Khammam MP Candidates 2024 : శాసనసభ ఎన్నికల్లో రాష్ట్ర రాజకీయాలను తమవైపు తిప్పుకున్న ఖమ్మం పార్లమెంటు ఎన్నికల వేళ మళ్లీ రసవత్తరంగా మారుతున్నాయి. ఖమ్మం లోక్‌సభ బరిలో నిలిచే అభ్యర్థి ఎంపిక అధికార కాంగ్రెస్‌లో తుది అంకానికి చేరుకుంది. ఆశావహుల నుంచి అభ్యర్థి ఎంపిక దాకా ఆచితూచి అడుగులు వేస్తున్న హస్తం పార్టీ భారీ మెజార్టీతో లోక్‌సభ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు పటిష్ఠ కార్యాచరణతో ముందుకు సాగుతోంది. ఈ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారీ ఆధిక్యాలతో విజయబావుటా ఎగురవేసిన కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ స్థానాన్ని తన ఖాతాలో వేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది.
పార్టీ టికెట్ కోసం దాదాపు డజను మంది పోటీ పడుతున్నా ప్రధాన పోటీ నలుగురు మధ్యే ఉన్నట్లు కనిపిస్తోంది. ముగ్గురు మంత్రుల కుటుంబీకులైన పొంగులేటి ప్రసాద్‌రెడ్డి, తుమ్మల యుగంధర్, మల్లు నందినీ విక్రమార్కతో పాటు వీవీసీ ట్రస్టు అధినేత వంకాయలపాటి రాజా టికెట్ కోసం పోటీపడుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు వి.హనుమంతరావు, జెట్టి కుసుమకుమార్ ఇక్కడి నుంచే బరిలోకి దిగేలా పార్టీ పెద్దల వద్ద ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ పరంగా అంతర్గత సర్వే నిర్వహించి ముగ్గురి జాబితాను అధిష్ఠానానికి పంపించింది. వీరిలో ఒకరిని ఎంపిక చేసేందుకు తుది కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ హస్తినలో జరిగే కేంద్ర ఎన్నికల కమిటీ కీలక భేటీలో అభ్యర్థి ఎంపికపై తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మహబూబ్‌నగర్‌లో ఎన్నికల హీట్ - ఎమ్మెల్సీ పదవిపై ప్రధానపార్టీల ఫోకస్
Khammam Lok Sabha Polls 2024 : సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా భారత రాష్ట్ర సమితి పావులు కదుపుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో ఓటమి పాలైనప్పటికీ లోక్‌సభ స్థానాన్ని నిలబెట్టుకోవాలన్న కసితో కార్యాచరణకు సమాయత్తమవుతోంది. మిగతా పార్టీల కన్నా ముందే అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావును మరోసారి బరిలో నిలిపిన బీఆర్ఎస్ అధినేత ఎన్నికల ప్రచారం, గెలుపు వ్యూహాలపై ఇటీవలే ముఖ్యనేతలకు దిశానిర్దేశం చేశారు. అభ్యర్థి ప్రకటన పూర్తికావడంతో ఎన్నికల శంఖారావం పూరించేందుకు బీఆర్ఎస్ సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగా ఇవాళ ఖమ్మంలో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశానికి హాజరుకానున్న కేటీఆర్ ఎన్నికల సైరన్ మోగించనున్నారు.
Parliament Election Heat In Khammam : గతంలో ఎన్నడూలేని విధంగా ఈ సారి లోక్‌సభ ఎన్నికల పోరులో సత్తాచాటాలని కమలదళం భావిస్తోంది. మోదీ చరిష్మాతో ఈ సారి ఎలాగైనా ఖమ్మం లోక్‌సభ స్థానంలో సత్తాచాటేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. ఇప్పటికే ఆశావహుల అభ్యర్థులపై వడపోత పూర్తిచేసిన ఆ పార్టీ నాయకత్వం సరైన వారి కోసం అన్వేషణ సాగిస్తోంది. సామాజిక సమీకరణాల లెక్కలు తీసి మరీ అభ్యర్థి ఎంపికపై ఆచితూచి అడుగులు వేస్తోంది. తొలి జాబితాలో ఖమ్మం అభ్యర్థిని ప్రకటించని బీజేపీ రెండో జాబితాలో ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. బీజేపీ నేతలు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, గల్లా సత్యనారాయణ, డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు, తాండ్ర వినోద్ రావు అభ్యర్థి రేసులో ముందున్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అటు కమ్యూనిస్టు పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల నుంచి కాంగ్రెస్‌తో పొత్తులో ఉన్న సీపీఐ ఒక్క లోక్‌సభ స్థానంలోనైనా పోటీ చేయాలని భావిస్తోంది. కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా తమకు ఖమ్మం స్థానం కేటాయించాలని కోరుతోంది. అటు సీపీఎం సైతం రెండు నియోజకవర్గాల్లో పోటీచేసేందుకు సిద్ధం కాగా ఖమ్మం నుంచి పోటీ చేయటమైతే ఖాయమని ప్రకటించింది. మరికొన్ని రోజుల్లో షెడ్యూల్ రానుండగా వ్యూహ ప్రతి వ్యూహాలతో అధికార ప్రతిపక్షాలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి.
రేపే కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల జాబితా - ఆశావహుల్లో ఉత్కంఠ
గెలుపు దిశగా కాంగ్రెస్ వ్యూహాత్మక అడుగులు - 14 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులు ఖరారు!