Attack on Student in Tirupati : చిన్నప్పటి నుంచి తెలిసిన యువకుడితో ఐదు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న ఓ యువతి, కొంతకాలంగా ప్రేమిస్తున్న సహ విద్యార్థిపై కత్తిపోటుకు కుట్ర పన్నింది. సినిమా చూద్దామని అతన్ని థియేటర్‌కు పిలిపించింది. అక్కడే పాత ప్రియుడిని దాడికి ఉసిగొల్పింది. ఈ ఘటన తిరుపతిలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి తిరుపతి తూర్పు స్టేషన్ సీఐ మహేశ్వరరెడ్డి, ఎస్సై నాగేంద్రబాబు తెలిపిన వివరాలు ప్రకారం ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం పల్లిగుంటిపల్లెకు చెందిన లోకేశ్ తిరుపతిలో పారామెడికల్ సెకండియర్ చదువుతున్నాడు.
ఆ యువకుడు తిరుపతి జిల్లా సూళ్లూరుపేటకు చెందిన సహచర విద్యార్థినితో కొంతకాలంగా ప్రేమలో అన్నారు. శనివారం ఆ యువతి సినిమాకు వెళ్దామని వారిద్దరికీ టికెట్ బుక్ చేసింది. లోకేశ్ హాస్టల్ నుంచి బైక్‌పై థియేటర్‌కు రాగా ఆమె ఆటోలో వచ్చింది. ఇద్దరూ తమ సీట్లలో కూర్చున్నారు. కాసేపటికి తిరుపతి జిల్లా తడ మండలం అండగుండాలకు చెందిన కార్తీక్ ముందువరుసలో ఉన్న లోకేశ్ పొత్తికడుపుపై కత్తితో పొడిచాడు. వెంటనే కార్తీక్, యువతి థియేటర్ నుంచి బయటపడి, బైక్‌పై పారిపోయారు.
Stabbed Case in Tirupati Updates : ఈలోగా లోకేశ్ వాష్‌రూమ్‌కు వెళ్లి గాయాన్ని క్లీన్ చేసేందుకు ప్రయత్నించాడు. ఇది గమనించిన థియేటర్ సిబ్బంది బాధితుడిని రుయా ఆస్పత్రికి తరలించారని సీఐ మహేశ్వరరెడ్డి తెలిపారు. మరోవైపు తనపై దాడిని దాచిపెట్టిన లోకేశ్ కింద పడటంతో గాయమైందని చెప్పాడని పేర్కొన్నారు. చివరకు దీనిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు.
వ్యూహం రచించిన యువతి : మరోవైపు ఈ ఘటనకు కారణమైన సదరు యువతి తనకు బంధువైన కార్తీక్‌తో ఐదు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నట్లు తెలిసింది. పదో తరగతి వరకు చదువుకున్న కార్తీక్ ప్రస్తుతం జులాయిగా తిరుగుతున్నాడు. అతనితో ఆమె నిత్యం ఫోన్‌లో మాట్లాడుతూనే, మరోపక్క క్లాస్‌మేట్ లోకేశ్‌తోనూ చనువుగా ప్రవర్తించింది. పైగా ఒకరి విషయాలు మరొకరితో పంచుకునేదని, దీంతో వారి మధ్య కక్షలు పెరిగాయి. శుక్రవారం కార్తీక్ తిరుపతికి రాగా, ఇద్దరూ కలిసి లోకేశ్‌పై దాడికి పథకం రచించారు. సినిమాకు వెళ్దామని చెప్పి లోకేశ్‌కూ, తనకు ముందు వరుసలో, కార్తీక్‌కు వెనుక వరుసలో వచ్చేలా ఆమె సినిమా టికెట్లు బుక్ చేసింది. దాడి తర్వాత ప్రేమికులు ఇద్దరూ బైక్‌పై శ్రీకాళహస్తి వైపు వెళ్లినట్లు తెలుస్తోంది.