KTR Open Letter to CM Revanth Reddy : బీఆర్ఎస్ పాలనలో పదేళ్లు పండగలా కళకళలాడిన చేనేత రంగం, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మళ్లీ సంక్షోభంలో కూరుకుపోయిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. 2004 నుంచి 2014 వరకు ఉన్న విపత్కర పరిస్థితిని ఇప్పుడు ఎదుర్కొంటోందని అన్నారు. హస్తం పార్టీ ప్రభుత్వం అనుసరిస్తున్న కక్షపూరిత వైఖరి వల్ల గత నాలుగు నెలలుగా నేతన్నలు చేనేత పనులకు దూరమవడంతో పాటు, పవర్ లూమ్స్ పూర్తిగా బంద్ అయ్యాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
KTR on Handloom Workers Facing Problems : రాష్ట్రంలోని నేత కార్మికుల సమస్యలపై (Handloom Workers Problems) ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ సర్కార్‌కు చిత్త శుద్ధి, ముందు చూపు లేకపోవడంతో వేలాది మంది నేతన్నలు, పవర్ లూమ్ కార్మికులు, వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆరోపించారు. వారు ఉపాధి కోల్పోయి, జీవితాలు దుర్భరంగా మారుతున్నా ప్రభుత్వానికి కనీస కనికరం లేదని ఆక్షేపించారు. తమకు పని కల్పించాలని డిమాండ్ చేస్తూ కార్మిక లోకం ప్రతినిత్యం దీక్షలు, ధర్నాలు, నిరసనలు కొనసాగిస్తున్నప్పటికీ, సర్కార్‌లో ఏమాత్రం చలనం లేకపోవడం అత్యంత దారుణమైన విషయమని కేటీఆర్ మండిపడ్డారు.
చేనేత కార్మికుల పాలిట పెనుశాపంగా విద్యుత్ బిల్లులు.. ఆదుకోవాలంటూ విజ్ఞప్తి
'ఆదుకోవాల్సిన అధికార పార్టీ నేతలే కార్మికులను అవమానించేలా మాట్లాడటం, వారి మనోస్థైర్యాన్ని మరింతగా దెబ్బతీస్తోంది. కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి వ్యాఖ్యలు ప్రతి కార్మికుని గుండెను గాయపరిచాయి. ఆర్థిక ఇబ్బందులతో సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తడుక శ్రీనివాస్ అనే నేత కార్మికుడు ఉరి వేసుకుని తనువు చాలించారు. ఇది ఆత్మహత్య కాదని, ముమ్మాటికీ హస్తం పార్టీ ప్రభుత్వం చేసిన హత్యగానే నేతన్నలు భావిస్తున్నారని' కేటీఆర్ ఆరోపించారు.
కార్మికుల జీవితాల్లో గుణాత్మక మార్పు : చేనేత రంగానికి (Handloom Workers) పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా కేసీఆర్ హయాంలో సాగిన మహాయజ్ఞం ఎన్నో గొప్ప ఫలితాలను ఇచ్చిందని కేటీఆర్ గుర్తు చేశారు. తెలంగాణలో వస్త్రపరిశ్రమ విస్తరించి వివిధ ప్రాంతాలతో పాటు ఒకప్పుడు ఉరిశాలగా ఉన్న సిరిసిల్ల కొత్త కాంతులతో వెలుగులీనిందని వివరించారు. నేతన్నకు బీమా అమలుతో కార్మికుల కుటుంబాలకు ధీమా లభించిందని, ఓవైపు కార్మికుల సంక్షేమం, మరోవైపు సమగ్ర అభివృద్ధితో వారి జీవితాల్లో గుణాత్మక మార్పు వచ్చిందని కేటీఆర్ వెల్లడించారు.
కాంగ్రెస్ రాగానే చిమ్మ చీకట్లు : పదేళ్ల పాటు పండుగలా మారిన వస్త్ర పరిశ్రమ చుట్టూ మళ్లీ కాంగ్రెస్ రాగానే చిమ్మ చీకట్లు అలుముకుంటున్నాయని కేటీఆర్ ఆరోపించారు. పరిశ్రమను దెబ్బతీయడంతో పాటు కార్మికుల జీవితాలతో చెలగాటమాడేలా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే తీరు మార్చుకోవాలన్నారు. బీఆర్ఎస్ సర్కార్ అమలుచేసిన కార్యక్రమాలను భేషజాలకు వెళ్లకుండా కొనసాగించాలని కేటీఆర్ తెలిపారు.
KTR on Handloom Workers Facing Problems : బతుకమ్మ చీరల ఆర్డర్లకు ఇప్పటికీ ఉత్తర్వు రాకపోవడంతో వాటిపై ఆధారపడిన వారి ఆందోళన రోజురోజుకూ పెరిగిపోతోందని కేటీఆర్ అన్నారు. 35,000ల మంది కార్మికులు, కుటుంబాలకు సంబంధించిన కీలకమైన సమస్యపై యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. వెంటనే నేతన్నలకు బతుకమ్మ చీరల ఆర్డర్లు అందించి వస్త్ర పరిశ్రమను ఆదుకోవాలని, నూలు రాయతీని కూడా విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
చేనేత కార్మికుల వెతలు.. మారని బతుకులు
'తమ ప్రభుత్వ హయాంలో కార్మికుల ఖాతాల్లో ప్రతి నెలా నేరుగా సూమారు రూ.3000ల వరకు పడేవి. కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత చేనేతమిత్ర కార్యక్రమం ఆగిపోయింది. మూలన పడిన సాంచాలను తిరిగి తెరిపించేందుకు పరిశ్రమకు రావాల్సిన రూ.270 కోట్ల బకాయిలను కూడా ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి. సొంత రాష్ట్రంలోని కార్మికులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వ పెద్దలు కమిషన్లకు కక్కుర్తి పడి తమిళనాడు, సూరత్‌కు ఆర్డర్లు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోందని' కేటీఆర్ ఆరోపించారు.
Handloom Workers Problems in Telangana : రైతాంగ సంక్షోభం తరహాలో నేతన్నల సంక్షోభాన్ని కూడా రాజకీయ కోణంలో కాకుండా, పేద బడుగు, బలహీన వర్గాలైన నేతన్నల కోణంలో ఆలోచించాలని కేటీఆర్ పేర్కొన్నారు. వెంటనే వాటిని పరిష్కరించాలని నేత కార్మికుల పక్షాన తెలంగాణ సర్కార్‌ను కోరుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే పలువురు కార్మికులు ఆత్మహత్యకు పాల్పడిన తరుణంలో భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
ఇప్పటి వరకు అందుతున్న అన్ని కార్యక్రమాలు అమలు కొనసాగించాలని కేటీఆర్ కోరారు. అవసరమైతే మరింత అదనపు సాయం అందేలా చూడాలన్నారు. కేవలం గత ప్రభుత్వంపై దుగ్దతో వేల మంది నేతన్నల పొట్ట కొట్టొద్దని విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వస్త్రపరిశ్రమపై ఆధారపడిన వేల మంది చేనేత కార్మికులు, కుటుంబ సభ్యులు మరింత సంక్షోభంలో కూరుపోతారని అవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై సర్కార్ తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. లేదంటే తమ పొట్టకొడుతున్న కాంగ్రెస్‌ను బడుగు,బలహీన వర్గాల నేతన్నలు ఎప్పటికీ క్షమించరని లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు.
KTR Tweet on Tesla Company India Visit : మరోవైపు భారతదేశంలో టెస్లా కంపెనీ తన కార్యకలాపాలను ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకొన్న నేపథ్యంలో ఆ కంపెనీ తయారీ యూనిట్ ను తెలంగాణలో ఏర్పాటు చేసేలా చూడాలని కేటీఆర్ కోరారు. టెస్లా కంపెనీ నిర్ణయం నేపథ్యంలో ఎక్స్ వేదికగా ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేశారు. ఫ్యాక్టరీ ఎక్కడ పెట్టాలన్న అంశంపై ఆ కంపెనీ ప్రతినిధి బృందాన్ని పంపిస్తున్న నేపథ్యంలో ప్లాంట్‌ను రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలని సూచించారు.
తెలంగాణకు ఉన్న అద్భుతమైన అవకాశాలతో పాటు ప్రోగ్రెసివ్ పారిశ్రామిక విధానాలను కంపెనీకి తెలపాలని కేటీఆర్ అన్నారు. టెస్లా బృందం హైదరాబాద్‌లో పర్యటించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. టెస్లా కంపెనీని రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు రాష్ట్రం ప్రభుత్వం తన శక్తి యుక్తులు అన్నింటినీ ఉపయోగించి ప్రయత్నించాలని కేటీఆర్ ట్వీట్లో కోరారు.
Handloom Workers Problems : ఆధునిక కాలంలో చేనేత రంగం ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కార మార్గం ఎలా?