Inquiry on Kaleshwaram Project : కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలకు సంబంధించి జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే సెంట్రల్ డిజైన్స్ ఎస్ఈ ఫజల్ కమిషన్ ముందు హాజరయ్యారు. మేడిగడ్డ ఆనకట్ట నిర్మాణంలో సీకెంట్ పైల్స్ కు వెళ్లాలని ఎన్ఐటీ వరంగల్ సిఫార్సుల మేరకు అప్పటి కాళేశ్వరం సీఈ చెప్పారని సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ ఎస్ఈ ఫజల్ తెలిపారు. కాళేశ్వరం కమిషన్ ముందు హాజరైన ఫజల్‌ను జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించారు. గతంలో దాఖలు చేసిన అఫిడవిట్ ఆధారంగా అడిగిన ప్రశ్నలకు ఫజల్ సమాధానాలు చెప్పారు.
కాళేశ్వరం సీఈ నివేదిక ఆధారంగానే ఆనకట్టల నిర్మాణ స్థలాన్ని పరిశీలించకుండానే క్రాస్ సెక్షన్స్ ఆమోదించినట్లు కూడా ఫజల్ పేర్కొన్నారు. సుందిళ్ల ఆనకట్ట రెండో బ్లాక్ ఏ లో అదనపు ఆరు వెంట్లు డిజైన్స్‌లో మొదట లేవని ఆ తర్వాత చేర్చినట్లు తెలిపారు. మంత్రివర్గ నిర్ణయం మేరకే అదనపు వెంట్ల నిర్మాణం జరిగిందని అన్నారు. అటు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు సీడీఓ విశ్రాంత ఈఎన్సీ నరేందర్ రెడ్డి రెండో రోజు కూడా హాజరయ్యారు. నిన్నటి విచారణకు కొనసాగింపుగా రెండు లేఖలను ఆయన కమిషన్‌కు అందించారు.