Kadiyam Kavya for Warangal Seat : వరంగల్ ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థిగా కడియం కావ్యను ఖరారు చేస్తూ ఏఐసీసీ(AICC) ప్రకటించింది. ఈమేరకు ఇవాళ జాబితా విడుదల చేసింది. దిల్లీలో జరిగిన కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకున్నారు. నిన్న సీఎం రేవంత్‌రెడ్డి, దీపాదాస్ మున్షీ సమక్షంలో కడియం శ్రీహరి, కడియం కావ్య కాంగ్రెస్‌లో కండువా కప్పుకున్నారు.
Kadiyam Kavya To Join Congress : మొదటగా కడియం కావ్యకు బీఆర్ఎస్ నుంచి వరంగల్ టికెట్‌ను కేటాయించారు. కానీ కడియం కావ్య(Kadiyam Kavya) బీఆర్ఎస్‌ను దిగ్భ్రాంతికి గురి చేశారు. గులాబీ పార్టీ తరఫు నుంచి పోటీ చేయలేనని ప్రకటించారు. ఈ మేరకు పార్టీ అధినేత కేసీఆర్‌కు లేఖ రాశారు. అవినీతి ఆరోపణలు, ఫోన్ ట్యాపింగ్, దిల్లీ మద్యం కుంభకోణం వంటి అంశాలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీశాయని కడియం కావ్య లేఖలో పేర్కొన్నారు.
వరంగల్ జిల్లాలోనూ స్ధానిక నాయకుల మధ్య సమన్వయం కొరవడి ఎవరికే వారే అన్నట్లుగా వ్యవహరించడంతో మరింత నష్టం జరుగుతోందని ఆమె వివరించారు. ఈ పరిస్థితుల్లో తాను పోటీ చేయలేనని కేసీఆర్, పార్టీ నేతలు, కార్యకర్తలు మన్నించాలని అన్నారు. తనకు బీఆర్ఎస్ నుంచి పోటీకి అవకాశం ఇచ్చినందుకు కడియం కావ్య ధన్యవాదాలు తెలిపారు. వరంగల్ నుంచి కాంగ్రెస్ టికెట్ ఖరారు కావడంతోనే కావ్య గులాబీ పార్టీకి షాక్ ఇచ్చారు.