KTR on Cong Six Guarantees : ఆరునూరైనా 6 గ్యారెంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చారని మాజీమంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. హామీల మాట తప్పినందుకు, 420 హామీలు తుంగలో తొక్కినందుకు ప్రభుత్వాన్ని అభిశంసించాలని అన్నారు. రీకాల్ వ్యవస్థ లేదు కనుక కాంగ్రెస్‌ను ఐదేళ్లూ భరించాల్సిందేనని వ్యాఖ్యానించారు. రైతు భరోసా గురించి బడ్జెట్‌లో నిధులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
రాజీనామాకు సిద్ధం : రేవంత్ ప్రభుత్వం వచ్చాక కొత్తగా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని కేటీఆర్ దుయ్యబట్టారు. ఒక్క ఉద్యోగం ఇచ్చామని నిరూపిస్తే వెంటనే రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. తనతో కలిసి అశోక్‌నగర్ వచ్చేందుకు సీఎం, డిప్యూటీ సీఎం సిద్ధమా? అని ప్రశ్నించారు. ఉద్యోగాలు ఇచ్చామని నిరూపిస్తే లక్షలమంది యువతతో సన్మానం చేయిస్తామని తెలిపారు.
మహిళలను మోసం : రుణమాఫీ విషయంలో రేషన్‌కార్డు, కుటుంబం పేరిట కట్టింగ్‌లు పెడుతున్నారని కేటీఆర్ దుయ్యబట్టారు. పత్రిక ప్రకటనల్లో రెండు, మూడు సార్లు రుణమాఫీ అంటున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులనే కాదు మహిళలను కూడా మోసం చేసిందని అన్నారు. కోటి 67 లక్షల మంది ఆడబిడ్డలకు రూ.2500 ఇవ్వాలని, రూ.5లక్షల విద్యా భరోసా కార్డు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం గురుకులాల్లో విద్యార్థులకు భోజనం సరిగా లేదని పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క స్పందిస్తూ ఇంటింటికి ఉద్యోగం పేరుతో పదేళ్లపాటు బీఆర్ఎస్ నేతలు మోసం చేశారని దుయ్యబట్టారు. పదేళ్లపాటు ఓయూకు వెళ్లలేని పరిస్థితి తెచ్చుకున్నారన్నారు. ఆశావర్కర్లు, అంగన్వాడీల తల్లిదండ్రుల పింఛను బీఆర్ఎస్ తొలగించారని, చిరుద్యోగుల తల్లిదండ్రుల పింఛను తీసేసింది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని దుయ్యబట్టారు. ధరణి పేరుతో పేదలకు పట్టాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని, బీఆర్ఎస్ వేధింపులు తట్టుకోలేకే ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కట్టారని తెలిపారు. బీఆర్‌ఎస్ పాలనలో పేదలకు ఇళ్లు కూడా ఇవ్వలేదని, పొరుగుసేవల ఉద్యోగులకు నెలలపాటు జీతాలు ఇవ్వలేదని మండిపడ్డారు.
అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో శతకోటి సమస్యలకు కారణం కాంగ్రెస్సేనని కేటీఆర్ దుయ్యబట్టారు. 6,650 మంది పేద విద్యార్థులకు రూ.20 లక్షల చొప్పున ఇచ్చి పంపించామని, దళితబంధు కాదు, అంబేడ్కర్ అభయహస్తం ఇస్తామన్నారని వ్యాఖ్యానించారు. రూ.10 లక్షలకు కాదు, రూ.12 లక్షలు ఇస్తామని చెప్పారని, బడ్జెట్‌లో పది పైసలు కూడా కేటాయించలేదని పేర్కొన్నారు. ఉన్న దళితబంధు చెక్కులే ఆపుతున్నారని, రూ.10 లక్షలకు కాదు, రూ.12 లక్షలు ఇస్తామన్న మాటను నిలుపుకోవాలని డిమాండ్ చేశారు.
"రేవంత్ ప్రభుత్వం వచ్చాక కొత్తగా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. నాతో కలిసి అశోక్‌నగర్ వచ్చేందుకు సీఎం, డిప్యూటీ సీఎం సిద్ధమా? ఉద్యోగాలు ఇచ్చినట్లు ఒక్క యువతి, యువకుడు చెప్పినా నేను వెంటనే రాజీనామా చేస్తా" - కేటీఆర్, మాజీమంత్రి