Weather Temperature in Telangana : రాష్ట్రంలో భానుడు భగభగమంటున్నాడు. మూడు రోజుల పాటు రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పొడి వాతావరణం కారణంగా గత కొన్ని రోజుల కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పగటి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగటంతో ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు అవసరమైతే తప్ప బయటకు రాకూడదని వాతావరణ శాఖ తెలిపింది.
ఎల్లుండి రాష్ట్రంలో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గతేడాది కంటే ఈ సంవత్సరం ఎండలు మండిపోతున్నాయని, బయటకు రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ప్రజలు అంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ నెలలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని జిల్లాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉండగా కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, జగిత్యాల, యాదాద్రి భువనగిరి, వరంగల్, వనపర్తిలో అత్యధికంగా 45 డిగ్రీల సెల్సియస్ నమోదైంది.
ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 వరకు : మరికొన్ని రోజులు రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం నెలకొనే అవకాశముంది. ఒక వైపు ఎండలు ఠారెత్తిస్తుండగా మరో వైపు రాష్టంలో పలు జిల్లాలో వారం క్రితం పడిన అకాల వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంట చేతికొచ్చే సమయంలో తీవ్రంగా నష్టపోయామని వాపోయారు.
మరోవైపు అత్యవసర పనులుంటేనే మధ్యాహ్నం సమయం బయటకు వెళ్లాలని ఐఎండీ సూచించింది. బయటకు వెళ్లినా పలు జాగ్రతలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. డీహైడ్రేట్ బారిన పడకుండా పండ్ల జ్యూస్లు, ఓఆర్ఎస్ లాంటి తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. గతంలో 2015, 2016 సంవత్సరాల్లోనూ రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అప్పుడు ఆ ఎండల తీవ్రతకు చాలా మంది మృత్యువాతపడ్డారు. ఇటువంటి పరిస్థితి మళ్లీ పునరావృతం కాకుండా జాగ్రతలు తీసుకోవాలని ప్రభుత్వం సైతం హెచ్చరిస్తోంది.
'రాష్ట్రంలో 42 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్నాయి. ఒక వైపు ఎన్నికల టైం. మరోవైపు ఎండలు. ఎండలు ఎక్కువగా ఉన్నాయి. దీని వల్ల గిరాకీ కూడా లేదు. మహిళలకు బస్సు ఫ్రీ కావడంతో ఆటో ఎవరూ ఎక్కడం లేదు. ఉదయం 10 నుంచే ఎండ వస్తుంది. గత సంవత్సరం కంటే ఈసారి ఎండలు బాగా ఉన్నాయి. మళ్లీ సాయంత్రం ఏమో ట్రాఫిక్ జాం అవుతుంది'- ఆటో డ్రైవర్లు
రాష్ట్రంలో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు - వడదెబ్బతో ముగ్గురు మృతి - Temperature Rises In Telangana