Phone Tapping Case Updates : ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇటీవల టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావును పోలీసులు అరెస్ట్ చేయగా, ఆయన రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక అంశాలను పొందుపరిచారు. 2014లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక 2016లో ఎస్‌ఐబీ చీఫ్‌గా ప్రభాకర్‌రావును నియమించారని, ఆ తరువాత తన వర్గం వారందరిని ఏకం చేసి ఓటీమ్‌గా ఏర్పరిచి ఒక బృందంలోకి బదిలీ చేయించుకున్నారని తెలిపారు.
నల్గొండ నుంచి ప్రణీత్‌రావు, రాచకొండ కమిషనరేట్ నుంచి భుజంగరావు, హైదరాబాద్ సిటి నుంచి తిరుపతన్న, సైబరాబాద్ నుంచి వేణుగోపాల్‌రావును ఎస్‌ఐబీకి బదిలీ చేయించుకున్నారు. కీలకమైన టాస్క్‌ఫోర్స్ డీసీపీ పోస్టులో బీఆర్‌ఎస్ అధినేత అదేశాలతో 2017లో రాధాకిషన్‌రావును(Radhakishan rao) నియమించారు. శాఖాపరమైన వ్యవహారాలతో పాటు రాజకీయ పరంగా నిఘా పెట్టేందుకు అతనికి ఆదేశాలు జారీ చేశారు.
వీరు నలుగురూ తరుచూ కలుస్తూ బీఆర్‌ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేసినట్లు రాధాకిషన్‌రావు వెల్లడించారు. దీంతో పాటు వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న గట్టుమల్లును, ప్రభాకరావు ఆదేశాల మేరకు ఎస్‌ఐబీకి బదిలీ చేశారు. వీరి కార్యకలాపాలను ఇతరులు గమనించకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకునే వారని వెల్లడించారు. ముందు జాగ్రత్త చర్యగా సోషల్‌మీడియా యాప్స్ అయిన వాట్సాప్, సిగ్నల్, స్నాప్‌చాట్‌లలో మాత్రమే తరచూ సంప్రతింపులు జరుపుకున్నట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
Telangana Phone Tapping Case : రాధాకిషన్‌రావు తన సామాజికవర్గాన్ని అడ్డుపెట్టుకుని, అప్పటి ప్రభుత్వ పెద్దల అండదండలతో సర్వీస్ 2020 ఆగష్టులో ముగిసినా, మరో మూడేళ్లు టాస్క్‌ఫోర్స్ ఓఎస్డీగానే కొనసాగినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. మరోవైపు ప్రభాకర్‌రావు ప్రోద్బలంతోనే ఎస్ఐబీలోకి వచ్చిన ప్రణీత్‌రావు అతని అడుగుజాడల్లోనే నడిచాడని, ప్రభాకర్‌రావు ఐజీ అయిన తర్వాత ఎస్‌ఐబీలో ప్రత్యేక ఎస్‌ఓటి బృందాన్ని ఏర్పాటు చేశారని స్పష్టం చేశారు.
వీరి ముఖ్య లక్ష్యం ప్రతిపక్ష నాయకులతో పాటు బీఆర్‌ఎస్ రెబల్స్ పై నిఘా పెట్టడమని తేల్చారు. జనంలో పేరున్న నాయకులు, క్యాడర్ ఉన్న వారిని గుర్తించడమే లక్ష్యంగా పనిచేసినట్లు రాధాకిషన్‌రావు విచారణలో వెల్లడించారని రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ఎస్‌ఐబీ, టాస్క్‌ఫోర్స్‌లోనూ పనిచేసేందుకు, ప్రభాకర్‌రావు(Prabhakar rao) వారికి అనుకూలంగా పనిచేసే వారిని నియమించుకున్నట్లు వెల్లడించారు.
మాజీ అదనపు ఎస్పీ వేణుగోపాల్‌రావు, భుజంగరావు, తిరుపతన్నలు ఇతర అధికారులు ప్రభాకర్‌రావు బృందంలో ఉన్నట్లు తెలిపారు. బీఆర్‌ఎస్ మూడోసారి గెలుపొందేందుకు ప్రతిపక్ష నేతలు, వారి మద్దతుదారులు, కుటుంబసభ్యులు, వ్యాపారస్తులు, బీఆర్‌ఎస్ విమర్శకులతో పాటుగా గులాబీ పార్టీ నేతలు కూడా అధినేత నియంత్రణలోనే ఉండేలా ఈ బృందం నిఘా పెట్టిట్లు రాధాకిషన్‌రావు రిమాండ్ రిపోర్టులో పోలీసులు వెల్లడించారు. దీంతో పాటు నేరుగా బీఆర్ఎస్ అధినేతకు ఎప్పటికప్పుడు నివేదించినట్టు కూడా పోలీసులు తేల్చారు.
ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకు 2018 ఎన్నికల సమయంలో ప్రణీత్‌రావు(Praneeth rao), టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావుకు కొంత సమాచారాన్ని పంపాడు. రాంగోపాల్‌పేట పరిధిలోని ప్యారడైస్ వద్ద భవ్య సిమెంట్స్ అధినేత భవ్య ఆనంద్ ప్రసాద్‌కు చెందిన రూ. 70లక్షలు సీజ్ చేశారు. ఆ సమయంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున ఆయన పోటీ చేస్తున్నారు.
దుబ్బాక ఉప ఎన్నికల సమయంలోనూ ట్యాపింగ్ చేసిన సమాచారాన్ని ప్రణీత్‌రావు, రాధాకిషన్‌రావుకు పంపగా బీజేపీ నుంచి పోటీ చేస్తున్న రఘునందన్‌రావు బంధువులకు చెందిన కోటి రూపాయలను రాధాకిషన్‌రావు అతని బృందం బేగంపేట పరిధిలో స్వాధీనం చేసుకుంది. మునుగోడు ఉపఎన్నికల సమయంలోనూ ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకు ప్రణీత్‌రావు తన టాస్క్‌ఫోర్స్ బృందాన్ని రంగంలోకి దింపాడు. శ్రీనాథ్‌రెడ్డి అనే ఇన్స్పెక్టర్ ద్వారా గాంధీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో రెక్కీ నిర్వహించారు.
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అనుచరులు అయిన గుంట సాయికుమార్‌రెడ్డి, మహేష్, వెన్నం భరత్‌లను అడ్డగించి వారి నుంచి రూ. 3.50 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారని రాధాకిషన్‌రావు రిమాండు రిపోర్ట్‌లో వివరించారు. ఈ మొత్తం వ్యవహారంలో నాటి అధికార పార్టీ సుప్రీమ్ ఆదేశాల మేరకు వీరంతా నడిపించి, ప్రతిపక్షాలను దెబ్బతియ్యటం, బీఆర్ఎస్‌కు అన్ని రకాలుగా సహకారం అందిస్తూ, మూడవ సారి అధికారం లక్ష్యంగా పనిచేసినట్టు పోలీసులు అభిప్రాయపడ్డారు.
'రాజకీయ నాయకులు, ఇతర వ్యక్తుల ఫోన్లపై నిఘా పెట్టారు' - Telangana Phone Tapping Case Update