ఎలాంటి సాక్ష్యాధారాలు లేని కొండా సురేఖ అసత్యపూరిత వ్యాఖ్యలు మీడియా, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అయ్యాయన్న కేటీఆర్, ఈ పరిణామాల వల్ల సాధారణ ప్రజలు మంత్రి వ్యాఖ్యలను నిజాలుగా భ్రమపడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
మంత్రి సురేఖ క్షమాపణలు చెప్పకుంటే పరువు నష్టం దావా వేస్తా : గతంలోనూ ఆమె ఇలా మాట్లాడినందుకే ఏప్రిల్‌లో నోటీసులు పంపించానన్నారు. మంత్రి కొండా సురేఖ తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. 24 గంటల్లోగా క్షమాపణ చెప్పకుంటే చట్టప్రకారం పరువు నష్టం దావాను వేయడంతో పాటు క్రిమినల్ కేసులు పెడ్తానని హెచ్చరించారు. అయితే సినీనటుడు నాగార్జున కుటుంబంలో చోటుచేసుకున్న పరిస్థితులకు కేటీఆర్ కారణమని కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ ఈ మేరకు లీగల్ నోటీసులు పంపారు. అలాగే తనకు సంబంధమే లేని ఫోన్ ట్యాపింగ్‌పై అసత్యాలు మాట్లాడారని ఆక్షేపించారు.
ఇంతకీ మంత్రి కొండా సురేఖ ఏమన్నారంటే : బీసీ మహిళనైన తనపై అసభ్యకర పోస్టులు పెట్టడం బాధాకరమని కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలను కించపరిచేలా పోస్టులు పెట్టాలని మాజీ మంత్రి కేటీఆరే ఆ పార్టీ కార్యకర్తలకు చెప్పినట్లు ఉందన్నారు. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ, కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన తీరుతో చలనచిత్ర పరిశ్రమలో కొంతమంది ఇబ్బంది పడ్డారని ఆరోపించారు. కొందరు హీరోయిన్లు త్వరగా మ్యారేజ్ చేసుకుని ఇండస్ట్రీ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆర్ అని ఆరోపించారు. అంతేకాదు, హీరో అక్కినేని నాగార్జున కుటుంబంలో చోటు చేసుకున్న పరిస్థితులకు కూడా కేటీఆర్ కారణమని ప్రస్తావించారు.