Kishan Reddy oath as Cabinet Minister : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. దిల్లీలో నిర్వహించిన బీజేపీ ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవంలో, రెండోసారీ కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇంతకుముందు మోదీ మంత్రివర్గంలో కేంద్ర పర్యాటక శాఖమంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే.
Kishan Reddy Political Journey : 1960లో రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్‌లో రైతు కుటుంబంలో జన్మించిన కిషన్‌రెడ్డి, జయప్రకాశ్ నారాయణ స్ఫూర్తితో జనతా పార్టీ యువ కార్యకర్తగా రాజకీయాల్లోకి వచ్చారు. బీజేవైఎమ్లో అఖిల భారత కార్యదర్శిగా, జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు.
2004లో హిమాయత్‌నగర్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత అంబర్‌పేట నుంచి పోటీ చేసి, హ్యాట్రిక్ విజయాలు సొంతం చేసుకున్నారు. బీజేపీ శాసనసభాపక్షనేతగాను పనిచేశారు. 2010 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా అవకాశం దక్కించుకున్నారు. రాష్ట్ర విభజన అనంతరం కాషాయా పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా కొనసాగారు.
మోదీ కేబినేట్లో రెండోసారి కేంద్రమంత్రిగా స్థానం : 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయిన కిషన్‌రెడ్డి, అనంతరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి ఎంపీగా విజయం సాధించారు. తర్వాత అనూహ్యంగా మోదీ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు.2019 మే నుంచి 2021 జూలై వరకు కేంద్రహోంశాఖ సహాయమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.
2021 జూలై నుంచి కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2023జూలై నుంచి నాలుగోసారి భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్‌పై గెలుపొంది, కేబినేట్లో రెండోసారి కేంద్రమంత్రిగా స్థానం సంపాదించుకున్నారు.
తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం పనిచేస్తాం : ప్రమాణస్వీకారానికి ముందు దిల్లీలో మాట్లాడిన కిషన్‌రెడ్డి, సంకల్పపత్రం పేరుతో సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి వచ్చే అయిదేళ్లు అంకితభావంతో పని చేస్తామని స్పష్టం చేశారు. అదేవిధంగా గత పదేళ్లలో దేశవ్యాప్తంగా నాలుగు కోట్ల ఇళ్లు నిర్మించామని, రాబోయే రోజుల్లో పేదలకు మరో 3 కోట్ల ఇళ్లు నిర్మిస్తామని వివరించారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం పనిచేస్తామని కిషన్‌రెడ్డి తెలిపారు.