KTR Tweet On manne Krishank Arrest : ఉస్మానియా యూనివర్సిటీ హాస్టళ్లు, మెస్‌లు మూసివేయడంపై సామాజిక మాధ్యమాల్లో నకిలీ నోటీసులతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని కొందరు చేసిన ఫిర్యాదుతో పోలీసులు బీఆర్ఎస్ నేత క్రిశాంక్ పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. బుధవారం ఉదయం కొత్తగూడెం నుంచి హైదరాబాద్ వస్తున్న క్రిశాంక్‌ను పంతంగి టోల్‌ప్లాజా దగ్గర వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులు అడ్డుకున్నారు. వాహనాన్ని పక్కకు ఆపిన తర్వాత చౌటుప్పల్ పట్టణ పోలీసులు స్థానిక ఠాణాకు తీసుకెళ్లారు. హైదరాబాద్ నుంచి చౌటుప్పల్ వెళ్లి ఓయూ పోలీస్‌స్టేషన్ సిబ్బందికి క్రిశాంక్‌ను అప్పగించారు.
క్రిశాంక్ అరెస్టు అక్రమం అన్యాయం : ఈ క్రమంలో క్రిశాంక్ అరెస్ట్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. క్రిశాంక్ అరెస్టు అక్రమం, అన్యాయం, దుర్మార్గమని అని అన్నారు. క్రిశాంక్ అంటే ఒక ఉద్యమ గొంతుక, ఒక చైతన్య ప్రతీక యువతరానికి ప్రతిబింబమని పేర్కొన్నారు. గల్లీ కాంగ్రెస్ వైఫల్యాలపై, దిల్లీ బీజేపీ అరాచకాలపై గళమెత్తినందుకే ఈ దౌర్జన్యమని విమర్శించారు.
ప్రశ్నించినందుకే ఈ దుర్మార్గ చర్యలకు ఒడిగట్టారని కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి చేస్తున్న ఈ కక్ష సాధింపులకు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఈ నియంతృత్వ నిర్బంధాలకు తెలంగాణ ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదని వార్నింగ్ ఇచ్చారు. నాడు ఎమర్జెన్సీ చూశాం నేడు అప్రకటిత ఎమర్జెన్సీ చూస్తున్నామని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యాన్ని కాలరాసినందుకు ఆనాడు పాలక పక్షానికి పట్టిన గతే రేపు కాంగ్రెస్, బీజేపీలకు పట్టడం ఖాయమని విమర్శించారు.
Harish Rao Tweet On Krishank Arrest : ఇదే వ్యవహారంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు కూడా స్పందించారు. క్రిశాంక్ అరెస్టు అప్రజాస్వామికమని అన్నారు. ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా అని నిలదీశారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి చేస్తున్న ఈ కక్ష సాధింపులకు మూల్యం చెల్లించక తప్పదని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా హెచ్చరించారు.