Khammam Farmers Facing Problems For Irrigation Water : ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పంట కాల్వలు అస్తవ్యస్తంగా మారాయి. ఖమ్మం జిల్లాలో సాగర్ ఆయకట్టుతో పాటు ఉభయ జిల్లాల్లో ప్రధానమైన సాగునీటి వనరుల ద్వారా ఆయకట్టుకు సాగు నీరందించేందుకు పంట కాల్వలు ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో సాగు నీరందించాల్సిన కాలువలు, చెరువులు దయనీయంగా మారాయి. ఏటా వర్షాకాలానికి ముందు జిల్లాల వారీగా మరమ్మతులకు ప్రతిపాదనలు సిద్ధం చేసి, పనులు చేపట్టాల్సి ఉంది. ఈ తంతు ఏటా సాగుతూనే ఉన్నా, నిధులు హారతి కర్పూరంలా కరుగుతూనే ఉన్నాయి. కానీ కాల్వల దుస్థితి మాత్రం మారడం లేదని స్థానిక రైతులు ఆవేదన చెందుతున్నారు.
అసలు నీరందే పరిస్థితే లేదు : వైరా నియోజకవర్గంలోని వైరా జలాశయం కుడి ప్రధాన కాలువ, 25 వేల ఎకరాలకు పైగా సాగు నీరు అందించే వైరా మధ్యతరహా ప్రాజెక్టు కాల్వలు అధ్వానంగా తయారయ్యాయి. ఉపాధి హామీ పథకం కింద కాలువల్లో కొన్నిచోట్ల మాత్రమే పూడిక తీశారు. మిగిలిన చోట్ల అధ్వానంగా ఉంది. దీంతో కట్టలు కుంగిపోయి కాలువ ఆనవాళ్లు కోల్పోయింది. చాలాచోట్ల పెరిగిన చెట్లతో నీరు పారే పరిస్థితి లేదు.
Paddy Crop Damage in khammam : సాగునీరు లేక పంట పొలాలు వెల వెల.. లబోదిబోమంటున్న కర్షకులు
కాలువలు బాగు చేయకపోతే చివరి ఆయకట్టు రైతులకు ఇబ్బందులు తప్పేలా లేవు. ఈ నియోజకవర్గమే కాదు వ్యవసాయ ప్రాధాన్యం ఉన్న పాలేరు, మధిర, సత్తుపల్లి, అశ్వారావుపేట, ఇల్లందు నియోజకవర్గాల్లోనూ పంట కాల్వల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని, సంబంధిత అధికారులు కాలువులు, చెరువుల మరమ్మతులు పూర్తి చేసి సాగు నీరందించే విధంగా చర్యలు చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
"అసలు ఆ కాలువను పట్టించుకునే నాథుడే లేడు. అడిగితే వేరే అధికారులు ఉన్నారు అంటారు. పనులు మాత్రం మొదలు పెట్టరు. పంట పండించుకుందామంటే నీరు లేవు. కాలువల్లో చెట్లు పెరిగిపోయాయి. నీళ్లు వద్దు అన్నప్పుడు వస్తాయి. కావాలి అన్నప్పుడు రావు. కాలువ పూడిక తీయాలి. ర్యాంప్ కట్టించాలి. పెద్ద కాలువను చిన్న పిల్ల కాలువలాగా చేశారు. దాన్ని విస్తరించాలి." - స్థానిక రైతులు
చేయాల్సింది కొండంత : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 119 పనులకు మరమ్మతులు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటి వరకు 60 పనులు పూర్తి చేశారు. మిగిలిన పనులు పురోగతిలో ఉన్నాయి. ఈ పనులకు మొత్తం రూ.12.16 కోట్లు మంజూరవగా, కేవలం 3.60 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. మిగిలిన పనులు చేపట్టాల్సి ఉంది. ఖమ్మం జిల్లాలో మొత్తం 109 పనులు చేపట్టారు. వీటి మరమ్మతుల కోసం రూ.12.81 కోట్లు కేటాయించారు. వీటిలో రూ.1.92 కోట్లతో చేపట్టిన 30 పనులు మాత్రమే పూర్తయ్యాయి. రూ.2.9 కోట్లతో చేపట్టిన మరో 41 పనులు పురోగతిలో ఉన్నాయి. మరో 19 పనులకు సంబంధించిన ఒప్పందాలు పూర్తయ్యాయి. మిగిలిన పనులు మొదలు కావాల్సి ఉంది. అంటే జల వనరుల శాఖ లక్ష్యం మేరకు కనీసం 50 శాతం పనులు కూడా పూర్తి కాలేదని తెలుస్తోంది.