Krishna River Management Board issued orders For Drinking Water Supply : తెలుగు రాష్ట్రాల తాగునీటి అవసరాల కోసం కేఆర్‌ఎంబీ నీటివిడుదల ఉత్తర్వులు జారీ చేసింది. త్రిసభ్య కమిటీ నిర్ణయం మేరకు నీటి విడుదలకు ఉత్తర్వులు వెెలువరించింది. శ్రీశైలం నుంచి పవర్‌హౌసెస్ ద్వారానే నీరు విడుదల చేయాలని కేఆర్‌ఎంబీ పేర్కొంది. రేపటి నుంచి నీటి విడుదలకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు అనుమతి ఇవ్వనుంది. తాగునీటి అవసరాలకు మాత్రమే నీటిని వినియోగించాలని కేఆర్‌ఎంబీ స్పష్టం చేసింది.
తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేయాలన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విజ్ఞప్తులపై కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఉత్తర్వులు వెలువరించింది. తాగునీటి అవసరాల కోసం నాగార్జున సాగర్ నుంచి ఐదు టీఎంసీల నీరు విడుదల చేయాలని ఏపీ గతంలో కోరింది. ఆ ప్రతిపాదన నేపథ్యంలో సోమవారం హైదరాబాద్లో బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం జరిగింది. కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి రాయిపురే, తెలంగాణ ఈఎన్సీ అనిల్ కుమార్, ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి సమావేశంలో పాల్గొన్నారు.
గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో తాగునీటి అవసరాల కోసం సాగర్ నుంచి ఐదు టీఎంసీల నీటిని విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ గతంలో బోర్డును కోరింది. ఆ ప్రతిపాదనపై త్రిసభ్య కమిటీ సమావేశంలో చర్చించారు. అందుబాటులో ఉన్న జలాలు, ఎగువ నుంచి ప్రవాహం వచ్చే అవకాశం, తదితర అంశాలపై సమావేశంలో చర్చ జరిగింది. ఎగువ నుంచి ఇప్పటికి ప్రవాహాలు రాకపోయినా, కర్ణాటకలో ఆల్మట్టి, నారాయణపూర్లో ఉన్న నీటిమట్టం, వస్తున్న ప్రవాహాన్ని చూస్తే పరిస్థితి ఆశాజనకంగానే ఉందని సమావేశంలో అభిప్రాయపడ్డట్లు తెలిసింది. సాగర్‌లో ప్రస్తుతం ఉన్న నిల్వలను పరిగణలోకి తీసుకొని తాగునీటి కోసం నీరు విడుదల చేయాలని నారాయణరెడ్డి కోరారు.
తమకు కూడా హైదరాబాద్, సహా జిల్లాల్లో తాగునీటి అవసరాలు ఉన్నాయని, నీరు విడుదల చేయాలని తెలంగాణ ఈఎన్సీ అనిల్ కుమార్ కోరారు. రెండు రాష్ట్రాల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకున్న కృష్ణానదీ యాజమాన్య బోర్డు శ్రీశైలం, సాగర్‌లో ఉన్న 9.914 టీఎంసీలు తెలంగాణ, ఏపీకి కేటాయింపులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణకు 5.414, ఏపీకి 4.500 టీఎంసీల నీరు కేటాయించింది. శ్రీశైలం నుంచి పవర్‌హౌసెస్ ద్వారానే నీరు విడుదల చేయాలని కేఆర్‌ఎంబీ పేర్కొంది.