CM Chandrababu at World Telugu Federation Conference: హైదరాబాద్ గురించి ఆరోజు తాను చెప్పింది ఇవాళ నిజమైందని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ ప్రాంతం గొప్ప ఐటీ సిటీగా మారుతుందని ఆనాడే ఊహించానని, విజన్ 2020 తయారు చేసుకుని ఆనాడు ముందుకెళ్లామని గుర్తు చేశారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలను సీఎం చంద్రబాబు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రసంగించారు.
ఇది చాలా సంతోషకరమైన రోజు: ప్రపంచ నలుమూలలా ఉన్న వివిధ దేశాల తెలుగు సమాఖ్యల అధ్యక్షులు ఇక్కడకు వచ్చారని సీఎం చంద్రబాబు అన్నారు. తన జీవితంలో ఇది చాలా సంతోషకరమైన రోజు అని పేర్కొన్నారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నామని, ఎన్టీఆర్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమైందని గుర్తు చేశారు. అనంతపురం నుంచి ఆదిలాబాద్ వరకు, శ్రీకాకుళం నుంచి పాలమూరు వరకు తెలుగువారు ఎక్కడున్నా ఒకటేనని అన్నారు.
ఐటీ సిటీగా మారుతుందని ముందే ఊహించా: ఈ ప్రాంతం గొప్ప ఐటీ సిటీగా మారుతుందని ఆనాడే ఊహించానని, ఆరోజు నేను చెప్పింది ఇవాళ నిజమైందిని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. విజన్ 2020 తయారు చేసుకుని ఆనాడు ముందుకెళ్లామని, తెలుగు ఏంజిల్స్ అనే పేరుతో అద్భుత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారమని గుర్తు చేశారు. ప్రపంచంలోనే మేటి నగరంగా హైదరాబాద్ మారిందంటే దూరదృష్టే కారణమని, ఆనాడు టీడీపీ ప్రభుత్వం వేసిన పునాది వల్లే ఇక్కడ ఆదాయం పెరిగిందని వెల్లడించారు. దేశ విదేశాల్లో తెలుగువాళ్లు గొప్పగా రాణిస్తున్నారని, దేశానికి దశ, దిశ చూపించిన వ్యక్తి పీవీ నరసింహారావు అని కొనియాడారు.
"ఆనాడు ఐటీ అంటే అనేకమంది ఎగతాళి చేశారు. విదేశాల్లో అనేకమంది తెలుగువారు పారిశ్రామికవేత్తలుగా మారారు. అమెరికాలో మన తెలుగువాళ్లే ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నారు. మీరు ఏ దేశానికి వెళ్లినా అద్భుతంగా రాణించిన తెలుగువాళ్లు కనిపిస్తారు. ఉన్నత చదువులకు అమెరికా వెళ్లిన వారిలో 55 శాతం తెలుగువాళ్లే. ఎక్కడికి వెళ్లినా మాతృభూమిని మరిచిపోకూడదని అనేకసార్లు చెప్పా. నాలెడ్జ్ ఎకానమీలో తెలుగువాళ్లు మరింత ఉన్నతస్థితికి ఎదగాలి". - చంద్రబాబు, సీఎం
విశాఖ, విజయవాడలో మెట్రో ప్రాజెక్టులు -25 కి.మీ మేర డబుల్ డెక్కర్ విధానం
ఏఐ, డీప్ టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి: ఏఐ, డీప్ టెక్నాలజీని తెలుగువాళ్లు అందిపుచ్చుకోవాలని, ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త ఉండాలని తెలిపారు. పెట్టుబడుల కంటే ఐడియాలు చాలా ముఖ్యమని సీఎం చంద్రబాబు అన్నారు. దుబాయి ప్రభుత్వ సాయంతో ఆనాడు ఈ కన్వెన్షన్ నిర్మించామని, ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా అనేక భవనాలు నిర్మించినట్లు తెలిపారు. అనేక దేశాలు తిరిగి ఐటీ కంపెనీలు ఇక్కడకు వచ్చేలా చేశానని గుర్తు చేశారు. తెలుగువాళ్లు ఎక్కడున్నా పరస్పరం సహకరించుకోవాలని, ఐక్యంగా ఉండి ఉన్నత స్థానాలకు ఎదగాలని పిలుపునిచ్చారు. ఏఏ దేశాల్లో ఎలాంటి అవకాశాలు ఉన్నాయో తెలుగువాళ్లకు తెలుసన్న సీఎం, విజన్ 2047తో ముందుకెళ్తున్నామని తెలిపారు. 2047 నాటికి మనం ప్రపంచంలోనే మొదటి, రెండో స్థానంలో ఉంటామని, చిన్న ఆలోచనతో అనేకమంది తెలుగువాళ్లు కోటీశ్వరులు అయ్యారని పేర్కొన్నారు.
పుట్టిన రాష్ట్రాన్ని మరవకూడదు: చిన్న ఆలోచనతో ర్యాపిడో స్థాపించి గొప్పగా రాణించారని, కో వర్కింగ్ స్పేస్ ద్వారా వేలమందికి ఉపాధి కల్పిస్తున్నారని తెలిపారు. వినూత్నంగా ఆలోచిస్తే తెలుగువాళ్లు మరింత రాణిస్తారని, జీరో పావర్టీ మన లక్ష్యం కావాలని పిలుపునిచ్చారు. 90 దేశాలకు కరోనా వ్యాక్సిన్ అందించిన ఘనత మనదన్న సీఎం, పీపీపీ విధానంలో అనేక ప్రాజెక్టులు కట్టుకున్నామని తెలిపారు. పీపీపీ విధానం భవిష్యత్తులో మరింత విస్తరించాలన్న సీఎం, టాప్-10లో ఉన్న తెలుగు పారిశ్రామికవేత్తలు ఇతరులకు మెంటార్‌గా ఉండాలని ఆకాంక్షించారు. ఎక్కడున్నా, ఎంత సంపాదించినా పుట్టిన రాష్ట్రాన్ని మరవకూడదన్నారు. ఐటీలో రాణించినవారు తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని కోరారు. కొన్ని దేశాల్లో జనాభా రేటు తగ్గిపోతోందని, జపాన్, జర్మనీ దేశాలు భారతీయుల వైపు చూస్తున్నాయని తెలిపారు. చదువు, సంపద, జనాభాకు అవినాభావ సంబంధం ఉంటుందని తెలిపారు.
2025లో సీఎం తొలి సంతకం - 1600 మంది పేదలకు అందనున్న ఆర్థికసాయం
ఏపీలో నదులు అనుసంధానం చేస్తున్నాం: ఏపీలో నదులు అనుసంధానం చేస్తున్నామన్న సీఎం, పంటలకు సాగునీరు కొరత లేకుండా చూస్తామని అన్నారు. రైతుల ఆదాయం పెంచేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని, ఇళ్లపై, పొలాల్లో ప్యానళ్లు ఏర్పాటుచేసి సౌరశక్తి తయారుచేస్తున్నామని తెలిపారు. ఉత్పత్తుల తయారీలో మరింత నాణ్యత, కచ్చితత్వం పాటించాలన్న సీఎం చంద్రబాబు, సింగపూర్‌ను చూసి హైదరాబాద్‌లో రాత్రిపూట శుభ్రత చేపట్టామని అన్నారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌ను ఉద్యమంగా తీసుకుని ముందుకెళ్తున్నామని, డీప్‌టెక్ ఆధారంగా మరింత ముందుకెళ్లాలని కోరుతున్నానన్నారు. వాట్సప్ ద్వారా 150 సేవలు అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఏపీలో జరుగుతున్న అభివృద్ధి ఉద్యమంలో మీరంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఎలాంటి ఆలోచనలున్నా మా ప్రభుత్వంతో పంచుకోవాలని కోరుతున్నానన్నారు.
టెక్నాలజీకి బానిసగా మారితే జీవితాలు నాశనం అవుతాయి: తెలుగువారికి గౌరవం తెచ్చిన నాయకుడు ఎన్టీఆర్ అని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కావాలని పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేశారని, తెలుగుభాష వికాసానికి రామోజీరావు ఎంతో కృషి చేశారని, తెలుగు భాషకు గిడుగు రామ్మూర్తి ఎంతో సేవ చేశారని కొనియాడారు. ఇప్పుడు చేయాల్సింది హార్డ్‌వర్క్ కాదని, స్మార్ట్‌వర్క్ అని సీఎం తెలిపారు. టెక్నాలజీకి డబుల్ ఎడ్జ్ ఉందని, చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. టెక్నాలజీని సరిగా వినియోగించుకుంటే మీరు ప్రపంచాన్ని శాసించవచ్చని, దానికి బానిసగా మారితే జీవితాలు నాశనం అవుతాయని అన్నారు.
అమరావతి అభివృద్ధి చెందే నగరం - ఇక సినిమాలన్నీ ఏపీలోనే: సీఎం చంద్రబాబు