ETV Bharat / state

మూడు నాట్యరీతుల ముగ్ధ మనోహరి- యామినీ కృష్ణమూర్తి - Dancer Yamini Krishnamurthy - DANCER YAMINI KRISHNAMURTHY

Yamini Krishnamurthy inspiring Story: భరతనాట్యానికి నవ్యసొగసులద్దిన నాట్యమయూరి, కూచిపూడి కళాప్రాంగణ వెలుగులను దశదిశలా చాటిన ఆ నృత్యభామిని. మూడు నాట్యరీతుల ముగ్ధమనోహరి. ఒడిస్సీని ఒడిసిపట్టిన అలనాటి భువన మోహిని. రసహృదయులను సమ్మోహితులను చేసిన ఆ కళాదిగ్గజం. ఆమెనే ఉత్తుంగ తరంగంలా ఎగసి, ప్రపంచమంతా ప్రభంజనాలు సృష్టించిన యామినీ కృష్ణమూర్తి.

Dancer Yamini Krishnamurthy
Dancer Yamini Krishnamurthy (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 3, 2024, 9:59 PM IST

Updated : Aug 3, 2024, 10:05 PM IST

Yamini Krishnamurthy inspiring Story: ఆంధ్రదేశంలో అది ఆహ్లాదలోకం మదనపల్లె. అక్కడ ముంగర కృష్ణమూర్తి కళాభిరుచి కలిగిన కవి, పండితుడు. ఆ ఇంట ఓ నిండుపున్నమి రాత్రి చిరుమువ్వగా పల్లవించింది అందాల జాబిల్లి. ఆ చిన్నారికి తాతగారు ‘యామినీ తిలక’ అని నామకరణం చేశారు. యామిని రిషివ్యాలీ పాఠశాలలో విద్యాభ్యాసానికి శ్రీకారం చుట్టింది. తరచూ కళాకారుల రాకతో, పండిత చర్చలతో ఆ గృహం సందడిగా ఉండేది. ఆ కళా స్పర్శతో చిన్నారి యామిని నృత్య కళాకారిణి కావాలన్న అభిలాషను వ్యక్తం చేసింది. ఆమె ఇష్టాన్ని, అభీష్టాన్ని గుర్తించిన తండ్రి తన కుమార్తెను కళాకారిణిగా తీర్చిదిద్దాలని నిశ్చయించారు. యామిని స్వప్న సాకారానికి కళాతీరంలో కలలు ప్రవహించే చెన్నపట్టణానికి తరలివెళ్లింది.

నాడు చెన్నైలో రుక్మిణీదేవి అరుండేల్ స్థాపించిన కళాక్షేత్రం అంటే దక్షిణ భారతదేశంలోనే ప్రతిష్ఠాత్మక నాట్యకళాశిక్షణ కేంద్రం. కృష్ణమూర్తి యామినీని ఆమెకు అప్పగించారు. అక్కడ భరతనాట్యంలో శిక్షణ పొందుతున్న చిన్నారులను చూసింది. ఆ చిరుమువ్వల సవ్వడికి పసి హృదయం పరవశం చెందింది. ఓవైపు బీసెంట్ పాఠశాలలో చదువుతూనే మరోవైపు భరతనాట్యంలో శిక్షణ తీసుకుంది.

రుక్మిణిదేవి యామినిని నాట్యకళా ప్రదర్శనలు జరిగే చిదంబరం నటరాజస్వామి ఆలయానికి తరచూ తీసుకెళ్లేవారు. అక్కడ పెద్ద కళాకారుల అభినయాన్ని ఆసక్తితో గమనిస్తూ సాధన చేసింది. అప్పట్లో పండుగలు, పర్వదినాలు, జాతరల సందర్భంగా రుక్మిణీదేవి తమిళనాట పర్యటిస్తూ ‘కురవంజి’ అనే జానపద దృశ్యరూపకాన్ని ప్రదర్శించేవారు. ఆంధ్రదేశంలో సోదెమ్మల కళారూపానికి దగ్గరగా ఉండే ఆ కళాంశంలో యామిని చెలికత్తెపాత్రను వేసి మెప్పించారు. ఆమెలో జిజ్ఞాసను గుర్తించిన రుక్మిణీదేవి, యామినిని తంజావూరు బృహదీశ్వరాలయానికి తీసుకువెళ్లి అక్కడ రకరకాల నృత్యరీతులను ప్రదర్శించే మహాకళాకారులను పరిచయం చేశారు.

యామిని మనసుపై చెరగని ముద్రవేసింది: 1954లో యామిని నృత్యజీవితాన్ని మలుపుతిప్పిన సంవత్సరం. చెన్నై రసికరంజని సభకు దిగ్గజ కళాకారులు వస్తారని అప్పటికే వినివున్న యామిని ఆ సభకు వెళ్లింది. అక్కడ అందానికి, అభినయానికి మారుపేరైన కళాకారిణి బాలసరస్వతీదేవి ఇచ్చిన అద్భుత నాట్య ప్రదర్శన యామిని మనసుపై చెరగని ముద్రవేసింది. ఆమె భైర‌వ‌ రాగంలో ‘మోహ‌మ‌నే ఎంద‌వేళై’ ఒక వ‌ర్ణానికి న‌త్యం చేస్తున్నారు. శాస్త్రీయ నృత్యకళ మీద అంతులేని మమకారం ఏర్పడటానికి బీజం వేసింది. నాట్య కళాకారిణి కావాలన్న ఆమె ఆకాంక్షను మరింతగా బలపరిచింది. బాలసరస్వతి శిష్యురాలిగా ఉండి, ఆమెకు నట్టువాంగం చెప్పే కంచీపురం ఎల్లప్పపిళ్లయ్ దగ్గర భరత నాట్యరీతులను ఔపాసన పట్టారామె. ఎల్లప్పపిళ్లై తన శిష్యులతో నృత్య ప్రదర్శనలకు దేశవిదేశాలు వెళ్లిన సమయంలో మరో నట్టువానార్ తంజావూరు కిట్టప్ప పిళ్లై యామినికి శిక్షణ నిచ్చారు.

1957లో యామిని కృష్ణమూర్తి అరంగేట్రం: ప్రతి నృత్య కళాకారిణి తన జీవితంలో అపురూపంగా భావించే సుమధుర ఘట్టం అరంగేట్రం. లయాన్వితంగా అడుగులు వేస్తూ యామిని వేదికమీదికి వచ్చింది. పుష్పాంజలితో ఆరంభమై తిల్లానాతో ముగిసిన ఆమె అద్భుత అభినయం ఆసాంతం ప్రేక్షకులను పారవశ్యంలో ముంచెత్తింది. అందమైన ఆహార్యం, ఆకట్టుకునే అభినయాన్ని చూసి ఆమెకు ఉజ్వల భవిష్యత్తు ఉందని గురువులు గ్రహించారు. అంగహారాలు, రేచకాలు, కరణాలు తదితర శాస్త్ర రీతులను అనుసరించే భరతనాట్యం లాస్య పద్ధతికి చెందినదై సౌకుమార్యంగా ఉంటుంది. ఒక కళలో పూర్తిగా పట్టుసాధించాలన్న తండ్రి మాటలు తనయ మనసును మంత్రించాయి. యామిని మైలాపూర్ కపిలేశ్వర ఆలయ సంప్రదాయ నాట్యంలో పేరుపొందిన కళాకారిణి మైలాపూర్ గౌరి అమ్మాళ్ వద్ద కొంతకాలం శిష్యరికంచేసి అరుదైన పదాలు, జావళీలు నేర్చారు. యామిని భరత నాట్యంలో ప్రదర్శనలిస్తూ ప్రేక్షకలోకం మీద సమ్మోహనాస్త్రం విసురుతున్న సమయం అది. అవి పాదాలా? నాట్య రసవేదాలా?

నృత్యజీవితాన్ని మలుపుతిప్పిన సంఘటన: శంకరాభరణ రాగంలో వర్ణానికి ఆమె వేగంగా చేసిన నృత్యానికి ప్రేక్షకలోకం ఆశ్యర్యపోయింది. తిల్లాన సొగసును అంత అపూర్వంగా ఆవిష్కరించటం యామినికే చెల్లిందని ప్రశంసించింది. యామినికి పేరు, ప్రఖ్యాతులు తీసుకొచ్చిన నృత్యాంశం వైదిక్ నృత్యరూపకం. సంస్కృత పండితుడైన తండ్ర కృష్ణమూర్తి పేర్చిన పదాలను యామిని నృత్యరూపకంగా కూర్చారు.

అలా ఒక్కో పదానికి, వర్ణానికి ఆమె నర్తిస్తూ దేశమంతా గుర్తింపు పొందుతున్నారు. తమిళనాటనే కాక దేశంలో పలు నగరాల్లో ప్రదర్శనలిస్తూ భరతనాట్యంలో యువకళాకారిణిగా తనదైన ముద్రవేస్తున్న సమయమది. సరిగ్గా అప్పుడే ఓ సంఘటన ఆమె నృత్యజీవితాన్ని మలుపుతిప్పింది. చెన్నయ్‌లో ఆంధ్రుల నృత్య కళారూపం ‘కూచిపూడి’లో శిక్షణనిచ్చే వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి దృష్టిలో పడ్డారు యామిని. ఆయన యాదృచ్ఛికంగా ఆమె భరతనాట్య కళా ప్రదర్శనను చూశారు. అప్పటికే భరత నాట్యంలో యువకళా సంచలనంగా పేరుపొందిన యామిని లాంటి దారు. కొద్దిమందికే పరిమితమైన కూచిపూడి కొడిగడుతుందేమో అనే ఆవేదనతో ఉన్న వేదాంతం వారు యామిని కృష్ణమూర్తి తండ్రిని కలిశారు.

ఆమెతో ఆయన ‘తెలుగునాట పుట్టావు. తెలుగువారి కళారూపం కూచిపూడి జ్ఞాపకంగానే చరిత్రపుటల్లో మిగిలే దుస్థితి దాపురిస్తోంది. అంతరించిపోతున్న కళారూపాన్ని కొంతయినా నిలబెడదాం’ అంటూ పౌరుషాన్ని రగిలించి, మాతృభూమి కళమీద మమకారం పుట్టించటంతో గమనం మారింది. ఆమె అంగీకారానికి తండ్రి ప్రోత్సాహం తోడయ్యింది. వేదాంతం లక్ష్మీనారాయణ స్వయంగా శిక్షణనిచ్చారు. చింతా కృష్ణమూర్తి, పసుమర్తి వేణుగోపాల కృష్ణశర్మ ఆమె కళానైపుణ్యానికి మరిన్ని మెరుగులుదిద్దారు. తొలిసారి కూచిపూడిలో దశావతార శబ్దం నేర్చుకున్నారు.

ఆ కళారూపంమీద కొద్ది కాలంలోనే పట్టుసాధించి: కూచిపూడి నృత్యం నృత్త, నృత్య, నాట్యాల సమ్మేళనం. భావ, రాగ, తాళబద్ధమై చతుర్విధాభినయాలతో మిళితమై ప్రత్యేకంగా ఉంటుంది. వాచికాభినయం ఇందులో ప్రత్యేకత. ఆరోజుల్లో కూచిపూడి అంటే నాట్య ప్రపంచానికి చిన్నచూపు ఉంది. యక్షగానంగానో, సినిమా నృత్యరీతిగానో పరిగణించేవారు. సంగీత నాటక అకాడమీ సైతం కూచిపూడిని సంప్రదాయ నృత్యంగా గుర్తించలేదు. అటువంటి పరిస్థితుల్లో కూచిపూడినృత్యం నేర్చి ఆ కళారూపంమీద కొద్ది కాలంలోనే పట్టుసాధించారు. ‘కృష్ణశబ్దం’ యామినిలా మరెవరూ సమర్పించలేరని పేరు వచ్చింది.

‘భామాకలాపం’లో సత్యభామ పాత్రలో అద్భుత నటనా వైదుష్యాన్ని ప్రదర్శించి నభూతో నభవిష్యతి అన్పిస్తూ యావత్ ప్రేక్షకలోకాన్ని మురిపించారు యామిని. సత్యభామ జడవిసుర్లు, కంటితో కొంటె చూపులు, స్వాతిశయాలను అపురూప హావభావాల్లో చూడముచ్చటగా ప్రతిఫలిస్తూ మెప్పించారు.

కూచిపూడిలో అభినయానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. అప్పటికప్పుడు తీర్చిదిద్దకునేందుకు మరెంతో స్వేచ్ఛ ఉంది. సంప్రదాయ చక్రబంధంలో ఉండాల్సిన పనిలేదు. వేగమే వేదంగా వుండే నృత్తం యామినికి నచ్చాయి. కూచిపూడి నృత్యరూపకం ‘క్షీరసాగర మథనం’లో మోహినిగా యామిని అద్భుత ఆహార్యం, అభినయంతో మెప్పించారు. ఆ రూపకంలో నాట్యగురువు వెంపటి చినసత్యం శ్రీకృష్ణుని వేషం వేశారు. సంవాదపూర్వకంగా సాగే అంశం‘దశావతారం’లో యామిని నృత్యాభినయానికి సాక్షాత్తూ నాటి ఉపరాష్ట్రపతి డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ ముగ్ధులై స్వయంగా అభినందించారు. యామినికి ‘భామవేణి’ అనే జడను బహూకరించారు.

యామిని ప్రవేశం ఓ సంచలనం: కేవలం మగవాళ్లకే పరిమితమైన కూచిపూడి కళారంగంలో యామిని ప్రవేశం ఓ సంచలనం. కొందరు గురు శిష్యుల సాయంతో ఆమె కూచిపూడి నృత్యానికి కొత్త సొగసులద్దారు. దేశవిదేశాల్లో కూచిపూడి వెలుగులు ప్రసరింపజేశారు. యామినీ కృష్ణమూర్తి కూచిపూడిలో మొట్టమొదటి ఫిమేల్ సూపర్ స్టార్ డ్యాన్సర్‌గా పేరు ప్రఖ్యాతులు గడించారు. కేవలం మగవాళ్లకే పరిమితమైన కూచిపూడి నృత్య ప్రాంగణంలో. తనదైన ముద్రవేసింది. ఆ ఆనందతాండవానికి ఢమరుకం మోగి హిమశిఖరం ఊగినట్లు దేశమంతా పరవశించింది. కృష్ణశబ్దానికి సోదరి జ్యోతిష్మతి పాట, యామిని ఆట. ప్రేక్షకలోకం హర్షధ్వానాలు చేసింది. పాదాలు కావు అవి రసవేదాలు. బ్రహ్మ కడిగిన పాదాలు కావు. ఇవి బ్రహ్మ అడిగిన పాదాలు కావచ్చు. తను సృష్టించిన మనుషుల్ని రంజింపజేయటానికి బ్రహ్మ యామినిని తీర్చిదిద్ది ఉంటారు.

ఒడిస్సీ అభినయ పాఠాలు నేర్చి : క్రీస్తుపూర్వం రెండో శతాబ్దంలో కళింగ రాజు ఖారవేలుని కాలంలో ఆదరణ పొందిన ఒడిస్సీ ఉత్కళ దేశపు సంప్రదాయ నృత్యం. త్రిభంగ శైలిలో చేసే కళార్చన ఒడిస్సీ. కోణార్క సూర్యదేవాలయం సహా అనేక మందిరాలపై ఒడిస్సీ శైలిలో శతాబ్దాల క్రితం చెక్కిన నాట్య శిల్పాలు కళాప్రియులకు ప్రత్యేక ఆకర్షణగానిలిచాయి. నాట్య భంగిమలతో నటరాజుకు కళానీరాజనాలు అర్పించే విధంగా తీర్చిదిద్దిన ఆ శిల్పాలు యామినిని ఆకర్షించాయి. అప్పట్లో ‘ఒడిస్సీ’ ఆస్థానాలకో, ఆలయప్రాంగణాలకో పరిమితమైంది. ఈ మహోన్నత కళ మరుగునపడిపోతుందనే ఆవేదన నాట్యాచార్యులను తొలిచేది.

ఒడిస్సీని ఎలాగైనా పదిమందిలో ప్రదర్శన ఇచ్చే నృత్యంగా తీర్చిదిద్దాలని నాట్యాచార్యులు తపిస్తున్న సమయం అది. అప్పటికే భరతనాట్య, కూచిపూడి నృత్యాలలో గొప్ప కళాకారిణిగా పేరు తెచ్చుకున్న యామినిని ఒడిస్సీ గురువర్యులు మహాపాత్ర, పంకజ్ చరణ్ దాస్‌లు ప్రోత్సహించారు. తండ్రి సహకారం తోడైంది. ఆయన చదివి వినిపించే జయదేవుని గీతగోవిందానికి నృత్యం చేయాలని యామిని తపించారు. అష్టపదులే ఇష్టపదులుగా ఒడిస్సీ అభినయ పాఠాలు నేర్చి దేశ విదేశాల్లో నృత్య ప్రదర్శనలిచ్చారు.

కట్టుబాట్లకాలంలో సంకెళ్లను ఛేదించి: తండ్రి ప్రోత్సాహం, గురువుల మార్గదర్శకత్వంలో భరతనాట్యరీతిలో తనదైన ముద్రవేశారు. ఆలయ నాట్యాలు తప్ప అన్ని నృత్యాలలో పురుషులదే పైచేయిగా ఉండే కాలమది. స్త్రీలకు కట్టుబాట్లకాలంలో సంకెళ్లను ఛేదించి ముందుకెళ్లారు. స్వాతంత్ర్యోద్యమకాలంలో పుట్టిపెరిగిన యామిని మహాత్మాగాంధీ బోధనలకు ఆకర్షితురాలయ్యారు. ఈ స్ఫూర్తితోనే ఆమె ‘గాంధీయన్ ఆర్డర్ ఆఫ్ లైఫ్ అనే నృత్యరూపకాన్ని చేశారు. దైవం ఒక్కటైనా భాష్యాలెన్నో ఉంటాయి. జగత్‌జనని, లోకపావని కాళిమాత ను ఒకొక్క మహనీయుడు ఒక్కో విధంగా అర్ధం చేసుకున్నారు. గురుదేవులు రవీంద్రనాథ్ ఠాగోర్, సుబ్రహ్మణ్యభారతి మాటల స్ఫూర్తితో యామిని కాళికాదేవి సందేశంతో కూర్చిన నృత్యరూపకాన్ని చేశారు.

భరతనాట్యంలో ఎంతో క్లిష్టమైన తాళ గతులను సంస్కరించారు యామిని. లలితకళల్లో నృత్యం విశిష్టమైనది. అయితే బృందాలతో కలసి చేసే సంప్రదాయ నృత్య రూపకాలు వినోదాన్ని పంచుతాయి కానీ, కళాకారులు వ్యక్తిగత ప్రతిభ ప్రేక్షకలోకానికి పరిచయం కాదంటారు యామిని. సోలోడ్యాన్సులోనే రసనిష్పత్తి కనపడుతుంటున్న యామిని ప్రతిభ, నిబద్ధత, అంకితభావం కలిగిన నర్తకి. సోదరీమణులు జ్యోతిష్మతి, నందిని యామినికి సంగీత సహకారం అందించారు. తండ్రి కృష్ణమూర్తి ఆమె ప్రదర్శనలకు నిర్వాహకునిగా వ్యవహరించారు. ‘నాన్నగారి నుంచి నాకు అలవడిన లక్షణం స్తితప్రజ్ఞత’ అంటారు యామిని.

నాట్యతారగా వెలుగులు వెదజల్లి: యామినీ కృష్ణమూర్తి దాదాపు 1950, 1960, 1970, 80లలో అంటే నాలుగు దశాబ్దాలకు పైగా అసమాన నాట్యతారగా వెలుగులు వెదజల్లారు. ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. 1990 ల తొలినాళ్లలో కూడా బిజీగా గడిపారు. నాట్యప్రదర్శనలతో ఊపిరి సలపనంత ఒత్తిడిలో దేశవిదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. అనేక విశ్వవిద్యాలయాలకు వెళ్ల విజిటింగ్ ప్రొఫెసర్‌గా విద్యార్ధులకు నృత్యాంశాలు బోధించారు. 1990లో ఢిల్లీలో యామిని స్కూల్ ఆఫ్ డ్యాన్స్ ను ప్రారంభించి వందలాదిమందికి శిక్షణనిచ్చి తీర్చిదిద్దారు. విఖ్యాత నర్తకీమణి రమావైద్యనాథన్ లాంటి అనేక మంది శిష్యులు యామినీ కృష్ణమూర్తి నృత్య ప్రాంగణం నుంచి వచ్చారు. దేశవిదేశాల్లో కూచిపూడి, భరతనాట్యానికి ప్రాచుర్యం తీసుకొచ్చారు.

సాక్షాత్తు కెనడా ప్రధాని జేజేలు పలికారు: కూచిపూడిని సోలో డ్యాన్స్​గా తీర్చిదిద్దటంలో యామిని కృషి మరువలేనిది. ఆమెకు కూచిపూడి ప్రాణం, భరతనాట్యం ధ్యానం, ఒడిస్సీ అంటే అభిమానం. దూరదర్శన్‌లో నృత్యరీతులపై 13 భాగాల సీరియల్‌కు యామిని రూపకల్పన చేశారు. యామిని ఆంగ్లంలో ఎ ప్యాషన్ ఫర్ ఎ డ్యాన్స్ అనే జీవిత చరిత్ర పుస్తకాన్ని రాశారు. అనే నృత్యరూపకాన్ని తీర్చిదిద్దారు. పళ్లెం, కలశంతో డ్యాన్స్ చేసే పద్ధతిని తొలిసారి దిల్లీ ప్రేక్షకుల ముందు ప్రదర్శించారు యామిని. కాళిదాస, భవభూతి, శంకర పద్యాల ఆధారంగా కొన్ని నృత్యాంశాలను తయారు చేశారు. జనవరి 1971లో రాష్ట్రపతి భవన్ లో ఏర్పాటైన ప్రదర్శనలో యామిని నృత్యానికి సాక్షాత్తు కెనడా ప్రధాని పెరిట్రుడు స్వయంగా స్టేజీ మీదకు వచ్చి జేజేలు పలికారు.

ఆమె సాంస్కృతిక రాయబారి: కూచిపూడిని విశ్వకళావేదికలపై ప్రదర్శించి ఆంధ్రుల అపురూపకళారూప విశిష్టతను దశదిశలా చాటారు. తొలిసారిగా లండన్ కామన్వెల్త్ కాన్ఫరెన్స్ లో వేదికపై యామిని కృష్ణమూర్తి ప్రదర్శన ఇచ్చారు. అమెరికా, రష్యా, యూకే, ఫ్రాన్స్, మెక్సికో, పాకిస్థాన్ దేశాల్లో పర్యటించి ప్రదర్శనలిచ్చి కళానీరాజనాలందుకున్నారు యామిని. భారత రాష్ట్రపతి వివి గిరితో బ్యాంకాక్ కు బయల్దేరిన భారత ప్రతినిధి బృందంలో సభ్యురాలు.

క‌నురెప్ప‌ల క‌ద‌లిక‌ల‌కూ శృతిల‌య‌లుంటాయా అన్నట్లు హావభావాలను ప్రదర్శించటం ఆమె ప్రత్యేకత. కాళి, కలశం అంశాలను ఉత్తరాది ప్రేక్షకులకు పరిచయం చేశారు. భరత నాట్యం, కూచిపూడిలలో కొన్ని దేవదాసి నృత్యరూపకాలను కూర్చి ప్రదర్శించారు. తాళ గతుల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి తనదైన ముద్ర వేశారు. నేడు కూచిపూడి అభినయంలో కొత్తపోకడలు లేక స్తబ్దంగా ఉండిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు యామినీ కృష్ణమూర్తి. ‘ ప్రతి ఇంటా ఒక నర్తకి ఉండాలి. దిల్లీలో నా దగ్గర వందలాది మంది శిష్యులు నాట్యం నేర్చుకున్నారు. అందువల్ల యువతకు నృత్యం లాంటి సంప్రదాయ కళలు అంటే ఆసక్తిలేదనటం సరికాదంటారు యామిని. నాలాంటి వందలాది మంది యామినులను, తయారు చేస్తానంటున్న ఆమె తరతరాలకు స్ఫూర్తిదాత. వయసు శరీరానికే. మనసుకు కాదు. రేకలు రాలిన పుష్పమే కావొచ్చు. కానీ ఆమె ఆశల ఆర్ధ్రత ఆరని నిత్యస్ఫూర్తిమంత్రం.

పురస్కారాలు: భారతీయ నృత్యరీతుల్లో చేసిన కృషికి గుర్తింపుగా యామినికి అనేక పురస్కారాలు లభించాయి. 1968లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ సత్కారంతో గుర్తించింది. 1977 సంగీత నాటక అకాడమీ అవార్డు లభించింది. 2001 లో పద్మభూషణ్ వరించింది. అ ఏడాది మరోసారి కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారం, 2002 భారతీయ నృత్యరీతులకు ప్రాచుర్యం కల్పించిన యామిని కృషికి గుర్తింపుగా కళింగ పురస్కారం లభించింది. 2014 లో బెంగళూరు శాంభవి స్కూల్ ఆఫ్ డ్యాన్స్ యామినిని నాట్యశాస్త్ర పురస్కారంతో సత్కరించింది. 2016 దేశ అద్వితీయ పురస్కారం, పద్మ అవార్డుల్లో అత్యత్తమమైన పద్మవిభూషణ్ పురస్కారంతో భారత ప్రభుత్వం యామినిని సత్కరించింది. ఆమె కళా వైశిష్ట్యాన్ని గుర్తించిన తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన నర్తకిగా నియమించింది.

యామిని సుభాషితం: క‌మ‌నీయ నృత్యం కూడా ఒక క‌ద‌న‌మే. క‌ళాకారుల భాష అర్ధంచేసుకోలేని పదివేల మంది ప్రేక్షకులపై స‌మ్మోహ‌నాస్త్రం విసిరి దారికి తెచ్చుకొవ‌టం ఒక యుద్ధమే. –యామినీ కృష్ణమూర్తి.

ప్రముఖ నృత్యకారిణి యామినీ కృష్ణమూర్తి కన్నుమూత - Dancer Yamini Krishnamurthy Died

Last Updated : Aug 3, 2024, 10:05 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.