Intermediate Girl Died in Fire Burn in Nandyal : ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా నందికొట్కూరులో సోమవారం తెల్లవారుజామున ఇంటర్ విద్యార్థిని సజీవ దహనమైన ఘటన పెను సంచలనం సృష్టిస్తోంది. ఆ సమయంలో విద్యార్థిని గదిలో ఉన్న యువకుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్లకోటకు చెందిన ఇంజమూరి రామకృష్ణ, లక్ష్మి దంపతులకు ఏకైక కుమార్తె. ఆ యువతి మూడేళ్ల వయస్సులో తండ్రి రామకృష్ణ ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో అప్పటి నుంచి తన బాగోగులు అంతా తల్లి లక్ష్మి చూసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో తన స్వగ్రామంలో ఇంటర్మీడియట్ కళాశాల లేకపోవడంతో కుమార్తెను నందికొట్కూరులోని తన తల్లిదండ్రులు మాధవయ్య, సావిత్రమ్మల ఇంట్లో ఉంచి చదివిస్తున్నారు. లహరికి వెల్దుర్తి మండలం కలుగొట్ల గ్రామానికి చెందిన రాఘవేంద్ర అనే యువకుడితో పూర్వపరిచయం ఉంది. టెన్త్ క్లాస్‌లోనే చదువు మానేసిన ఆ యువకుడు రెండు నెలల క్రితమే యువతి కోసం నందికొట్కూరులోని వారింటికి వచ్చాడు. ఆమెతో చాలాసేపు మాట్లాడగా ఈ విషయం తెలుసుకున్న ఆమె తాతయ్య, అమ్మమ్మలు ఆ యువకుడిని హెచ్చరించారు. తాను యువతి కంటే ఒక సంవత్సరం సీనియర్ అని, తాము స్నేహితులం మాత్రమేనని రాఘవేంద్ర వారికి చెప్పి వెళ్లిపోయాడు.
బయట గడియపెట్టి తగలబెట్టారా ? : మాధవయ్య ఇంటికి ఆనుకొని ముందుభాగంలో ఓ చిన్న గది ఉండగా దాన్ని స్టోర్‌రూంగా వినియోగిస్తున్నారు. అప్పుడప్పుడు యువతి ఆ రూంలోనే చదువుకునేది. సోమవారం(డిసెంబర్ 9) కూడా చదువుకుంటానని చెప్పి ఇంట్లో నుంచి యువతి ఆ గదిలోకి వెళ్లింది. ఆ సమయంలో నిద్రలేచిన సావిత్రమ్మ బాలిక ఆ గదిలోకి వెళ్లాక ఇంటి తలుపులు వేసుకుని నిద్రపోయారు. ఈ క్రమంలో గంట తర్వాత భారీ శబ్దం రావడంతో తాతయ్య, అమ్మమ్మ ఇంటి బయటకు రాగా, ఆమె ఉన్న గదిలోనే ఉంచి పొగలు వస్తున్నాయి. లోపలి నుంచి తలుపులు కొడుతున్న శబ్దాలు సైతం వినిపించాయి. దీంతో వెంటనే బయట నుంచి తలుపులు తీయగా రాఘవేంద్ర కాలిన గాయాలతో బయటకొచ్చి కింద పడిపోయాడు.
అప్పటికే యువతి శరీరం చాలావరకు కాలిపోయి మృతిచెందింది. తల భాగం గుర్తుపట్టలేనంతగా మాడిపోయింది. తొలుత రాఘవేంద్రను నంద్యాలు జీజీహెచ్‌కు తీసుకువెళ్లగా తర్వాత అక్కడి నుంచి కర్నూలు జీజీహెచ్‌కు తరలించారు. అతని శరీరం దాదాపు 80 శాతం కాలిపోయిందని, అతను మాట్లాడే స్థితిలో కూడా లేడని వైద్యులు తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలిస్తే లహరిని హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యువకుడే హత్య చేశాడని మొదటి ప్రచారం జరిగింది. అతనే చంపి ఉంటే యువతికి నిప్పంటించిన తర్వాత పారిపోయేవాడని, కానీ అతను కూడా మంటల్లో తీవ్రంగా గాయపడ్డాడని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.
అన్ని కోణాల్లో దర్యాప్తు : ఇద్దరు లోపల ఉన్నప్పుడు బయట నుంచి గడియ పెట్టిన ఆనవాళ్లు కనిపిస్తున్నందున ఇతరల ప్రమేయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అగ్నిప్రమాదం జరిగినా లోపల నుంచి ఎటువంటి శబ్దాలు వినిపించలేదని స్థానికులు చెబుతున్నారు. ఆదివారం రాత్రి లహరికి రాఘవేంద్ర ఫోన్ చేసినట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి. గదిలో వారిద్దరి మధ్య గొడవ జరిగినట్లు దాఖలాలేమీ కనిపించలేదు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్‌సింగ్ రాణా, ఆత్మకూరు డీఎస్పీ రామాంజినాయక్ వెల్లడించారు. లహరి, రాఘవేంద్ర మధ్య పూర్వపరిచయాలున్నాయని, ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
వారిద్దరూ తరచూ ఫోన్లో మాట్లాడుకునేవారని, వివాదాలేమీ లేనట్లు తెలుస్తోందని పోలీసులు చెప్పారు. రాఘవేంద్రే నిప్పంటించినట్లు దర్యాప్తులో తేలితే హత్య కేసుగా మారుస్తామని తెలిపారు. ఇద్దరూ కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారా ? అన్న కోణంలో కూడా దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు. క్లూస్‌టీం, వైద్య బృందాలతో ఆధారాలు సేకరించామని, కరెంట్ షాక్‌తో అగ్ని ప్రమాదం జరిగిందేమోనన్న అనుమానం కూడా ఉండటంతో విద్యుత్తు శాఖ సిబ్బందిని పిలిపించామని అన్నారు. ఫోరెన్సిక్ నివేదికను ఆధారంగా కేసుకు సంబంధించిన మరికొన్ని విషయాలు తెలుస్తాయని చెప్పారు.
ప్రేమించలేదని దారుణం - ఇంటర్ బాలికను చంపిన బాలుడు
నైట్‌క్లబ్‌లో ఘోర అగ్ని ప్రమాదం- 29 మంది మృతి - turkey fire accident today