Minister Uttam Visit Kaleswaram Barrages Today : జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ మధ్యంతర నివేదికలో చేసిన సిఫార్సులకు అనుగుణంగా మేడిగడ్డతోపాటు అన్నారం, సుందిళ్ల ఆనకట్టల వద్ద మరమ్మతులు, రక్షణ చర్యలకు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. మేడిగడ్డ బ్యారేజీలో కీలకమైన గేట్ల ఎత్తివేత పనులు కొనసాగుతున్నాయి. ఏడో బ్లాకులోని ఎనిమిది గేట్లకుగాను ఒకటిని గతంలోనే ఎత్తగా, కుంగిన పియర్స్ మధ్యలో ఉన్న గేటును కటింగ్ ద్వారా తొలగిస్తున్నారు. మిగిలిన ఆరు గేట్లలో గురువారం రెండింటిని తెరిచారు. 16, 17వ గేట్లను ఎత్తినట్లు ఇంజినీర్లు తెలిపారు.
గతంలో మేడిగడ్డలో 16వ గేటు తెరిచే సమయంలో సాంకేతిక సమస్యలు వస్తే ఆపివేసి, అన్నింటిని సరిచేసిన తర్వాత గురువారం ఎత్తారు. మరో నాలుగు గేట్లను కూడా తెరవాల్సి ఉంది. ఇదే తరహాలో వాటిని కూడా తెరిచే ప్రయత్నం చేస్తున్నారు. అట ఆనకట్ట వద్ద గ్రౌటింగ్ సహా షీట్ ఫైల్స్, సీసీ బ్లాకుల మరమ్మతులు కొనసాగుతున్నాయి. ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సిఫార్సుల ప్రకారం సీఎస్ఎంఆర్ఎస్ ఆధ్వర్యంలో మేడిగడ్డ బ్యారేజీ వద్ద పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు అన్నారం, సుందిళ్ల వద్ద పనులన్నీ సాగుతున్నాయి.
కాళేశ్వరం బ్యారేజీలను పరిశీలించనున్న మంత్రి ఉత్తమ్ : మరమ్మతులతోపాటు రక్షణ చర్యలకు సంబంధించిన పనులను పరిశీలించేందుకు నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. ఇంజినీర్లతో కలిసి ఆయన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల వద్ద జరగుతున్న పనులను పరిశీలిస్తారు. ఇంజినీర్లతోపాటు నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమావేశమై పురోగతిని సమీక్షిస్తారు.
Judicial Inquiry on Kaleshwaram Updates : మరోవైపు ఆనకట్టలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విచారణ కమిషన్ ఇవాళ్టి నుంచి తదుపరి దఫా ప్రక్రియను కొనసాగించనుంది. కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ గురువారం హైదరాబాద్ చేరుకున్నారు. ఇవాళ మధ్యాహ్నం ఆయన అన్నారం ఆనకట్టను తనిఖీ చేస్తారు. రేపు సుందిళ్ల బ్యారేజీని కూడా చెక్ చేయనున్నారు. సోమవారం నుంచి కమిషన్ విచారణ ప్రక్రియను కొనసాగించనుంది. విచారణకు సంబంధించిన అంశాలపై కమిషన్ కార్యదర్శి, సంబంధిత అధికారులతో జస్టిస్ పీసీ ఘోష్ గురువారం సమావేశమయ్యారు. బ్యారేజీల నిర్మాణ బాధ్యతలు చూసిన ఇంజినీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులకు సమన్లు జారీ చేసి విచారణ చేయనున్నారు.
Justice PC Ghose Commission on Kaleshwaram : ప్రజల నుంచి విచారణ కమిషన్‌కు 54 ఫిర్యాదులు వచ్చాయి. వాటిని పూర్తి స్థాయిలో పరిశీలించి ఆధారాలను పరిగణలోకి తీసుకొని సమన్లు జారీ చేయనున్నారు. కమిషన్‌కు సహాయం కోసం ఏర్పాటు చేసిన సాంకేతిక కమిటీ కూడా ఇప్పటికే మేడిగడ్డ ఆనకట్టను పరిశీలించింది. అక్కడి పరిస్థితులు, జరిగిన నష్టం, మరమ్మతు పనులు, రక్షణ చర్యలు, తదితరాలను వారు పరిశీలించారు. తమ పరిశీలనాంశాలను కమిటీ సభ్యులు జస్టిస్ పీసీ ఘోష్‌కు వివరించనున్నారు.
మేడిగడ్డ బ్యారేజీలో సీఎస్‌ఎంఆర్‌ఎస్ సంస్థ పరీక్షలు - మెటీరియల్, మట్టి నమునాలు సేకరణ