Kishan Reddy Oath as a Central Minister : బీజేపీలోకి ఒక సాధారణ యువనాయకుడిగా ప్రవేశించి కేంద్ర మంత్రిగా ఎదిగి తన నాయకత్వాన్ని దేశ ప్రజలకు చాటి చెప్పారు. నిత్యం ప్రజల సమస్యల తరుఫున పాటుపడుతూ, పార్టీ సిద్ధాంతాలను పాటిస్తూ ఎప్పటికప్పుడు తనను అభివృద్ధి చేసుకుంటు ఎదిగిన వ్యక్తి. సాధారణ నాయకుడి నుంచి కేంద్ర మంత్రి పదవి అది కూడా మూడోసారి బాధ్యతలు చేపట్టారు, అతనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. తెలంగాణ ఉద్యమంలో తన గళం వినిపిస్తూ పోరుయాత్ర చేసిన మహానీయుడు. రాష్ట్ర అభివృద్ధే తన జీవిత లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వాన్ని నిత్యం సమస్యలను ఎత్తి చూపుతూ ముందడుగు వేశారు. అలాంటి వ్యక్తి జీవిత చరిత్రను తెలుసుకుందాం.
Kishan Reddy Life Story : స్వామిరెడ్డి, ఆండాలమ్మ దంపతులకు రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపురం గ్రామంలో కిషన్ రెడ్డి జన్మించారు. టూల్ డిజైనింగ్‌లో డిప్లొమా చేశారు. 1995లో వివాహం చేసుకున్నారు. జయప్రకాశ్ నారాయణ స్పూర్తితో జనతా పార్టీ యువకార్యకర్తగా 1977లో రాజకీయ రంగప్రవేశం చేశారు. 1980 నుంచి 81 వరకు బీజేవైఎం రంగారెడ్డి కమిటీ కన్వీనర్‌గా పని చేశారు. 1982 నుంచి 83 వరకు బీజేవైఎం కోశాధికారిగా పనిచేశారు. 1986 నుంచి 1990 వరకు బీజేవైఎం ఉమ్మడి రాష్ట్రానికి అధ్యక్షుడిగా 5 సంవత్సరాలు పని చేశారు.
Kishan Reddy Political Career : 1990 నుంచి 1992 వరకు బీజేవైఎం అఖిల భారత కార్యదర్శిగా పనిచేశారు. 1992 నుంచి 1994 వరకు జాతీయ ఉపాధ్యక్షునిగా 1994 నుంచి 2001వరకు జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2001 నుంచి 2002 వరకు బీజేపీ రాష్ట్ర కోశాధికారిగా పనిచేశారు. 2002లో భారతీయ జనతా యువ మోర్చా జాతీయాధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2003 నుంచి 2005 వరకు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.
Kishan Reddy Political Career After MLA : కిషన్ రెడ్డి 2004లో తొలిసారిగా హిమాయత్ నగర్ శాసనసభ స్థానం నుంచి విజయం సాధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అడుగుపెట్టారు. 2009, 2014లో అంబర్‌పేట నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2010 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2014 నుంచి 2016 వరకు తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా సేవలు అందించారు. 2018లో జరిగిన ముందస్తు శాసనసభ ఎన్నికల్లో 1016 ఓట్లతో ఓడిపోయారు.
Kishan Reddy Political Career as a MP : : 2019లో సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. దీంతో మొదటిసారి హోంశాఖ సహాయమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవిలో 2019 నుంచి 2021 వరకు కొనసాగారు. అనంతరం ఆయన సేవలకు కేంద్ర ప్రభుత్వం మెచ్చి 2021లో స్వతంత్ర హోదాలో కేంద్ర పర్యాటకశాఖ మంత్రిగా అవకాశం కల్పించింది. 2023లో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని చేపట్టారు. 2024 వరకు రెండో కేంద్ర మంత్రి పదవిలో కొనసాగారు. మళ్లీ 2024లో సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ అత్యధిక మెజారిటీతో రెండోసారి గెలుపొందారు. మరోసారి మోదీ ప్రభుత్వం కేంద్ర మంత్రి వర్గంలో చోటు లభించింది.
Bandi Sanjay Oath as a Central Minister: పన్నెండేళ్ల వయస్సులోనే రాజకీయాలపై ఆసక్తి చూపించి, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో చేరారు. అక్కడ తాను చురుకుగా పని చేసి అందరి మన్ననలు పొందారు. అక్కడి నుంచి క్రమంగా ఎదుగుతూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా సేవలు అందించారు. ఈ పదవిలో ఉన్నప్పుడు మరింత చురుకుగా పని చేసి, రాష్ట్రంలో బీజేపీని ముందుకు నడిపించారు. అనంతరం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. ఆయనే కరీంనగర్ నుంచి లోక్‌సభ స్థానానికి ఎన్నికైన బీజేపీ అభ్యర్థి బండి సంజయ్. అతని రాజకీయ జీవితం గురించి వివరాలు.
Bandi Sanjay Political Career : బండి సంజయ్ 1971లో కరీంనగర్లో జన్మించారు. బాల్యం నుంచే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో స్వయం సేవకుడిగా పని చేశారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)లో పట్టణ కన్వీనర్, పట్టణ ఉపాధ్యక్షునిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా, ది కరీంనగర్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్‌లో రెండు పర్యాయాలు (1994-1999, 1999-2003) డైరెక్టర్‌గా పని చేశారు. ఎల్.కె. అడ్వానీ చేపట్టిన సురాజ్ రథ యాత్రలో వెహికల్ ఇంఛార్జీగా బాధ్యతలు నిర్వర్తించారు.
Bandi Sanjay Political Journey : కరీంనగర్ నగర పాలక సంస్థగా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా 48వ డివిజన్ నుంచి బీజేపీ కార్పొరేటర్‌గా, రెండోసారి అదే 48వ డివిజన్ నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించారు. వరుసగా రెండు పర్యాయాలు కరీంనగర్ బీజేపీ అధ్యక్షునిగా సేవలు అందించారు. 2019 ఓబీసీ వెల్ఫేర్ పార్లమెంట్ కమిటీ మెంబర్, అర్బన్ డెవలప్మెంట్ పార్లమెంట్ కమిటీ మెంబర్, టొబాకో బోర్డు మెంబర్‌గా నియామకం అయ్యారు.
Bandi Sanjay as a Central Minister : 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి 96 వేల పైచిలుకు ఓట్లతో ఘన విజయం సాధించారు. 2020లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా నియామకం అయ్యారు. 2023 జులైలో అధ్యక్ష బాధ్యతల నుంచి బండి సంజయ్‌ని తప్పించి జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా 2.25 లక్షల ఓట్ల మెజారిటీతో రెండోసారి విజయం సాధించారు. రెండోసారి విజయం సాధించిన బండి సంజయ్‌కు కేంద్ర మంత్రివర్గంలో తొలిసారి అవకాశం దక్కింది. కిషన్ రెడ్డి సహా ఈయనకూ కేంద్రమంత్రి పదవి దక్కింది.