KTR On Rajiv Gandhi Statue : రాష్ట్ర సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహం ఉండాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడమేంటని మాజీమంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ సమాజం మొత్తం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన తప్పును సరిదిద్దుకోవాలని ఆయన సూచించారు. లేదంటే తెలంగాణ ప్రజలు సరైన సమయంలో బుద్ది చెప్పడం ఖాయమని కేటీఆర్ హెచ్చరించారు.
అస్తిత్వాన్ని తాకట్టు పెట్టడమే : రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టినందుకు నిరసనగా మంగళవారం రాష్ట్రంలోని అన్ని తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకం చేయాలని గులాబీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడం తెలంగాణ అస్తిత్వాన్ని తాకట్టు పెట్టే సిగ్గుమాలిన చర్య అంటూ మండిపడ్డారు. తెలంగాణ తల్లిని అవమానించేలా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన చర్యను ఎక్కడికక్కడ పార్టీ శ్రేణులతో సహా తెలంగాణ వాదులంతా వ్యతిరేకిస్తూ నిరసన తెలపాలని కోరారు.
తెలంగాణ తల్లిని అవమానిస్తారా ?
— KTR (@KTRBRS) September 16, 2024
తెలంగాణ ఆత్మతో ఆటలాడతారా ?
తెలంగాణ అస్తిత్వాన్నే కాలరాస్తారా ?
తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ఊపిరి తీస్తారా?
తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవహేళన చేస్తారా ?
తెలంగాణ మలిదశ పోరాట దిక్సూచిని దెబ్బతీస్తారా ?
తెలంగాణ అమరజ్యోతి సాక్షిగా ఘోర అపచారం చేస్తారా ?
తెలంగాణ… pic.twitter.com/zLV0I2aQeZ
తెలంగాణ తల్లి కోసం స్థలం ఎంపిక : రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అయితే, తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. సచివాలయం, అమరజ్యోతి మధ్యలో తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని కేసీఆర్ 2023 జులైలోనే స్థలాన్ని ఎంపిక చేశారని ఆయన గుర్తు చేశారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కుసంస్కారంతో తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి విగ్రహాన్ని ఆ స్థలంలో ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు.
సకల మర్యాదలతో తరలిస్తాం : ప్రతి తెలంగాణ వ్యక్తి మనసును గాయపర్చేలా కాంగ్రెస్ ప్రభుత్వ చర్య ఉందని కేటీఆర్ ఆక్షేపించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే సచివాలయం ముందు నుంచి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామని ఆయన స్పష్టం చేశారు. సకల మర్యాదలతో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని గాంధీ భవన్కు తరలిస్తామని మరోమారు ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లో తాము గతంలో ప్రతిపాదించిన స్థలంలోనే తెలంగాణ తల్లి విగ్రహం ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి దిల్లీకి బానిసత్వం చేస్తారని తాము ముందునుంచే చెప్పామని, రేవంత్రెడ్డి సరిగ్గా ఇప్పుడు అదే చేస్తున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కేవలం దిల్లీ బాసుల మెప్పు కోసమే తెలంగాణను, ఆత్మను తాకట్టు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు, తెలంగాణ మనోభావాల కన్నా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకు దిల్లీ బాసుల మెప్పు పొందటమే ముఖ్యమైపోయిందని దుయ్యబట్టారు.
ఐటీ పరిశ్రమల భూములను తాకట్టు పెడితే పెట్టుబడులు ఎలా వస్తాయి? : కేటీఆర్ - KTR on Hyderabad it Lands
బ్లాక్ లిస్టులో పెట్టాల్సిన మేఘా సంస్థకు పనులు ఎలా ఇస్తారు - కేటీఆర్ - KTR SLAMS CM REVANTH