Khairtabad Ganesh 2024 Height : తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాతి గాంచిన ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ తయారీ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఖైరతాబాద్ మహా గణపతిని 1954లో తొలిసారిగా ప్రతిష్ఠించారు. ఖైరతాబాద్ లంబోదరుడు ప్రతి ఏడాది ఓ ప్రత్యేక అవతారంలో దర్శనమిస్తాడు. ఈ ఏడాదితో ఖైరతాబాద్ మహాగణపతి 70 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా 70 అడుగుల మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించాలని నిర్వాహకులు నిర్ణయించారు.
ప్రతి ఏడాది గణేశ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్మాణ పనులు కొనసాగుతుంటాయి. ఈసారి శ్రీ సప్తముఖ మహా శక్తి గణపతిగా ఖైరతాబాద్ గణనాథుడు భక్తులకు దర్శనమివ్వనున్నాడు. ఏడు ముఖాలతో, ఏడు సర్పాలతో, 24 చేతులతో గణేషుడి నిర్మాణం కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. గణనాథుడికి కుడి వైపున శ్రీనివాస కళ్యాణం, ఎడమ వైపున శివ పార్వతుల కళ్యాణం ఏర్పాటు చేయనున్నారు. ఇక ప్రత్యేక ఆకర్షణగా అయోధ్య బాల రాముడి ప్రతిమను ఏర్పాటు చేయనున్నారు.
"వినాయకుడి ప్రతిమను తయారు చేయడానికి మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, తెలంగాణ నుంచి వచ్చారు. గత ఐదారు సంవత్సరాల నుంచి మట్టి గణపతి అని నిర్ణయించారు. మట్టిగణపతి శోభాయాత్ర అంటే కొంచెం సమస్యే అని నన్ను కలిశారు. అయితే ఇప్పుడు తయారు చేస్తున్న గణేశుడు ఐదు గంటలు తడిచినా ఏమీ కాదు." - జోగారావు, ఒడిశా కళాకారుడు
70సంవత్సరాలకు 70 అడుగుల : ఖైరతాబాద్‌లో ఈ ఏడాది 70 అడుగుల మట్టి గణపతిని ప్రతిష్టిస్తున్నారు. దీంతో విగ్రహ తయారీ పనులు జూన్‌లోనే ఊపందుకున్నాయి. సుమారు 22 టన్నుల పైచిలుకు ఐరన్‌ను విగ్రహతయారీలో వినియోగిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. మహా గణపతి నిర్మాణంలో మంచి నాణ్యత గల వస్తువులను వినియోగిస్తున్నట్లు కళాకారులు తెలిపారు.
ఈ మహాగణేశుడిని దర్శించుకునేందుకు నగరవాసులే కాదు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తుంటారు. వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు చెప్పారు. గతేడాది ఖైరతాబాద్ మహా గణపతిని 35 లక్షల పైచిలుకు భక్తులు దర్శించుకున్నారు. ఈ ఏడాది మరింత మంది భక్తులు పెరిగే అవకాశం ఉందని ఉత్సవ సమితి నిర్వాహకులు అంచనావేస్తున్నారు.
'శ్రీ సప్తముఖ మహా శక్తి రూపంలో దర్శనమివ్వనున్న ఖైరతాబాద్ గణేష్'
ధూల్‌పేటలో వినాయక చవితి సందడి - ఏ గల్లీ చూసినా గణేశుడి విగ్రహాలే - Ganesh Idols Making In Dhoolpet