JCB Driver Saved Flood Victims : మున్నేరు నది మహోగ్రరూపం దాల్చింది. ప్రకాశ్‌నగర్ వంతెనపై చిక్కుకున్న ఆ తొమ్మిది మంది సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. పైగా చీకటి పడింది. వారికి అధికారులు డ్రోన్ ద్వారా ఆహారం సరఫరా చేశారు కానీ బయటికి తీసుకురాలేకపోతున్నారు. ఓ జేసీబీ డ్రైవర్ సాహసం చేసి వారందరి ప్రాణాలను రక్షించాడు. పలువురి మన్ననలు పొందుతూ శెభాష్ అనిపించుకుంటున్నాడు.
ప్రయత్నాలు విఫలం : వివరాల్లోకెళ్తే ఖమ్మంలోని ప్రకాశ్‌నగర్‌లో నివాసం ఉంటున్న హరియాణా రాష్ట్రం మేవాత్ జిల్లాకు చెందిన సుభానీ గత ఏడేళ్లుగా జేసీబీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు ఆదివారం ఉదయం మున్నేరు నది ఉగ్రరూపం దాల్చడంతో ప్రకాశ్‌నగర్ వంతెనపై కొందరు చిక్కుకుపోయారు. దానికి రెండువైపులా నీరు చేరి, వారు ఎటువైపు వచ్చే పరిస్థితి లేదు. అధికారులకు సమాచారం అందినా సమయానికి బోట్లు లేవు. హెలికాప్టర్ తెప్పించేందుకు ఉన్నతాధికారులు ప్రయత్నించినా సాధ్యపడలేదు.
సుభానీని సంప్రదించిన మంత్రి : అక్కడ చిక్కుకున్న వారికి అధికారులు డ్రోన్ ద్వారా ఆహారం, నీరు అందించారు. చూస్తూండగానే చీకటి పడింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వంతెన వద్దకు చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు. రాత్రి 10 గంటల సమయంలో జేసీబీ యజమాని వెంకటరమణ తన వద్ద పని చేస్తున్న డ్రైవర్ సుభానీని సంప్రదించారు. వంతెనపై చిక్కుకున్న బాధితులను క్షేమంగా ఒడ్డుకు చేర్చగలవా అని మంత్రి అతడిని అడిగారు.
మంత్రి విన్నపానికి సరేనన్న సుభానీ, పోతే నా ఒక్కడి ప్రాణం, వస్తే తొమ్మిది మంది ప్రాణాలు అంటూ జేసీబీపై కూర్చొని వంతెనపైకి వెళ్లేందుకు యత్నించారు. మున్నేరు వరద ఉద్ధృతికి రెండుసార్లు వెనక్కు తిరిగొచ్చాడు. రాత్రి 11:15 గంటలకు ప్రవాహం తగ్గడంతో మళ్లీ వెళ్లేందుకు యత్నించారు. అప్పటికే జేసీబీ ఇంజిన్ మొత్తం మునిగిపోయింది. అయినా వంతెన పైకి చేరాడు. బాధితులు తొమ్మిది మందిని అందులో ఎక్కించి క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. సుభానీ సాహసాన్ని ఖమ్మం నగరవాసులు కొనియాడుతున్నారు. నిజమైన హీరోగా అభివర్ణిస్తున్నారు.