Telangana Power Commission New Chairman Justice Madan B Lokur : విద్యుత్ విచారణ కమిషన్ నూతన ఛైర్మన్‌గా జస్టిస్ మదన్ భీమ్ రావు లోకూర్ నియామకమయ్యారు. అంతకుముందు ఉన్న జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి స్థానంలో జస్టిస్ మదన్ భీమ్ రావు లోకూర్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పని చేశారు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ మదన్ భీమ్ రావు లోకూర్ పని చేశారు. ప్రస్తుతం యాద్రాద్రి, భద్రాద్రి విద్యుత్ సంస్థల నిర్మాణాలు, ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోళ్ల అంశంపై జస్టిస్ మదన్ భీమ్ రావు లోకూర్ విచారణ జరుపుతారు.
ఇప్పటికే సగం విచారణ పూర్తి : ఇప్పటికే అనేక మంది అధికారులకు, ప్రజా ప్రతినిధులకు నోటీసులు పంపడంతో పాటు వారిని జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి విచారించారు. వీరితో పాటు యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ సంస్థల నిర్మాణం, ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోళ్ల అంశంపై గతంలో విద్యుత్ సంస్థల్లో పని చేసిన మాజీ అధికారులను జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి విచారించారు.
మాజీ ఇంధన కార్యదర్శులు, ప్రిన్సిపల్ సెక్రటరీలుగా పని చేసిన సురేశ్ చందా, అరవింద్ కుమార్, ఎస్.కే. జోషీ, అజయ్ మిశ్రాలతో పాటు మాజీ ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావున నుంచి విచారణలో భాగంగా వివిధ అంశాలపై వివరాలు తీసుకున్నారు. వీరితో పాటు ప్రొఫెసర్ కోదండరాం, విద్యుత్ ఉద్యోగి రఘు, విద్యుత్ రంగ నిపుణులు వేణుగోపాల్‌లు కూడా విచారణకు హాజరై తమవద్ద ఉన్న సమాచారాన్ని జస్టిస్ ఎల్.నరసింహారెడ్డికి తెలియజేశారు.
Justice Madan B Lokur : రాష్ట్ర ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ విద్యుత్ కొనుగోళ్లపై విచారణ జరిపేందుకు జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ విచారణలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు వేశారు. ఈ పిటిషన్ చెల్లదంటూ హైకోర్టు కొట్టేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో మాజీ సీఎం కేసీఆర్ సవాల్ చేశారు. దేశ అత్యున్నత న్యాయస్థానంలో తెలంగాణ విద్యుత్ కమిషన్ ఛైర్మన్‌ను మార్చాలని ఆదేశించింది. దీనికి ఒప్పుకున్న రాష్ట్ర ప్రభుత్వం మిగిలి ఉన్న విచారణను పూర్తి చేయడానికి ఇవాళ జస్టిస్ మదన్ భీమ్ రావు లోకూర్‌ను నియమించారు. ఆయన ఈ విచారణను పూర్తి చేయనున్నారు.