Jeevan Reddy Likely To Resign From MLC Post: జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడం, హస్తం గూటిలో చిచ్చు రేపింది. సంజయ్ చేరికతో జగిత్యాల జిల్లా రాజకీయాల్లో కలకలం మొదలైంది. ఆయన చేరికతో మనస్తాపానికి గురైన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు ఏకంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు రంగంలోకి దిగారు.
జీవన్ రెడ్డితో భేటీ అయిన అనంతరం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. జీవన్ రెడ్డి గౌరవానికి భంగం కలగకుండా చూస్తామని భట్టి విక్రమార్క అన్నారు. జీవన్ రెడ్డి మనస్తాపానికి గల కారణాలను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తామన్నారు. కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని చక్కదిద్దేందుకు ఆయన చాలా కృషి చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నిరంతరం జీవన్‌రెడ్డితో మాట్లాడుతుందని, జీవన్ రెడ్డిని కోల్పోయేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్దంగా లేదని ఉపముఖ్యమంత్రి అన్నారు.
అంతకు ముందు మీడియాతో మాట్లాడిన జీవన్ రెడ్డి, గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే తనకు బాధేస్తోందన్నారు. అందుకే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని వెల్లడించారు. క్షేత్ర స్థాయిలో పల్లెలన్నీ తిరుగుతానని పేర్కొన్నారు. తనకు పార్టీ మారే ఆలోచన లేదన్న ఆయన, ఇప్పటివరకు తనకు ఏ పార్టీ నుంచి పిలుపు రాలేదని చెప్పారు. ప్రజల అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. తన ప్రమేయం లేకుండా, పార్టీలో జరగాల్సింది జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే సంజయ్ చేరిక పట్ల జీవన్ రెడ్డి అసహనం! - జగిత్యాలలో ఆసక్తికర పరిణామాలు
తనను సంప్రదించకుండానే ఎమ్మెల్యే సంజయ్‌ను పార్టీలోకి తీసుకోవడం మనస్తాపానికి గురి చేసిందని జీవన్ రెడ్డి వాపోయారు. బేగంపేట ప్రకాష్ నగర్లో కరీంనగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులతో సమావేశమైన అనంతరం అసెంబ్లీ ఛైర్మన్‌కు రాజీనామా ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను విస్మరించి ఇతర పార్టీల నేతలను చేర్చుకోవడం సరికాదన్నారు. అసెంబ్లీలో ఛైర్మన్ అందుబాటులో లేకపోవడంతో సెక్రటరీకి రాజీనామా ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలిపారు.
' నన్ను సంప్రదించకుండానే సంజయ్‌ను పార్టీలోకి తీసుకోవడం మనస్తాపానికి గురిచేసింది. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను వదిలిపెట్టి ఇతర పార్టీల నేతలను చేర్చుకోవడం సరికాదు. ఈరోజు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను. ఇతర పార్టీలోకి వెళ్లే నిర్ణయం ఇంకా తీసుకోలేదు. ఇప్పటి వరకూ అలాంటి ఆలోచన లేదు.'-జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ