Jagan Government not Releasing Panchayat Funds: పంచాయతీల నిధుల్ని దారి మళ్లించేందుకు అలవాటుపడ్డ జగన్ ప్రభుత్వం ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా తీరు మార్చుకోలేదు. 2023-24 సంవత్సరానికి 15వ ఆర్థిక సంఘం రెండో విడతగా విడుదల చేసిన 988 కోట్ల రూపాయల నిధుల్ని ఇంకా పంచాయతీలకు విడుదల చేయలేదు. ఆ నిధులనూ ప్రభుత్వం దారి మళ్లించేసిందన్న అనుమానాలు సర్పంచ్‌ల్లో వ్యక్తమవుతోంది.
కేంద్ర మార్గదర్శకాలకు విరుద్ధంగా: ఎన్నికల షెడ్యూలు ప్రకటనకు ముందు సుమారు 600 కోట్లు రాష్ట్ర పంచాయతీలకు నిధులు రాగా, మిగతా మొత్తాన్ని కోడ్ అమల్లోకి వచ్చాక కేంద్రం విడుదల చేసింది. కేంద్ర మార్గదర్శకాలకు విరుద్ధంగా గత మూడేళ్లలో దాదాపు 18 వందల 50 కోట్ల రూపాయలు విద్యుత్ బకాయిల పేరుతో జగన్ ప్రభుత్వం దారి మళ్లించింది. సర్పంచుల ఫిర్యాదుతో పంచాయతీల తరఫున బ్యాంకుఖాతాలు తెరిపించిన కేంద్రం ఇకనుంచి ఆర్థికసంఘం నిధులను వాటికే జమచేయాలని ఏడాది క్రితమే రాష్ట్రప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. అయినా కేంద్రం తాజాగా ఇచ్చిన నిధులనూ రాష్ట్ర ఆర్థికశాఖ తన దగ్గరే పెట్టుకుంది.
గ్రామాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి: కేంద్రం రాష్ట్రానికి ఆర్థికసంఘం నిధులు విడుదల చేసిన విషయం తెలిసిన అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షుడు జాస్తి వీరాంజనేయులు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ కన్నబాబును శుక్రవారం కలిశారు. 20 రోజుల క్రితం నిధులిచ్చినా పంచాయతీలకు ఇంకా కేటాయించకపోవడానికి కారణమేంటని ఆయన ప్రశ్నించారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పంచాయతీలకు వెంటనే నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. నిధులు త్వరలోనే పంచాయతీలకు జమచేస్తామని కమిషనర్ చెప్పారని ఆయన తెలిపారు.గ్రామాల్లో తీవ్రమైన తాగునీటి ఎద్దడితో ప్రజలు అవస్థలు పడుతున్నారని, పంచాయతీల్లో పాడైన తాగునీటి మోటార్లకు నిధుల కొరతతో సకాలంలో మరమ్మతులు చేయించలేని పరిస్థితుల్లో సర్పంచులు ఉన్నారని ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం మళ్లించడం దారుణమని వీరాంజనేయులు వ్యాఖ్యానించారు.
జగనన్న పాలనలో మహిళలకు రక్షణ లేదు - వైఎస్సార్సీపీ సర్పంచ్ భార్య ఆవేదన
AP Sarpanches Association: పంచాయతీ వ్యవస్థను సర్వనాశనం చేసిన జగన్ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో ఓడించాలని ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్, ఏపీ సర్పంచుల సంఘం రాష్ట్ర కమిటీ గతంలో పిలుపునిచ్చింది. పంచాయతీలు మనుగడ సాధించాలన్నా, సర్పంచులకు మంచి రోజులు రావాలన్నా జగన్‌ను ఇంటికి పంపడం తప్పనిసరని ఆ సంఘాల నేతలు తీర్మానించారు. వైఎస్సార్సీపీ మళ్లీ అధికారంలోకి వస్తే సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లను రద్దు చేసి రాజ్యాంగం కల్పించిన అధికారాలను వాలంటీర్లకు అప్పగిస్తారని సమావేశం సర్పంచ్‌లు ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికలకు సిద్ధమంటున్న జగన్‌ను ఓడించేందుకు సంసిద్ధంగా ఉన్నామని సర్పంచ్‌లు ప్రకటించారు. అధికారాలు, నిధుల కోసం మూడేళ్లుగా అలుపెరుగని పోరాటాలు చేసినా, ప్రభుత్వానికి పట్టలేదని నేతలు మండిపడుతున్నారు.
పంచాయతీల నిధులను జగన్ సర్కార్ దొంగిలించి దారిమళ్లిస్తోంది- సర్పంచ్ల ఆందోళన