Gudivada Assembly constituency Kodali Nani Vs Venigandla Ramu: కృష్ణా జిల్లా గుడివాడ రాష్టవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన అసెంబ్లీ స్థానం. ఒకప్పుడు దివంగత ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహించిన ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఆయన తర్వాతా ఇక్కడ ఆ పార్టీకి చెందిన వారే ఎమ్మెల్యేలుగా గెలుస్తూవచ్చారు. అలా 2004, 2009లో కొడాలి నాని గెలిచారు. 2009 తర్వాత వైఎస్సార్సీపీ గూటికి చేరారు. అప్పటి నుంచి రాజకీయ భిక్ష పెట్టిన తెలుగుదేశంపైనే ఇష్టారీతిన తెగబడ్డారు. నోరుపారేసుకున్నారు. ఆఖరికి చంద్రబాబు, లోకేష్‌తో పాటు వారి కుటుంబసభ్యులపైనా అత్యంత తీవ్రంగా వ్యక్తిగత దాడికి దిగారు. ఇలాంటి కొడాలిని ఓడించి ఆయనకు రాజకీయంగా కోలుకోలేని దెబ్బకొట్టాలని తెలుగుదేశం సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఈ ప్రయత్నంలో తెలుగుదేశం అభ్యర్థి రాము చాలా ముందజంలో ఉన్నారు. ఆయన ఈసారి గుడివాడలో తెలుగుదేశం జెండా ఎగరడం ఖాయమనే ధీమా వినిపిస్తోంది.
AP Elections 2024: విదర్భపురిగా అనేక దేవాలయాలతో గుడులవాడగా ప్రసిద్ధికెక్కిన ఘన చరిత్ర గుడివాడది. వర్తక, వాణిజ్యాలతోపాటు విద్య, వైద్య, రాజకీయ రంగాల ప్రముఖులకు ఈ గడ్డకు పెట్టింది పేరు. 1983లో తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ గుడివాడ శాసనసభ్యుడిగా ఎన్నికై రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. NTR స్వస్థలం నిమ్మకూరు కూడా ఒకప్పటి గుడివాడ నియోజకవర్గంలోనే ఉండేది. సొంత ఊరిపై మమకారంతో ఆయన తన రాజకీయ అరంగేట్రానికి గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గాన్నే కార్యశాలగా ఎంచుకున్నారు. 1985లోనూ ఎన్టీఆర్ గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన హయాంలో గుడివాడ రూపురేఖలు మారాయి. అందమైన రహదారులతోపాటు క్రీడాప్రియుల కోసం ఎన్టీఆర్ స్టేడియంను నిర్మించారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో తెలుగుదేశానికి పట్టున్న పామర్రు, పెదపారుపూడి మండలాలు పామర్రు నియోజకవర్గంలో కలిశాయి. నియోజకవర్గంలో దాదాపు రెండున్నర లక్షల మంది ఓటర్లున్నారు. 2009లో తెలుగుదేశం నుంచి గెలుపొందాక కొడాలి నాని వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకోవడంతో ఇక్కడ సమీకరణాలు మారాయి.
వైఎస్సార్సీపీలో చేరిన తర్వాత రెండు పర్యాయాలు కొడాలి నాని ఆ పార్టీ నుంచి గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించి అధికారంలోకి రావడంతో కొడాలి ఇష్టారీతన రెచ్చిపోయారు. క్యాసినో, జూదం, బెట్టింగ్‌ల నిర్వహణతో దేశవ్యాప్తంగా గుడివాడకు చెడ్డపేరు తెచ్చారు. సంక్రాంతి లాంటి పండుగ వస్తే చాలు విచ్చలవిడి జూదం నిర్వహణతో ప్రజల డబ్బు కొల్లగొట్టడంలో దిట్ట అనే పేరు సంపాదించుకున్నారు. ఎందరో మధ్యతరగతి జీవుల జీవితాలను చిన్నాభిన్నం చేయడంతోపాటు ధనికులనూ రోడ్డుపాలు చేశారు. స్థానిక ప్రజాప్రతినిధి కొడాలి నాని అండతో ఆయన అనుచరులు పేకాటలు, గుండాటలు యథేచ్ఛగా కొనసాగించారు. మంత్రిగా పనిచేసిన కొడాలి నేతృత్వంలోనే జూద గృహాల నిర్వహణను ఆయన అనుచరులు నడిపించేవారు.
నియోజకవర్గంలో తాగునీటి సమస్యతోపాటు రహదారుల సమస్య తీవ్రంగా ఉన్నా ఏనాడూ పట్టించుకోలేదు. నియోజకవర్గ సమస్యలపై దృష్టి పెట్టడం కన్నా ప్రతిపక్ష నాయకులపై బూతులతో విరుచుకుపడడానికే ప్రాధాన్యం ఇచ్చారు. కొడాలినానితో పాటు వైకాపా వ్యవహారశైలి పట్ల గత దశాబ్దకాలంగా విసిగిపోయిన ప్రజలు, ఈసారి కచ్చితంగా మార్పు కోరుకుంటున్నారన్నది సుస్పష్టం. రాజకీయ భిక్ష పెట్టిన అధినేత చంద్రబాబు లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగతంగా దూషించడం, దుర్భాషలాడటాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఓవైపు N.T.R. అభిమానినని చెప్పుకుంటూనే అసెంబ్లీ సాక్షిగా ఆయన బిడ్డను అవమానించారనే ప్రజాగ్రహమూ ప్రతికూలాంశంగా మారింది. నాని తన నోటి దురుసు, అహంకారంతో మాట్లాడిన మాటలు కూడా అతనికి ప్రజల్లో బాగా వ్యతిరేకతను పెంచాయి.
నియోజకవర్గంలోని నందివాడ, గుడ్లవల్లేరు, గుడివాడ రూరల్, గుడివాడ పట్టణ రహదారులు తీవ్ర అధ్వాన్న స్థితిలో ఉన్నాయి. గత నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించినా కొడాలి నాని తన పేరు చెప్పుకోవటానికి చేసిన ఒక్క అభివృద్ధి పనికూడా లేదనే భావన ప్రజల్లో ఉంది. ప్రస్తుతం నాని ప్రచారానికి వెళ్తున్న ప్రాంతాలన్నింటిలోనూ.. తాగునీళ్లు, కుళాయిలు, రహదారులు, డ్రైనేజీ సమస్యలపై మహిళలు, యువత బహిరంగంగానే నిలదీస్తున్నారు. గతంలో తమ ప్రభుత్వం అధికారంలో లేకపోవడం వల్ల ఏమీ చేయలేకపోతున్నానంటూ నాని చెప్పేవారని, ఇప్పుడు వాళ్లే ఉన్నా అదీ మంత్రిగా పనిచేసి కూడా ఏమీ చేయకుండా, అసలు ఈ ఐదేళ్లలో ఒక్కసారి కూడా కనిపించకుండా పోయారంటూ ఎక్కువ మంది అసహనం వ్యక్తం చేస్తున్నారు.
గుడివాడలో బెట్టింగ్ మాఫియా - యువత, ఉద్యోగులే లక్ష్యంగా ఎమ్మెల్యే అనుచరుల దందా - BETTING IN GUDIVADA
మరోవైపు గుడివాడలో నాని అనుచరుల అరాచకాలు మరీ శృతిమించిపోయాయి. నాని అండతో ఇసుక దోపిడీతో కోట్లు కొల్లగొట్టారు. మట్టి దందా యథేచ్ఛగా సాగింది. కనిపించిన భూమినంతా కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. పోలీసులు, అధికారులను తమ చెప్పుచేతల్లో ఉంచుకుని అరాచకాలకు పాల్పడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లు 90శాతం పూర్తైనా మిగిలిన 10శాతం నామమాత్రపు పనులు కూడా పూర్తి చేయలేదు. ఎన్నికలకు ముందు దీనిని తనకు అనుకూలంగా మలచుకునేందుకు అసలు లబ్ధిదారుల్ని మార్చేసి హడావుడిగా ముఖ్యమంత్రి చేత వాటిని ప్రారంభింపచేశారు. కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా కేవలం చంద్రబాబు పేరు లేకుండా చేసి తన పేరు చాటుకోవాలనే దురుద్దేశంతో ఇదంతా చేశారనే తీవ్ర విమర్శలు మూటగట్టుకున్నారు.
గుడివాడలో ఈసారి కచ్చితంగా తెలుగుదేశం జెండా ఎగరేసి కొడాలి నానికి గట్టి బుద్ధి చెప్పాలనే పట్టుదలతో తెలుగుదేశం పార్టీ వెనిగండ్ల రామును ఎన్నికల బరిలో దింపింది. ప్రజల నుంచి వస్తున్న మద్దతు చూస్తే ఎమ్మెల్యే కొడాలి నాని హవాకు ఈసారి ముగింపు పడబోతోందని స్పష్టంగా అర్థమవుతోంది. ఏడాదికిపైగా రాము గుడివాడలో పాగా వేసి అన్ని వర్గాలతో మమేకమయ్యారు. తెలుగుదేశం సీనియర్ నేతలు మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, పిన్నమనేని వెంకటేశ్వరరావు, యలవర్తి శ్రీనివాసరావు సహా గుడివాడకు చెందిన మహామహులంతా ఏకతాటిపైకి వచ్చి రాము గెలుపు కోసం పనిచేస్తున్నారు. కొడాలి నాని అరాచకాలను విస్తృతంగా జనంలోనికి తీసుకెళుతుండడంతో వైఎస్సార్సీపీ నుంచి ఊహించని రీతిలో నిత్యం తెలుగుదేశంలోకి వలసలు పెరిగాయి. కీలక నాయకులంతా వైఎస్సార్సీపీని వీడి బయటకొస్తున్నారు. నందివాడ మండలంలో వైఎస్సార్సీపీ పట్టు తగ్గిందనే భావనా సర్వత్రా వ్యక్తమవుతోంది.
ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వెనిగండ్ల రాము భార్య దళిత కాలనీల్లో జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. పబ్లిసిటీకి దూరంగా ఇంటింటికీ ఈమె చేస్తున్న ప్రచారం ఆయా వర్గాల ప్రజల మన్నల్ని పొందుతున్నారు. గత రెండేళ్ల నుంచి సేవా కార్యక్రమాలతో గుడివాడలో వెనిగండ్ల రాము తన ప్రత్యేకత చాటుకున్నారు. వరదల సమయంలో రైతులకు రాము అండగా నిలిచారు. సొంత నిధులతో సాయమందించారు. నియోజకవర్గంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ప్రతి ఓటరుకు దగ్గర అయ్యారు. గత రెండు పర్యాయాలు తెలుగుదేశం పార్టీలో ఉన్న అంతర్గత వర్గ విభేదాల వల్లే ఆ పార్టీ నష్టపోయిందన్న భావనకు చెక్ పెడుతూ రాము అందరినీ కలుపుకొని సౌమ్యుడిగానూ, అందరివాడుగా పేరు తెచ్చుకున్నారు. జనసైనికులు సైతం ఈసారి తెలుగుదేశం పార్టీకి ఇక్కడ పూర్తిస్థాయిలో సహకరిస్తుండటం రాముకు కలిసొచ్చే అంశం. అహంకారంతో గత రెండు దశబ్దాలుగా గుడివాడ అడ్డాలో విర్రవీగిన కొడాలినానికి తాజా ఎన్నికల్ని చివర ఎన్నికలు చేసి, రాజకీయ సమాధి కడతామనే ధీమాను పసుపు శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇప్పటివరకూ మంత్రులుగా పనిచేసిన వారు తదుపరి ఎన్నికల్లో గెలవని సెంటిమెంట్ సైతం కొడాలినాని వర్గాన్ని డీలా పడేలా చేసింది.