Inter Exams in Telangana 2024 : రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు తొలిరోజు ప్రశాంతంగా సాగుతోంది. నేటి నుంచి మార్చి 19 పరీక్షలు జరుగుతుండగా మొదటి, రెండో ఏదాదికి కలిపి మొత్తం 9,80,978 మంది విద్యార్థులు పరీక్ష(Inter Exams 2024)కు హాజరు కావాల్సి ఉంది. ఇందుకు సంబంధించి అధికారులు రాష్ట్రవ్యాప్తంగా 1,521 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలను ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు. విద్యార్థులు కేంద్రాలకు చేరుకునేందుకు వీలుగా ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది.
నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని ముందుగానే ఇంటర్ బోర్డు స్పష్టం చేసిన నేపథ్యంలో కేంద్రాలకు ఆలస్యంగా వచ్చిన వారెవరినీ అనుమతించలేదు. మాస్‌కాఫీయింగ్ వంటివి చేసిన, ఎలక్ట్రానిక్స్ డివైజ్‌లు ఏవైనా తీసుకువచ్చిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించకుండా పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్(Section 144) విధించారు. ఇంటర్ విద్యార్థులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) శుభాకాంక్షలు తెలిపారు. ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలని విద్యార్థులకు సీఎం సూచించారు. పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.
నిమిషం నిబంధన అమలు :
- హైదరాబాద్ నగరంలోని ముషీరాబాద్ నియోజకవర్గంలో పలు కళాశాలలో ఏర్పాటు చేసిన సెంటర్లకు చేరుకోవడానికి విద్యార్థులు అనేక ఇబ్బందులు పడ్డారు. ప్రధానంగా ఆర్టీసీ బస్సు సౌకర్యం లేని ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అయినప్పటికీ పరీక్ష కేంద్రాలకు ప్రైవేటు వాహనాల్లో, ద్విచక్ర వాహనాలపై తమ పిల్లలను తల్లిదండ్రులు తీసుకొని వచ్చారు.
- అలాగే హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్‌లోని కేమ్ బ్రిడ్జి కళాశాల వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు. నలుగురు విద్యార్థులు ఆలస్యంగా పరీక్ష కేంద్రానికి రావడంతో వారిని అధికారులు లోపలికి అనుమతించలేదు. దీంతో వారు కళాశాల బయట కూర్చుని ఆందోళన చేశారు.
- సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో నిమిషం నిబంధన అమలులో ఉండడంతో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా వచ్చిన ఇద్దరు విద్యార్థులను అధికారులు అనుమతించలేదు. దీంతో చేసేదేమీ లేక వారు అక్కడి నుంచి నిరాశగా వెనుదిరిగారు.
- ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎగ్జామ్‌కి ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన ఐదుగురు విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదు. అలాగే సాగర్ ప్రభుత్వ కళాశాల ప్రాంగణానికి వచ్చి ఇద్దరు విద్యార్థులు వెనుదిరిగారు.
బోర్డ్ ఎగ్జామ్స్ - మీ పిల్లలను ఒత్తిడితో చిత్తు చేయకండి - ఈ టిప్స్ పాటించండి!
మరో రెండ్రోజుల్లో ఇంటర్ పరీక్షలు - ఒత్తిడికి టెలిమానస్‌తో చెక్ పెట్టేయండిలా