BJP Telugu Version Manifesto 2024 : ప్రధాని మోదీ పదేళ్ల పాలనలో అన్ని రంగాల్లో దేశం అభివృద్ధి చెందిందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. రానున్న రోజుల్లో భారత్‌ను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చుతామని మోదీ గ్యారంటీలో ప్రస్తావించారు. దేశ భవిష్యత్తు కోసమే వన్ నేషన్, వన్ ఎలక్షన్ అని కిషన్‌రెడ్డి పునరుద్ఘాటించారు. హైదరాబాద్ నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఇవాళ బీజేపీ తెలుగు వెర్షన్ సంకల్ప పత్రాన్ని(మేనిఫెస్టో) బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌తో కలిసి కిషన్‌రెడ్డి విడుదల చేశారు.
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా జాతీయ మేనిఫెస్టో : కిషన్ రెడ్డి - Kishan Reddy on BJP Manifesto 2024
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ, రాష్ట్ర అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. దేశంలో అనేక సమస్యలను మోదీ పరిష్కరించారని, అందుకే ప్రధాని మోదీ నాయకత్వం దేశానికి, దేశ భవిష్యత్‌కు అవసరం అన్నారు. మోదీ లేని భారతావనిని ఊహించుకోలేమన్నారు. కేంద్రంలో మరోసారి బీజేపీ సర్కార్ అధికారంలోకి వస్తుందని, మోదీ మూడోసారి భారత ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు.
"మూడు దశాబ్దాల తరవాత ప్రధాని మోదీ నేతృత్వంలో స్థిరమైన, సమర్థవంతమైన ప్రభుత్వం ఈ దేశంలో ఏర్పాటైంది. పోలీసుల మీద రాళ్లు రువ్వలేనటువంటి భారతావనిని మోదీ గ్యారంటీ పేరుతో నిర్మాణం చేస్తున్నాం. మనం ఐదవ ఆర్థిక అతిపెద్ద వ్యవస్థగా ఇండియాను నిర్మించడంలో ప్రధాని విజయం సాధించారని మనవి చేస్తున్నాను. నాణ్యమైన విద్య, అందరికీ అందుబాటులో వైద్యం, తినడానికి తిండి మోదీ గ్యారంటీ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను."-కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
సంకల్ప పత్రాన్ని వివరించిన కేంద్రమంత్రి, వచ్చే ఐదేళ్లలో దేశంలోని పేద, మధ్యతరగతి వర్గాల వారికి సొంతింటి కల సాకారం చేసే దిశగా మరో 3 కోట్ల ఇళ్లను నిర్మిస్తామని స్పష్టం చేశారు. పేపర్ లీకేజ్ అరికట్టేందుకు కఠిన చట్టాలు తీసుకొచ్చినట్లు వివరించారు. అదేవిధంగా పోస్టాఫీసులను మినీ బ్యాంకులుగా మార్చేస్తున్నట్లు తెలిపారు. 2047 నాటికి వికసిత భారత్ పేరుతో బీజేపీ ముందుకెళ్తోందన్న ఆయన, కాంగ్రెస్ పార్టీ ఇంకా అవినీతి, బంధుప్రీతిని వదిలిపెట్టలేదని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నేత, ఎంపీ లక్ష్మణ్, ఇతర కమలం నాయకులు పాల్గొన్నారు. కాగా, 2024 లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ సంకల్ప పత్ర పేరుతో జాతీయ మేనిఫెస్టోను విడుదల చేసిన విషయం తెలిసిందే. హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా ప్రజాకర్షక మేనిఫెస్టో రూపొందించిన కాషాయ దళం, ఇందులో ప్రధానంగా 14 హామీలను పేర్కొంది.
BJP MP Laxman Fires on Congress : కాంగ్రెస్ న్యాయ పత్రాన్ని ప్రజలు అన్యాయ పత్రంగా భావిస్తున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ ఆరోపించారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి వికసిత భారత్ కోసం కాషాయ పార్టీ పాల్పడుతుంటే, కాంగ్రెస్ విభజిత భారత్ కోసం నినదిస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. రూ.12లక్షల కోట్లు దోచుకున్న కాంగ్రెస్ పేరు ఇండియాగా మార్చుకున్నంత మాత్రాన వారు మారరు అని స్పష్టం చేశారు. న్యాయ పత్రంలో బ్రిటిష్ ఆనవాళ్లు కొనసాగిస్తూ విభజించు - పాలించు లాగా ఉంది అని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ న్యాయ పత్రం ముస్లింలీగ్ మాదిరిగానే మేనిఫెస్టో ఉందన్నారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి మచ్చుకైనా కనిపించడం లేదన్నారు. కాంగ్రెస్ న్యాయ పత్రానికి భిన్నంగా బీజేపీ సంకల్ప పత్రం ఉందన్నారు. మైనార్టీజం పేరుతో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ ప్రజల మనోగతంను గాయపరుస్తుందని మండిపడ్డారు. కేవలం ఓట్ల కోసమే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీలతో మోసం చేస్తుందన్నారు. ఉచితాలు - గ్యారంటీలతో కాంగ్రెస్ మోసం చేస్తుందని ధ్వజమెత్తారు. సంకల్ప పత్రాన్ని బీజేపీ పవిత్ర పత్రంగా భావిస్తోంది అని లక్ష్మణ్ పేర్కొన్నారు.
ప్రజల సలహాల నుంచే మేనిఫెస్టో- మోదీ అభివృద్ధిని చాటేలా బీజేపీ ప్రచారం