Justice PC Ghose Panel Question Project MD : హైదరాబాద్‌లోని బీఆర్కేభవన్‌లో విచారణకు హాజరైన గజ్వేల్ ఈఎన్సీ, కేఐపీసీఎల్(K.I.P.C.L) ఎండీ భూక్యా హరీరాంపై కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్ ప్రశ్నల వర్షం కురిపించింది. సుదీర్ఘంగా సాగిన క్రాస్ ఎగ్జామినేషన్‌లో 91 ప్రశ్నలను సంధించింది.
హరీరాంను ప్రశ్నించిన జస్టిస్ పీసీ ఘోష్ :
ప్రశ్న : కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో ఆరుగురు సీఈలు ఉండగా ఎత్తిపోతల డీపీఆర్‌ను సీడబ్ల్యూసీకి హైదరాబాద్ సీఈ ఎందుకు అందించారు? దీనికి ప్రభుత్వ ఆదేశాలున్నాయా? ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును కాళేశ్వరంగా ఎందుకు మార్చాల్సి వచ్చింది?
జవాబు : కాళేశ్వరం డీపీఆర్‌ను వ్యాప్కోస్ రూపొందించి కరీంనగర్ సీఈకి అందజేయగా ఆయన హైదరాబాద్ సీఈకి సమర్పించారు. అప్పట్లో ఆ పోస్టులో తానే ఉన్నానని నాటి ఈఎన్సీ జనరల్ సి.మురళీధర్ ఆదేశాలతో ప్రాజెక్టు ప్రతినిధిగా దీని పరిధిలోకి వచ్చే ఆరుగురు సీఈల నుంచి డేటాను సేకరించి 2017 ఫిబ్రవరిలో సీడబ్ల్యూసీకి డీపీఆర్‌ను సమర్పించానని తెలిపారు. దీనికి ప్రభుత్వం నుంచి ఎలాంటి లిఖితపూర్వక ఆదేశాలు రాలేదన్నారు. తన పరిధిలో కాళేశ్వరంలోని 10 నుంచి 16 ప్యాకేజీల మధ్యనున్న పనులు మాత్రమే వస్తాయన్నారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంతో ముంపు ఏర్పడుతోందని మహారాష్ట్ర అభ్యంతరం చెప్పగా ప్రాణహిత-చేవెళ్లకు ప్రత్యామ్నాయంగా మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణానికి ప్రణాళిక సిద్ధమైందని హరీరాం వివరించారు.
ప్రశ్న : మిమ్మల్నే ఎందుకు కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీగా నియమించారు.
సమాధానం: నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వుల ద్వారా తనను నియమించారు.
ప్రశ్న : కార్పొరేషన్ ఛైర్మన్‌గా ముఖ్య కార్యదర్శి ఉన్నారు కదా? ఆ పోస్టులో నాడు ఎవరున్నారు.
సమాధానం : ఎస్కే జోషి
ప్రశ్న : ఆర్థికపరమైన అంశాలపై మీకు పట్టుందా?
సమాధానం : లేదు
ప్రశ్న : కాళేశ్వరంలో పాలమూరు-రంగారెడ్డి ఇరిగేషన్ కార్పొరేషన్ లిమిటెడ్‌ను భాగం చేయడం ఎవరి ఆలోచన?
సమాధానం : నాటి ఈఎన్సీ జనరల్ లేఖ రాయడంతో ప్రభుత్వం అనుమతిచ్చింది.
ప్రశ్న : ఈ కార్పొరేషన్ కంపెనీల చట్టాలను అనుసరించి ఏర్పాటైంది కదా? రుణాలకు పూచీకత్తుగా ఎవరు వ్యవహరించారు? ఆస్తులేం ఉన్నాయి?
సమాధానం : ఇది కంపెనీయే, రాష్ట్ర ప్రభుత్వమే గ్యారంటీగా నిలిచింది. పంపు హౌజ్‌లు, రిజర్వాయర్లు, భూసేకరణలో సేకరించిన భూములు ఆస్తులుగా ఉన్నాయి. లీజు ఒప్పందం ఉంది.
ప్రశ్న : అవన్నీ ఆస్తులు కావని, యంత్రాల్లాంటివి ఏమున్నాయి?
సమాధానం : లేవు
ప్రశ్న : కార్పొరేషన్ సీఈవోను రెండేళ్ల కాలానికి నియమించాలని ప్రభుత్వ ఉత్తర్వులు చెబుతున్నాయి? మరి సీఈవో ఎవరు?
సమాధానం : సీఈవో ఎవరూ లేరు. రికార్డులు చూసి చెబుతాను.
ప్రశ్న : కార్పొరేషన్లో ప్రభుత్వ వాటా ఎంత?
సమాధానం : పరిశీలించాలి. మూడు బ్యారేజీలకు పది బ్యాంకుల కన్సార్షియం రూ.87,449 కోట్ల రుణం మంజూరు చేశాయి. ఇప్పటివరకు రూ.74,718 కోట్లు అందాయని హరీరాం వివరించారు. నిర్మాణాలకు రూ.62,825 కోట్లు చెల్లించారని చెప్పారు. ఈ కార్పొరేషన్లో భాగమైన పాలమూరు-రంగారెడ్డి ఇరిగేషన్ కార్పొరేషన్‌కు రూ.10 వేల కోట్లు మంజూరు కాగా, బ్యాంకులు రూ.7,140 కోట్లు ఇచ్చాయని తెలిపారు. 2024 సెప్టెంబరు 9 వరకు రుణాలకు వడ్డీల కింద రూ.29,737 కోట్లను ప్రభుత్వం చెల్లించిందని అన్నారు. 2022 ముందు వరకు ఆడిటింగ్ పూర్తి అయిందన్నారు.
ప్రశ్న : కంపెనీ వార్షిక ఆర్థిక నివేదికలను చట్టసభల ముందు పెడుతున్నారా?
సమాధానం : 2016-17 నుంచి 2020 వరకు వార్షిక నివేదికలను కంపెనీ ప్రభుత్వానికి అందజేసింది. వాటిని శాసనసభ, మండలిలో ప్రవేశపెట్టినట్లు లేదు.
ప్రశ్న : ఎత్తిపోతల కోసం నీరందేలా ప్రాజెక్టులను నిర్మించడంతోనే నష్టం జరిగిందా?
సమాధానం : కావొచ్చు.
ప్రశ్న : నిర్మాణ ప్రాంతాలు కూడా వైఫల్యాలకు కారణమా? బ్యారేజీలను డ్యాంలుగా నిర్మించారా?
సమాధానం : తానేమీ చెప్పలేను
ప్రశ్న : మేడిగడ్డ ఏడో బ్లాకులో వైఫల్యాలకు బాధ్యులెవరు? డిజైన్లు, పర్యవేక్షణ, ఇతర లోపాలు ఉన్నాయా?
సమాధానం : ఏమీ తెలియదు.
ప్రశ్న : సీసీ బ్లాకులు, యాప్రాన్‌కు జరిగిన నష్టానికి గేట్ల ఆపరేషన్‌లో వైఫల్యమని అఫిడవిట్లో రాశారు కదా?
సమాధానం : నిజమే
ప్రశ్న : 2017 జనవరి 25న జరిగిన హైపవర్ కమిటీ మినిట్స్‌ను కాళేశ్వరం సీఈ అనుసరించలేదని పేర్కొన్నారు కదా?
సమాధానం : నిజమే
ప్రశ్న : మేడిగడ్డ నుంచి అన్నారం, సుందిళ్ల అడ్డి నుంచి ఎల్లంపల్లిలోకి నీటిని ఎత్తిపోసేందుకు అనువుగా బ్యాక్ వాటర్ ఎక్కువ దూరం నిల్వ ఉండేలా బ్యారేజీలను నిర్మించడమే నష్టానికి కారణమైందా?
సమాధానం : కావచ్చు
ప్రశ్న : మూడు బ్యారేజీల నిర్మాణాల్లో సబ్ కాంట్రాక్టర్ల వివరాలు అందజేస్తారా?
సమాధానం : రామగుండం సీఈ నుంచి వివరణ కోరాను. ఇప్పటివరకు జవాబు రాలేదు.
ప్రశ్న : మీరు ఎవరినో రక్షిస్తున్నారని కమిషన్ భావిస్తోంది. అంగీకరిస్తారా?
సమాధానం : అలాంటిది ఏమీలేదు.
ప్రశ్న : కాళేశ్వరం ప్రాజెక్టు ఎవరి మానసపుత్రిక?
సమాధానం : తెలియదు
గజ్వేల్ ఈఎన్సీ, కేఐపీసీఎల్ ఎండీ హరీరాం చాలా ప్రశ్నలకు తనకు తెలియదు, చెప్పలేను, రికార్డులను చూసి సమాధానాలు ఇస్తానని పేర్కొన్నారు. దీంతో ఇవాళ ఆధార పత్రాలతో కమిషన్ ఎదుట హాజరు కావాలని హరీరాంను జస్టిస్ ఘోష్ ఆదేశించారు.
కాళేశ్వరం డిజైన్లను ఎవరు తయారు చేశారు? : జస్టిస్ పీసీ ఘోష్ - kaleshwaram commission Investigate