Irregularities in Petrol Stations At karimnagar : కరీంనగర్ జిల్లాలోని పెట్రోలు బంకుల్లో పలు విధాలుగా అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. సంబంధితశాఖ అధికారులు, ఆయా కంపెనీల ప్రతినిధుల పర్యవేక్షణ లేకపోవడంతో పెట్రోల్ స్టేషన్ల యజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇంధనం కూడా కల్తీ జరుగుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బంకుల్లో పనిచేసే స్టాఫ్ వివిధ రకాల చిట్కాలను ఉపయోగిస్తూ వినియోగదారులను మోసగిస్తున్నారనే ఆరోపణలు సైతం మిన్నంటుతున్నాయి. పెట్రోలు, డీజిల్ క్వాలిటీ, పరిమాణంలో తేడాను ప్రశ్నిస్తే యజమానులు బెదిరింపులకు పాల్పడుతున్నారు.
👉ఇటీవల ఓ వ్యక్తి ఎల్లారెడ్డిపేట మండలంలోని పెట్రోలు స్టేషన్‌కు వెళ్లాడు. తన వెహికల్ దిగకుండానే రూ.700 డీజిల్ పోయించుకున్నాడు. కారులోని ఇంధన మీటరును గమనిస్తే ముళ్లు ఎరుపురంగు గీతలోనే చూపించింది. అనుమానం వచ్చిన అతను డీజిల్ పోసే యంత్రంలో రీడింగ్‌ను పరిశీలించగా కేవలం రూ.70 మాత్రమే పోసినట్లు ఐడెంటిఫై చేశాడు. దీంతో బంక్ సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. అనంతరం మిగిలిన రూ.630 డీజిల్ పోశారు.
👉ఎల్లారెడ్డిపేట సమీపంలో ఉండే ఓ పెట్రోలు బంకులో కొందరు ప్లాస్టిక్ బాటిల్లో లీటరు పెట్రోలు పోయించుకున్నారు. దాన్ని పరిశీలించగా కిందిభాగాన సగం వరకు నీరు కనిపించింది. కొందరికి మిల్లీలీటర్ల వరకు నీరొస్తే, మరికొందరికి ఏకంగా అర లీటరు వరకు కనిపించింది. ఇదేమిటని ప్రశ్నిస్తే ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకొండంటూ వినియోగదారులను బంక్ సిబ్బంది బెదిరించారు.
నాణ్యత పరీక్షించేందుకు ససేమిరా
పెట్రోలు బంకుల్లో వినియోగదారులకు ఫ్రీగా కలిపించాల్సిన కనీస వసతులు నామమాత్రంగా అందుతున్నాయి. ఫ్యూయిల్ స్టేషన్లలో ఎయిర్‌ఫిల్లింగ్ యంత్రాలను ఏర్పాటుచేసి, వాహనాల్లో గాలి నింపేందుకు ఓ వ్యక్తిని నియమించాలి. కానీ అనేకచోట్ల ఆయా మెషిన్లు పనిచేయడంలేదు. బంకుల్లో సేవలు నచ్చకపోతే కంపెనీ అధికారులకు కంప్లైంట్ చేసేందుకు ఫిర్యాదు పెట్టెలను ఏర్పాటు చేయాల్సి ఉండాలనే నిబంధనలను గాలికొదిలేస్తున్నారు. సంబంధిత బిల్లులను స్టాఫ్ కొన్నిచోట్ల ఇవ్వడం లేదు. ఇంధన నాణ్యతను కస్టమర్లు పరీక్షించేందుకు ససేమిరా అంటున్నారు.
నిబంధనలు పాటించకుంటే లైసెన్స్ రద్దు
"పెట్రోలు, డీజిల్ బంకుల యజమానులు రాష్ట్ర సర్కార్ నిబంధనలను కచ్చితంగా పాటించాలి. అలా జరగని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటాం. బంకుల్లో వినియోగదారులకు ఫ్రీగా అందించే కనీస సౌకర్యాలను తప్పకుండా కలిపించాలి. అక్రమాలపై వినియోగదారుల ఫిర్యాదు నిజమని తేలితే చర్యలకు ఉపక్రమిస్తాం. అవసరమైతే లైసెన్స్ రద్దుకు సర్కార్‌కు సిఫారసు చేస్తాం."-వసంతలక్ష్మి, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి
పెట్రోల్ పోస్తుండగా నిప్పంటించిన ఆకతాయిలు - ఆ తరువాత ఏమైందంటే?