Komuravelli Mallanna Pedda Patnam 2024 : సిద్దిపేట జిల్లాలో కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మహాశివరాత్రిని పురస్కరించుకుని తెల్లవారుజామున స్వామివారి పెద్దపట్నం కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతకుముందుగా గర్భాలయంలో లింగోద్భవ కాలంలో స్వామివారికి మహన్యాస ఏకాదశ రుద్రాభిషేకం కార్యక్రమాన్ని వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను కొమురవెల్లి పురవీధుల్లో భక్తుల జయజయ ధ్వానాల నడుమ ఊరేగించారు. తదుపరి తోట బావి వద్ద పెద్ద పట్నం కార్యక్రమాన్ని నిర్వహించారు.
కోలాహలంగా సాగిన పెద్దపట్నం : సుమారు మూడు గంటలకు పైగా ఒగ్గు కళాకారులు పంచ వర్ణాలతో పెద్ద పట్నాన్ని వేశారు. రాత్రంతా శివనామస్మరణతో జాగారాలు చేసిన భక్తులు పెద్ద పట్నాన్ని తొక్కేందుకు ఉత్సాహం కనబరిచారు. ముందుగా ఆలయ పూజారులు ఉత్సవ విగ్రహాలను తీసుకొని పట్నం దాటారు. అనంతరం భక్తులకు అనుమతించడంతో ఒక్కసారిగా పట్నంలోకి దూసుకొచ్చారు. ఈ క్రమంలో అక్కడ కొద్దిసేపటి వరకు తోపులాట జరిగింది. అప్రమత్తమైన పోలీసులు వారి లాఠీలకు పని చెప్పి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అనంతరం భక్తులను క్రమ పద్ధతిలో పంపించారు. పట్నం దాటుతూ బండారు తీసుకెళ్లేందుకు భక్తులు పోటీ పడ్డారు.
Pedda Patnam in Komuravelli on Mahashivratri : కొమురవెల్లి మల్లన్న క్షేత్రానికి ఏటా భక్తుల రద్దీ పెరుగుతూనే ఉంది. మూడు నెలల పాటు జరుగుతున్న ఈ బ్రహ్మోత్సవాల్లో లక్షలాది మంది భక్తులు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా తరలి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. సంక్రాంతి తరువాత వచ్చే మొదటి ఆదివారం నుంచి ప్రారంభమైన ఈ బ్రహ్మోత్సవాలు ఉగాది వరకు భక్తి శ్రద్ధలతో కొనసాగుతాయి.
Mahashivratri Celebration in Temples : ఇదికాగా మరోవైపు మహాశివరాత్రి పురస్కరించుకుని రాష్ట్రంలోని శివాలయాల్లో స్వామి వారి కల్యాణ మహోత్సవాలు ఘనంగా జరిగాయి. నల్గొండలోని పానగల్ ఛాయా సోమేశ్వర(Panagal Chaya Someswara Swamy) దేవాలయంలో శివపార్వతుల కల్యాణంతో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. స్వామీ వారి కల్యాణ మహోత్సవాన్ని చూడటానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు.
మూడు రోజుల పాటు జరిగే ఈ మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇవాళ తెల్లవారు జామున 4.30 గంటలకు అగ్నిగుండాలు, పల్లకి సేవ, సాయంత్రం తెప్పోత్సవం కార్యక్రమంతో ఉత్సవాలు ముగియనున్నాయి. నిర్మల్ జిల్లాలోని శ్రీ రాజ శ్యామల దేవి ఆలయం శివ పార్వతుల కల్యాణం సందర్భంగా శివనామస్మరణతో మారుమోగింది. అనంతరం మహా రుద్రాభిషేకం,మృత్యుంజయ పారాయణం చేపట్టారు. హనుమకొండ జిల్లా పరకాలలోని శ్రీ భవానీ కుంకుమేశ్వర స్వామి ఆలయంలో నిప్పులపై నడిచారు.
సండే ఎఫెక్ట్ - భద్రాద్రి, కొమురవెల్లి ఆలయాల్లో భక్తుల రద్దీ
కొమురవెల్లి మల్లన్న జాతరలో వైభవంగా ముగిసిన మొదటి ఘట్టం - అగ్నిగుండాలు దాటిన శివసత్తులు