Krishna River Board on Budget Meeting and Funds from Telugu States : ఉద్యోగులు, సిబ్బందికి ఏప్రిల్ నెల వేతనాలు ఇచ్చేందుకు కూడా సరిపడా డబ్బులు లేవని, వెంటనే నిధులు విడుదల చేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు రెండు తెలుగు రాష్ట్రాలను కోరింది. నిధుల విడుదల అంశంతో పాటు 2024-25 సంవత్సరానికి బడ్జెట్‌పై చర్చించేందుకు ఈ నెల 22వ తేదీన బోర్డు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం 11 గంటలకు దృశ్యమాధ్యమ విధానంలో కేఆర్ఎంబీ సమావేశం జరగనుంది.
Krishna River Board Budget 2024-25 : ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి, రెండు రాష్ట్రాల ఈఎన్సీలకు బోర్డు సమాచారం పంపింది. 2024-25 సంవత్సరానికి కృష్ణా బోర్డు బడ్జెట్‌ను రూ. 23 కోట్ల 17 లక్షలకు తయారు చేశారు. బోర్డులో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బందికి వేతనాలు, కార్యాలయ నిర్వహణ ఖర్చులు, టెలీమెట్రీ కేంద్రాల ఏర్పాటు, నిర్వహణకు ఈ మొత్తం అవసరమవుతుందని అంచనా వేశారు. ఆ మేరకు నిధులు ఇవ్వాలని రెండు రాష్ట్రాలను బోర్డు కోరింది.
అటు 2014-15 నుంచి ఇప్పటి వరకు మొత్తం రూ. 47 కోట్ల 97 లక్షలు ఖర్చు చేసినట్లు కేఆర్ఎంబీ తెలిపింది. అందులో ఏపీ రూ. 28 కోట్ల 26 లక్షలు, తెలంగాణ రూ. 19 కోట్ల 71 లక్షలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ ఎనిమిదిన్నర కోట్లు ఎక్కువగా విడుదల చేసినట్లు బోర్డు తెలిపింది. 2023-24లో ఏపీ రూ. 6 కోట్ల 70 లక్షల రూపాయలు విడుదల చేస్తే తెలంగాణ ఎలాంటి నిధులు ఇవ్వలేదని పేర్కొంది. బోర్డుకు నిధులు ఇస్తామని జనవరి 17న దిల్లీలో జరిగిన సమావేశంలో రెండు రాష్ట్రాలు అంగీకరించినట్లు గుర్తు చేసింది.
రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వివాదం : ఆ తర్వాత కూడా తెలంగాణ నుంచి నిధులు విడుదల కాలేదని కేఆర్ఎంబీ పేర్కొంది. రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల విషయంలో వివాదాలు తలెత్తుతున్నాయని, ఈ పరిస్థితుల్లో రెండో దశలో తొమ్మిది చోట్ల టెలీమెట్రీ స్టేషన్ల(Telemetry station) ఏర్పాటుతో పాటు నిర్వహణ కోసం నిధులు అవసరమని వివరించింది. ఏపీ నిధులు, కేంద్రం నుంచి 2014-15లో వచ్చిన కోటి రూపాయల నిధులతో నెట్టుకొచ్చినట్లు బోర్డు తెలిపింది.
ఈ నెల 12వ తేదీ వరకు బోర్డు వద్ద కేవలం రూ.15 లక్షల 35 వేల రూపాయలు మాత్రమే ఉన్నాయని, ఉద్యోగులు, సిబ్బందికి ఏప్రిల్ నెల వేతనాలు ఇచ్చేందుకు కూడా అవి సరిపోవని కేఆర్ఎంబీ వివరించింది. బోర్డుకు దాదాపు ఏడున్నర కోట్లు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రక్రియ ప్రారంభించినట్లు తెలిసిందని, అయితే నిధులు మాత్రం ఇంకా అందలేదని పేర్కొంది. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి బోర్డు నిధులు విడుదలయ్యేలా చూడాలని తెలంగాణ సభ్యులకు సూచించింది.
అటు 2024-25 సంవత్సరం బడ్జెట్‌కు సంబంధించిన నిధులు కూడా త్వరగా విడుదలయ్యేలా చూడాలని రెండు రాష్ట్రాల సభ్యులను బోర్డు కోరింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రూ.11 కోట్ల తొమ్మిది లక్షలు, తెలంగాణ రాష్ట్రం 19 కోట్ల 64 లక్షల రూపాయలు ఇవ్వాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు పేర్కొంది.