MURTHY YADAV ON AP CS JAWAHAR REDDY: దళిత, గిరిజన భూములను జవహర్ రెడ్డి ముఠా సభ్యులు దోచుకున్నారని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ అన్నారు. ఉత్తరాంధ్రలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కుమారుడు, ముఠా సభ్యులు 800 ఎకరాలు కొట్టేశారని ఆరోపించారు. సీఎస్ జవహర్ రెడ్డి తన మీద కేసు పెడితే స్వాగతిస్తానని అన్నారు. తాను చేసిన ఆరోపణలు అవాస్తవం అని జవహర్ రెడ్డి ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు.
తన ఆరోపణలు తప్పు అయితే, సీఎస్‌కి పాదాభివందనం చేస్తానని అన్నారు. తప్పుడు ఆరోపణలు చేస్తే సీఎస్ ఎందుకు ఉపేక్షిస్తున్నారని అన్నారు. 19 డిసెంబర్ 2023వ తేదీన 596 జీవోను ఆఘమేఘాలపై ఎందుకు తీసుకువచ్చారని ప్రశ్నించారు. ఉత్తరాంధ్రలో వేల కోట్ల భూ కుంభకోణాలు జరిగిందని, ఇది రాష్ట్రంలో అతి పెద్ద కుంభకోణం అని అన్నారు. 596 జీవో రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
పేదల ప్రీ హోల్డ్ పట్టాలు పేదల దగ్గర ఉన్నాయా, సీఎస్ కుమారుడి ముఠా సభ్యుల పేర్ల మీద ఉన్నాయా అనేది సీఎస్ చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులను భయపెట్టి లాకున్నారని, తన దగ్గర ఎన్నో ఆధారాలు ఉన్నాయని అన్నారు. సుభాష్, రాజ్‌కుమార్ పేరు మీద భూములు రిజిస్ట్రేషన్లు చేశారని మూర్తి యాదవ్ తెలిపారు. విలువైన భూములు ఎలా చేతులు మారాయో సమీక్ష జరపాలని కోరారు.
వచ్చే ప్రభుత్వ హయాంలో పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తామన్న మూర్తి యాదవ్, సీఎస్ కుమారుడి నేతృత్వంలో జరిగిన భూకుంభకోణాలపై విచారణ జరపాలని పేర్కొన్నారు. త్రిలోక్, సుభాష్ ఎవరనేది విచారణ జరిపించాలన్న మూర్తి యాదవ్, స్వయంగా జవహర్‌రెడ్డే డీఆర్‌వోలను భయపెట్టలేదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా తాను చేసిన ఆరోపణలు తప్పు అని నిరూపించాలని, అలా అయితే తాను సీపీ దగ్గరికి వెళ్లి లొంగిపోతానని తెలిపారు.
సిట్టింగ్ జడ్జి, సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తనను ఎలా అరెస్టు చేయాలనే సమీక్షలు బదులు, తాను చేసిన ఆరోపణలు మీద సీఎస్ సమీక్షలు పెట్టాలని అన్నారు. తనని తప్పుడు కేసులతో జైలుకి పంపాలని చూస్తున్నారని ఆరోపించారు. తాను దేనికైనా సిద్ధంగా ఉన్నానని తేల్చిచెప్పారు.