Killi Kruparani Resigned to YSRCP : కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి వైసీపీకి రాజీనామా చేశారు. పార్టీలో గత కొంతకాలంగా తనకు తగిన ప్రాధాన్యం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను వైసీపీ అధినేత, సీఎం జగన్‌కు పంపారు. రాజీనామా నేపథ్యంలో కిల్లి త్వరలో కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె కుమారుడు విక్రాంత్‌కు టెక్కలి అసెంబ్లీ, కృపారాణి శ్రీకాకుళం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతోంది.
కేబినెట్ ర్యాంకు పదవి ఇస్తామన్నారు: వైసీపీలో తనకు అన్యాయం జరిగిందంటూ కృపారాణి మీడియా సమావేశంలో కన్నీరు పెట్టుకున్నారు. తాను ఇలాంటి రోజు వస్తుందని ఊహించలేదని తెలిపారు. నా పుట్టినిల్లు, మెట్టినిల్లు శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ అంతా వైసీపీలో ఉందని, అందుకే తన కుటుంబం అని భావించి ఆ వైసీపీలో చేరినట్లు తెలిపారు. గతంలో కేబినెట్ ర్యాంకు పదవి ఇస్తామని తనను వైసీపీలోకి ఆహ్వానించారని ఆమె తెలిపారు. 2019లో పార్లమెంట్‌కి పోటీ చేయమన్నారని, జగన్‌ను కలిసినప్పుడు కార్యకర్తగా పని చేయాలని చెప్పారని, తనకు తగిన గుర్తింపు ఇస్తానని జగన్ హామీ ఇచ్చారని తెలిపారు. ఎంపీ అభ్యర్థిగా టికెట్ ఇస్తామని విజయసాయిరెడ్డి చెప్పారని, కానీ అభ్యర్థుల జాబితాలో తన పేరు లేదని వాపోయారు.
పథకం ప్రకారం అణచి వేయాలని చూశారు: తనకు జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారో, ఎందుకు తీసేశారో తెలియదు. వైసీపీలో ఉండాలంటే తిట్లు వచ్చే వాళ్లే ఉండాలి. తనకు తిట్టడం రాదనే పక్కన పెట్టారు.తాను పదవి కోరుకోలేదని, గౌరవం కోరుకుంటున్నాను. సీఎం జిల్లాకు వస్తే తనను హెలిప్యాడ్ దగ్గరకు రాకుండా చేశారు. తనను పథకం ప్రకారం అణచి వేయాలని చూశారు. అందుకే వైసీపీకి రాజీనామా చేస్తున్నాను. తనను గౌరవించే పార్టీలోకి వెళ్తా. నా బలమేంటో త్వరలో చూపిస్తా. పోటీ చేయకుండా ఊరుకోను. కచ్చితంగా పోటీలో ఉంటా. -కిల్లి కృపారాణి
కాంగ్రెస్‌కు కిల్లి టాటా.. 28న వైకాపాలోకి!
తొలి అవకాశంలోనే కిల్లి కేంద్ర మంత్రి: 2009 ఎన్నికల్లో కృపారాణి శ్రీకాకుళం లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. అప్పట్లో టీడీపీకి చెందిన దివంగత నేత, రాజకీయ ఉద్దండుడు కింజరాపు ఎర్రన్నాయుడిని ఓడించి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. తొలి అవకాశంలోనే కిల్లి కేంద్ర మంత్రి పదవి దక్కించుకున్నారు. గతంలో జిల్లా రాజకీయాలకు కేంద్ర బిందువుగా వ్యవహరించిన ఆమె, 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. వెంటనే కిల్లికి వైసీపీ జిల్లా అధ్యక్షురాలిగా బాధ్యతలు అప్పగించారు.