BRS Praja Ashirwada Sabha Chevella : ప్రజలకు మేలు చేయాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంలో కనిపించటం లేదని మాజీముఖ్యమంత్రి కేసీఆర్(KCR) దుయ్యబట్టారు. అంబేద్కర్ స్ఫూర్తితో సాధించుకున్న తెలంగాణలో ఐదు నెలల్లో పదేళ్ల నాటి కష్టాలు మళ్లీ కనిపిస్తున్నాయని ఆయన దుయ్యబట్టారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా, చేవెళ్లలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాదసభలో కేసీఆర్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ చేవెళ్ల అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌ను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
అద్భుతమైన తెలంగాణ - 100 రోజుల్లోనే అస్తవ్యస్తమవుతుందని భావించలేదు : కేసీఆర్ - KCR Fires on Congress
BRS Election Campaign 2024 : అంబేడ్కర్ ముందుచూపుతోనే తెలంగాణ సాకారమయ్యిందని కేసీఆర్ పేర్కొన్నారు. అంబేడ్కర్‌కు అత్యున్నత గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో, హైదరాబాద్‌లో 125 అడుగుల ఎత్తైన విగ్రహం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర సచివాలయానికి కూడా అంబేడ్కర్ పేరు పెట్టి గౌరవించుకున్నామని గుర్తు చేశారు. దళితుల అభివృద్ధికి ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని ఆపేశారని, దళితబంధు త్వరగా ఇవ్వకపోతే ఎంపికచేసిన లబ్ధిదారులతో అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నా చేస్తానని హెచ్చరించారు.
ప్రభుత్వం ఆదుకుంటుందనే విశ్వాసం ప్రజల్లో ఉండాలని కేసీఆర్ పేర్కొన్నారు. కొన్ని ప్రలోభాలతో కాంగ్రెస్ పార్టీ(Congress) అధికారంలోకి వచ్చిందని ఆయన దుయ్యబట్టారు. ఎన్నో పోరాటాలు, ఆమరణ దీక్ష చేసి తెలంగాణ సాధించారని, కోడి తన పిల్లలను రెక్కల కింద కాపాడుకున్నట్లు పదేళ్లు రాష్ట్రాన్ని కాపాడినట్లు తెలిపారు. తెలంగాణ ప్రజల మేలుకోసం, తాను బతికున్నంత వరకు పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు.
KCR fires on BJP : ఈ పదేళ్లలో బీజేపీ(BJP) ఈ దేశ ప్రజల కోసం ఏమైనా చేసిందా? అని కేసీఆర్ నిలదీశారు. ప్రజల్లో మతపిచ్చి లేపి ఓట్లు దండుకోవాలని చూస్తోందని దుయ్యబట్టారు. కేంద్ర సంస్థలను పంపించి పార్టీలను బెదిరించడమే మోదీ పని అని దుయ్యబట్టారు. అయితే మోదీ.. లేకుంటే ఈడీ అన్నట్లుగా బీజేపీ వైఖరి ఉందన్నారు. గత పదేళ్లలో దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలను కేంద్రం ఏర్పాటు చేసిందని, 157 మెడికల్ కాలేజీల్లో తెలంగాణకు ఒక్కటీ ఇవ్వలేదని పేర్కొన్నారు.
రాష్ట్రానికి ఒక్క విద్యా సంస్థను కూడా ఇవ్వని బీజేపీ ఎందుకు ఓటు వేయాలని కేసీఆర్ ప్రశ్నించారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని మోదీ బెదిరించారన్నారు. రాష్ట్రానికి ఇవ్వాల్సిన ఐటీఐఆర్ ప్రాజెక్టును మోదీ ప్రభుత్వం రద్దు చేసిందని, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఇవ్వలేదన్నాారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి నిత్యావసరాల ధరలు పెరిగేలా చేశారని, రాష్ట్రప్రభుత్వం మెడలు వంచి హామీలు సాధించాలంటే బీఆర్ఎస్ గెలవాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు నెరవేరాలంటే, ఓటు వేసే ముందు మీరందరూ ఆలోచించాలి. హామీలు అమలుకావాలంటే ప్రభుత్వానికి ధీటుగా బలమైన ప్రతిపక్షం ఉండాలి. కావున బీఆర్ఎస్‌కు ఓటువేసి గెలిపించండి. తెలంగాణ ప్రయోజనాల కోసం నేను బతికున్నంత వరకు పోరాటం చేస్తూనే ఉంటాను. - కేసీఆర్, మాజీముఖ్యమంత్రి