Jagan Government Disrupted Uttarandhra Irrigation Projects : ప్రేమాభిమానం ఉంటే ఎవరైనా ఆపన్నహస్తం అందిస్తారు. కానీ సీఎం జగన్ ఉత్త చేతులు చూపిస్తారు. సీఎం జగన్ ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులకు తీరని ద్రోహం చేశారు. మైకు దొరికితే ఉత్తుత్తి మాటలతో ఊరిస్తూ హామీ ఇచ్చిన ఒక్క ప్రాజెక్టునూ పూర్తి చేయలేకపోయారు. కీలకమైన ప్రాజెక్టులకు బడ్జెట్‌లో రూ.3,288 కోట్లు కేటాయింపులు చూపించి కేవలం రూ. 594 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. అసలు జగన్‌కు ఉత్తరాంధ్రంటే ప్రేమా ? లోకువా ?
కృష్ణాబోర్డు అనుమతి ఉంటేనే ప్రాజెక్టుల్లోకి ఇరు రాష్ట్రాల అధికారులకు ప్రవేశం
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కీలకమైన ప్రాజెక్ట్ వంశధార. రెండో దశ కింద వంశధార నదిపై కాట్రగడ్డ వద్ద సైడ్ వియర్ నిర్మించి వరద నీటిని హిరమండలం జలాశయానికి మళ్లించాలనేది ఆలోచన. 19.05 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో జలాశయం నిర్మిస్తున్నారు. దీని కుడికాలువ కింద 20 వేల ఎకరాలు, వరద కాలువ కింద 20 వేల ఎకరాలు, హైలెవెల్ కాలువ కింద 5వేల ఎకరాల ఆయకట్టుకు నీరు ఇవ్వాల్సి ఉంది. తాను అధికారంలోకి వచ్చాక తొలి ఏడాదిలోనే పూర్తి చేస్తామని జగన్ ఘనంగా ప్రకటించారు. కానీ నేటికీ పనుల్ని కొలిక్కి తేలేకపోయారు. నిధులు ఇవ్వకపోవడం, బిల్లులను సకాలంలో చెల్లించకపోవడం వల్ల పనులు ఆలస్యం అవుతున్నాయి. వంశధార రెండో దశ రెండో భాగం పనులకు రూ.609 కోట్లు బడ్జెట్‌లో కేటాయించిన వైసీపీ సర్కార్ చివరకు రూ. 375 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు.
వివాదాల పరిష్కారానికి కేంద్రం కీలక నిర్ణయం - కృష్ణాబోర్డు పరిధిలోకి ఉమ్మడి ప్రాజెక్టులు
Mahendratanaya Reservoir : శ్రీకాకుళం జిల్లా చాప్రా గ్రామంలో మహేంద్రతనయ నదిపై నిరిస్తున్న రిజర్వాయర్ కూడా ఎప్పటికి పూర్తవుతుందో స్పష్టత లేదు. రూ.127 కోట్లు అంచనా వ్యయంతో 2007 సంవత్సరంలో ఆఫ్‌షోర్ రిజర్వాయర్ నిర్మాణానికి పాలనామోదం ఇచ్చారు. బడ్జెట్ కేటాయింపుల్లో రూ.425 కోట్లు చూపించినా ఖర్చు చేసింది చాలా స్వల్పం. ఫలితంగా ఇప్పటికీ పనులు పూర్తవడంలేదు. మహేంద్రతనయ ఆఫ్‌షోర్ రిజర్వాయర్‌కు రూ. 425 కోట్లు బడ్జెట్‌లో కేటాయించి రూ.26 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని మద్దు వలస ప్రాజెక్టుదీ ఇదే పరిస్థితి.! సకాలంలో బిల్లులివ్వని కారణంగా పనులు చేసేందుకు కాంట్రాక్టర్ల ముందుకు రాలేదు. టెండర్ల ప్రక్రియ కూడా ఆలస్యమైంది. ప్రాజెక్టు పనులు సాగడం లేదు. మద్దువలస ప్రాజెక్టుకు రూ.31కోట్లు కేటాయించి ఖర్చు కోటి 34 లక్షల రూపాయలతో సరిపెట్టారు.
కొండంత రాగంతీసి - పిల్ల కాలువలు తవ్వలేకపోయిన జగనన్న!
వంశధార-నాగావళి అనుసంధాన పనులూ పడకేశాయి. వంశధార వరద జలాల్ని శ్రీకాకుళం జిల్లా హిరమండలంలోని జలాశయం నుంచి బుర్జ మండలంలోని నారాయణపురం ఆనకట్టకు నీరు మళ్లించేందుకు అనుసంధానం ప్రతిపాదించారు. పనులు పూర్తైతే నారాయణపురం ఆనకట్ట కింద 18,527 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతోపాటు కొత్తగా 4 మండలాల్లోని 5వేల ఎకరాలకు నీళ్లు అందుతాయి. కేవలం రూ.145 కోట్లు రూపాయల అంచనా వ్యయంతో ప్రారంభించిన ఈ ప్రాజెక్టును జగన్ సర్కారు తన తొలి ఏడాదిలోనే అందుబాటులోకి తెస్తానంటూ ప్రణాళిక రచించింది. అయితే బడ్జెట్‌లో రూ. 120 కోట్లు కేటాయించి కేవలం రూ. 44 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. అయిదేళ్లు ముగుస్తున్నా పనులు పూర్తి చేయలేకపోయింది. పనులు అసంపూర్ణంగా ఉండడంతో పొలాలు ముంపునకు గురవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల గురించి మంత్రికి తెలుసా?
ఇక విజయనగరం జిల్లాకొస్తే చెప్పుకోవాల్సింది తోటపల్లి ప్రాజెక్ట్. దీన్ని రెండు ప్యాకేజీలుగా విడగొట్టారు. మొదటి ప్యాకేజీలో బ్యారేజీ హెడ్‌వర్క్సుతోపాటు కుడి ప్రధాన కాలువ సున్నా కిలోమీటరు నుంచి 52 కిలోమీటరు వరకు తవ్వాలి. ఈ పనులు తెలుగుదేశం హయాంలోనే 77% పూర్తయ్యాయి. దాదాపు 40 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పని, అనేక కట్టడాల నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది. రెండో ప్యాకేజీలో కుడి ప్రధాన కాలువ 52.450 కి.మీ నుంచి 117.89 కిలోమీటర్ల వరకూ తవ్వి డిస్ట్రిబ్యూటరీలు, పిల్ల కాలువలు నిర్మించాల్సి ఉంది. ఈ పనులు టీడీపీ హయాంలోనే 90 శాతం పూర్తయ్యాయి. రెండు ప్యాకేజీల్లో వైసీపీ సర్కార్ గుత్తేదారుల్ని మార్చడం తప్ప పనులైతే పూర్తి చేయించలేకపోయింది. ఇక తోటపల్లి కుడి ప్రధాన కాలువకు పొడిగింపుగా చేపట్టిన గజపతినగరం బ్రాంచి కాలువ కూడా ఇప్పట్లో పూర్తయ్యేలా లేదు. జగన్ ఏలుబడిలో రెండు గుత్తేదారు సంస్థలు పనుల నుంచి వైదొలిగాయి. ప్రాజెక్టు పూర్తి కాలేదు గానీ పనుల అంచనా వ్యయమైతే పెరిగిపోయింది. తోటపల్లి బ్యారేజీ, గజపతినగరం బ్రాంచి కాలువకు కలిపి రూ.778 కోట్లు కేటాయించిన వైసీపీ సర్కార్ కేవలం రూ. 61.48 లక్షలు మాత్రమే ఖర్చుచేసింది.
వైసీపీ హయాంలో ప్రశ్నార్థకంగా మారిన ప్రాజెక్ట్‌లు - మరమ్మతులు లేక కొట్టుకుపోతున్న గేట్లు
విజయనగరం జిల్లాలో 16 వేల 538 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరివ్వాలని తలపెట్టిన తారకరామతీర్థసాగర్ ప్రాజెక్టు కూడా అసంపూర్ణంగానే ఉంది. గుర్ల మండలం కోటగండ్రెడు సమీపంలో చంపావతి నదికి అడ్డంగా బ్యారేజీ నిర్మించాలన్నది ప్రతిపాదన. 2019 మే నాటికే 47.51 శాతం పనులు పూర్తయ్యాయి. వైసీపీ హయాంలో పనులు మందగించాయి. ఈ ప్రాజెక్టుకు బడ్జెట్‌లో రూ.500 కోట్లుకుపైనే కేటాయింపులు చేసిన ప్రభుత్వం రూ. 76 కోట్లు ఖర్చు చేసి మమ అనిపించింది.
ఉత్తరాంధ్రలో కీలకమైన మరో ప్రాజెక్ట్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి. దీనికి రూ.797 కోట్లు బడ్జెట్‌లో కేటాయించిన వైసీపీ సర్కార్ కేవలం రూ. 5.79 లక్షలు ఖర్చు చేసింది. ఇలా ఉత్తరాంధ్రలో కీలకమైన సాగునీటి ప్రాజెక్టులకు జగన్ ప్రభుత్వం 2019 ఏప్రిల్ నుంచి 2023 అక్టోబరు వరకు బడ్జెట్‌లో రూ.3,288కోట్లు కేటాయించింది. కానీ ఖర్చు చేసింది మాత్రం 594 కోట్లే. ఇదీ ఉత్తరాంధ్రపై జగన్ ప్రేమకు మాటలు,చేతల్లో ఉన్నాతేడా. ప్రాజెక్టులకు నిధులు ఇవ్వకుండా ఉత్తరాంధ్రను ఉద్ధరిస్తానంటూ జనాన్ని నమ్మించడానికి జగన్ సందర్భం వచ్చిన ప్రతిసారీ ప్రయత్నిస్తూనే ఉన్నారు.