Jagan Government Cheated Private Teachers: రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో 4 లక్షల మందికిపైగా గురువులు ఉన్నారు. ప్రైవేటు రంగంలో ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగులున్న వ్యవస్థ మరొకటి లేదు. అందుకే గత ఎన్నికల్లో వాళ్లపై జగన్ ఎక్కడలేని ప్రేమ ఒలకబోశారు. కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థల టీచర్లు ఎదుర్కొనే సమస్యలు గుర్తించామని, కనీస వేతనంతోపాటు పని గంటలు, సెలవులు, పీఎఫ్, ఈఎస్ఐ, ఆరోగ్య బీమా తదితరాలన్నీ వర్తించేలా అసెంబ్లీలో చట్టం తీసుకొస్తామని ప్రతిపక్షంలో ఉండగా జగన్ హామీ ఇచ్చారు. పదవీ కాలం ముగుస్తున్నా ఆ మాటే పట్టించుకోలేదు. కరోనా సమయంలో జీవనోపాధి కోల్పోయి రోడ్డున పడినవారిలో అత్యధికులు ప్రైవేటు ఉపాధ్యాయులు, అధ్యాపకులే.
కుటుంబ పోషణ కోసం కొందరు ఉపాధి హామీ కూలీలుగా, మరికొందరు వీధి వ్యాపారులుగా కొందరు సెక్యూరిటీ గార్డులుగా మారిపోవాల్సి వచ్చింది. అంతటి కష్టాల్లోనూ జగన్ వాళ్లను పట్టించుకోలేదు. ప్రైవేటు విద్యాలయాల్లో ఉదయం వెళ్లింది మొదలు ఇంటికొచ్చే వరకూ ఉపాధ్యాయుులు, అధ్యాపకులు విరామం లేకుండా బోధించాల్సి ఉంటుంది. కొన్నిచోట్ల వారంలో ఒక్కరోజు సెలవు దొరకడమూ కష్టంగా ఉంటోంది. అందుకే పని గంటలు అమలయ్యేలా చూడాలని ప్రైవేటు గురువులు డిమాండ్ చేస్తున్నారు. ఇక పట్టణాల్లో నెలకు 12 వేలు గ్రామాల్లో 10 వేల కంటే ఎక్కువ ఆదాయం ఉందని కొందరు ప్రైవేటు ఉపాధ్యాయులకు వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో కోత విధిస్తున్నారు.
ప్రైవేటు ఉపాధ్యాయుల భద్రత కోసమంటూ వైసీపీ ప్రభత్వం తెచ్చిన పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ కోరల్లేని పాములా మారింది. ఈ కమిషన్‌కు మూడేళ్లకోసారి నూతన కార్యవర్గాన్ని నియమించాల్సి ఉండగా 2022 అక్టోబరు నుంచి ఆ ఊసేలేదు. దాదాపు 18 నెలలుగా ఒక్క ఛైర్మన్‌తోనే కమిషన్‌ను నడిపిస్తున్నారు. సభ్యుల నియామకమే చేపట్టలేదు. ప్రైవేటు ఉపాధ్యాయుల సమస్యలపై గతంలో ఓ కమిటీ నివేదిక సమర్పించినా జగన్ దానిపై స్పందించిన దాఖలాలే లేవు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తే ప్రైవేటులో పనిచేస్తున్న కొందరికైనా అవకాశం లభిస్తుంది.రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ బడుల్లో 25 వేలకుపైగా ఖాళీలు ఉంటే, ప్రభుత్వం 6,100 పోస్టులకే డీఎస్సీ ప్రకటించింది.
ఐదేళ్లుగా కళ్లప్పగించి చూసిన జగన్.. ఎన్నికల ముందు నోటిఫికేషన్ ఇవ్వడంతో అదీ అక్కరకురాకుండా పోయింది. ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలు తగ్గిపోవడం, ప్రైవేటులో భద్రత లేకపోవడంతో బీఈడీ, డీఈడీ కోర్సుల్లో చేరేవారి సంఖ్య ఏటా గణనీయంగా తగ్గిపోతోంది. రాష్ట్రవ్యాప్తంగా 411 బీఈడీ కళాశాలలు ఉండగా వాటిల్లో 34 వేల సీట్లు ఉన్నాయి. కన్వీనర్ కోటాలో సుమారు 24 వేల సీట్లుంటే 3వేలకు మించి ప్రవేశాలు పొందడంలేదు. డీఈడీలో ప్రభుత్వ కళాశాలలు మినహా మరెక్కడా విద్యార్థులు ప్రవేశాలు పొందుతున్న దాఖలాలే లేవు.