Khairatabad Ganesh Nimajjanam 2024 : గణపతి బప్పా మోరియా అంటూ పది రోజుల పాటు ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలు మారుమోగాయి. ప్రపంచంలోనే భారీ మట్టి గణపయ్యను దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు ఖైరతాబాద్‌కు బారులు తీరారు. ఆ మహాగణనాథుని శోభాయాత్ర ప్రారంభమైంది. గణేశుడికి కమిటీ సభ్యులు హారతి ఇచ్చి దీన్ని ప్రారంభించారు. ఈ శోభాయాత్ర టెలిఫోన్ భవన్, తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా హుస్సేన్‌సాగర్‌కు చేరుకుంటుంది. కాగా మధ్యాహ్నం 2 గంటల వరకు బడా గణేశుడి నిమజ్జన ప్రక్రియను పూర్తి చేయనున్నారు. పది రోజుల పాటు భక్తులకు నయానందకరంగా దర్శనం ఇచ్చిన స్వామి శోభాయాత్ర, భాగ్యనగరం వీధుల్లో ఘనంగా కొనసాగుతోంది.
మహా శక్తిగణపతి టస్కర్‌పైకి చేరిందిలా : ఈ ఏడాది శ్రీ సప్తముఖ మహా శక్తి గణపతిగా భక్తులకు కన్నులపండువగా దర్శనమిచ్చిన స్వామి గంగమ్మ ఒడికి చేరనున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం భక్తులకు దర్శనాలని నిలిపివేసిన ఉత్సవ కమిటీ సభ్యులు, అనంతరం మండపాలను తొలగించారు. వినాయక నిమజ్జనంలో కీలక ఘట్టమైన శోభాయాత్ర జరిగే ప్రాంతంలోని చెట్ల కొమ్మలను జీహెచ్ఎంసీ సిబ్బంది సహకారంతో తొలగించారు.
మచిలీపట్నానికి చెందిన టస్కర్ రెండు రోజుల క్రితమే ఖైరతాబాద్‌కు చేరుకోగా, భారీ గణనాథుడిని మండపం నుంచి దానిపైన నిలిపేందుకు వీలుగా వెల్డింగ్ పనులను పూర్తి చేశారు. గత రాత్రి సుమారు 10 గంటలకు గణపయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించి, మహా హారతి ఇచ్చారు. అనంతరం కలశాన్ని కదిపి, పూజా కార్యక్రమాలను ముగించారు. ఇక రాత్రి 2 గంటలకు శ్రీ సప్త ముఖ మహా శక్తిగణపతిని భారీ క్రేన్ సహాయంతో టస్కర్‌పైకి చేర్చారు.
Ganesh Immersion 2024 : ఇక ప్రధాన గణపతి మండపానికి ఓ వైపు శ్రీనివాస కల్యాణం, మరోవైపు శివపార్వతుల కల్యాణ ఘట్టాలకు సంబంధించిన ప్రతిమలను చిన్న మండపాల్లో ఏర్పాటు చేశారు. తొలుత ఆయా విగ్రహాలను టస్కర్ లపైకి చేర్చి, అనంతరం భారీ క్రేన్ సహాయంతో ప్రధాన విగ్రహాన్ని టస్కర్ పైకి చేర్చారు. గణపతిని టస్కర్‌పైకి చేర్చిన తర్వాత వెల్డింగ్ పనులకే దాదాపు 4 గంటల సమయం పట్టింది. ఖైరతాబాద్, సెన్సేషన్ థియేటర్, టెలిఫోన్ భవన్, తెలుగు తల్లి ఫ్లై ఓవర్ పక్క నుంచి సచివాలయం మీదుగా సాగర తీరానికి ఖైరతాబాద్ గణనాథుడి శోభాయాత్ర వైభవంగా కొనసాగుతోంది.
ఖైరతాబాద్ మహాగణపతికి కాసుల వర్షం - పదిరోజుల్లో ఆదాయం ఎంతంటే ? - KHAIRATABAD GANESH HUNDI AMOUNT