India Rank in Disaster Warning : అగ్రరాజ్యం అమెరికా సహా ప్రపంచంలోని మరే ఇతర దేశానికి సాధ్యం కాని రీతిలో చంద్రుడి దక్షిణ ధృవంపై రోవర్‌ను దించిన ఘనమైన చరిత్ర భారతదేశానిది. ఇది మాత్రమే కాదు వైద్య, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అనేక ఘన విజయాలు కూడా భారత్ సొంతం. అయితే ఇంత సాధించినా ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడంలో మాత్రం వెనకబడింది. ప్రపంచ వాతావరణ సంస్థ తాజాగా ఇదే విషయాన్ని తేటతెల్లం చేసింది.
ప్రకృతి విపత్తులను ముందే గుర్తించి సన్నద్ధం కావడం, అప్రమత్తత, ప్రజలను హెచ్చరించే విషయంలో ఆసియాలోని 21దేశాల్లో భారత్ 14వ స్థానంలో ఉందని తెలిపింది. 2023లో సంభవించిన వివిధ ప్రకృతి విపత్తులను పరిశీలించిన ఈ విషయాన్ని వెల్లడించింది. విపత్తులను ఎదుర్కొనే విషయంలో చిన్న దేశాలైన దక్షిణ కొరియా, జపాన్, మయన్మార్, ఖతార్, కిర్గిస్థాన్ లాంటి భారత్ కంటే చిన్న దేశాలు మెరుగైన పని తీరు కనబర్చినట్లు పేర్కొంది.
భారత్‌లో గణనీయంగా తగ్గిన పేదరికం.. 41 కోట్ల మందికి విముక్తి
2023లో భారత్‌లోని అనేక ప్రాంతాల్లో తీవ్రమైన ఎండలు, తుపాన్లు, వరదలు, హిమానీ నదాలు కరగడం, పిడుగుపాట్లు వంటివి సంభవించాయి. వీటి కారణంగా 2వేల 450 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో పిడుగుపాట్ల వల్లే ఒక వెయ్యి 330 మంది చనిపోయారు. విప్తతుల గురించి భారత్‌లో హెచ్చరిక, అప్రమత్త వ్యవస్థ ఇప్పటికే అందుబాటులో ఉంది. తుపాన్లు, వడగాలులు, పిడుగుపాట్లు ఎక్కడెక్కడ సంభవిస్తాయో భారత వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరిస్తోంది. అయితే ఇది సరిపోవడం లేదని తాజాగా ప్రపంచ వాతావరణ సంస్థ తెలిపింది.
చిన్న గ్రామాలకు చేరవేయలేని పరిస్థితి : సువిశాల భారతదేశంలో వైవిధ్యమైన పరిస్థితులు, విభిన్నమైన భాషలు ఉండడం వల్ల విపత్తుల గురించి ముందే గుర్తించిన సమాచాన్ని సకాలంలో అందరికీ చేరవేసి అప్రమత్తం చేయడంలో ఇబ్బందులు ఉన్నాయని భారత వాతావరణ శాఖ నిపుణులు వెల్లడించారు. అయితే ఈ లోపాలను అధిగమించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. విపత్తుల వేళ సమర్థంగా స్పందించి సహాయ, పునరావాస చర్యలు, మౌలిక సదుపాయాల పునరుద్ధరణ వంటి అంశాల్లో గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకునే ప్రక్రియపై యంత్రాంగాలు దృష్టి సారించడం లేదు. పట్టణాలు, నగరాలను భారీ వర్షాలతో ముంచెత్తుతున్న వరదలను ఎదుర్కొని నీటిని దారి మళ్లించేందుకు చేపట్టాల్సిన నిర్మాణాలు దేశంలోని అనేక ప్రాంతాల్లో నత్తనడకన సాగుతున్నాయి.
India GDP Growth Rate : తలరాత మార్చే తలసరి ఆదాయం.. 2047 నాటికి భారత్ లక్ష్యం నెరవేరేనా?
ప్రకృతి పరంగా దేశంలో అత్యంత సున్నిత ప్రాంతాలు హిమాలయ పర్వత రాష్ట్రాలు. విపత్తులకు ఎక్కువ ఆస్కారం ఉండేది ఆయా రాష్ట్రాల్లోనే. అయితే అక్కడ వాటిని ఎదుర్కొనే వ్యవస్థలు పేలవంగా ఉన్నాయి. హిమాలయాల్లో 3వేల 5వందల మీటర్ల ఎత్తు కంటే పైభాగంలో మానిటరింగ్ వ్యవస్థలు అందుబాటులో లేవు. భారత హిమాలయాల్లో 10వేల హిమానీ నదాలు ఉండగా, అందులో ఉత్తరాఖండ్‌లోనే వెయ్యి ఉన్నాయి. రిమోట్ సెన్సింగ్ సమాచారంతో భారీగా నీరు చేరి ప్రమాదకరంగా మారిన వాటిని సత్వరమే గుర్తించవచ్చు. విపత్తులను ఎదుర్కొనే విషయంలో సంసిద్ధత లేకపోవడం ప్రమాదకర లోపం అని నిపుణులు అంటున్నారు.
పర్యావరణ పనితీరు సూచీలో అట్టడుగున భారత్
ప్రపంచ వాతావరణ సంస్థ గత ఏడాది డిసెంబర్‌లో విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 101 దేశాలు బహుళ ప్రమాదకర ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను కల్గి ఉన్నాయి. 1970 నుంచి 2021వరకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 12వేల విపత్తులు సంభవించాయి. వీటి వల్ల రెండు మిలియన్లకు పైగా మరణాలు, 4.3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక నష్టం సంభవించింది. దీనికి కారణం విపత్తులను ముందుగానే గుర్తించి సన్నద్ధం చేసే వ్యవస్థలు పటిష్ఠంగా లేకపోవడమే.
చిన్న దేశాల కంటే వెనుక ఉన్న భారత్: ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలను ముందే హెచ్చరించేలా ఓ వ్యవస్థను రూపొందించుకుంటున్న నేపాల్, మాల్దీవులు, శ్రీలంక, బంగ్లాదేశ్, మారిషస్‌కు భారత్ సాంకేతిక సాయం అందిస్తోంది. ప్రమాదకర వాతావరణం, నీరు, విపత్తుల నుంచి రక్షణ కోసం 2027నాటికి ముందస్తు హెచ్చరికల వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలని ఐక్యరాజ్యసమితి 2022లో ప్రకటించింది. ఎర్లీ వార్నింగ్స్ ఫర్ ఆల్ ప్రక్రియలో భాగంగా చొరవ తీసుకున్న భారత్ విపత్తులను ఎదుర్కొనేందుకు కృషి చేస్తోంది.
పోటీతత్వ సూచీలో భారత్ ముందుకు.. ర్యాంక్ ఎంతంటే?
తుపాన్లు వంటి విపత్తులు సంభవించినపుడు విద్యుత్ లైన్లు, స్తంభాలు, ఇళ్లు, ప్రభుత్వ భవనాలు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు వంటి మౌలిక సదుపాయాలకు కల్గే నష్టం అపారంగా ఉంటుంది. ప్రభుత్వపరంగా సన్నద్ధత సమర్థంగా ఉంటే నష్ట తీవ్రతను కొంతైనా తగ్గించే వీలు కల్గుతుంది. వాతావరణ విభాగం నుంచి గ్రామాలు, ప్రజా బాహుళ్యానికి చేరేలా ముందస్తు హెచ్చరికలు అందించే వ్యవస్థ, యంత్రాంగం దేశంలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు.
ఈ తరహా వ్యవస్థలను అందిపుచ్చుకోవాల్సి ఉంది. లోపాలను సరిదిద్దుకుని ముందుకు సాగాలి. ప్రస్తుతం తుపాన్లు, వడగాలులు, పిడుగుపాట్ల గురించి వాతావరణ సమాచారం అందిస్తున్నా, అది దేశంలోని మారుమూల ప్రాంతాలకు చేరడం లేదు. ఈ లోపాన్ని కూడా అధిగమించాలి. ఈ చర్యలన్నీ పటిష్ఠంగా అమలు చేసి సన్నద్ధం అయితేనే విపత్తులు కల్గించే నష్టాన్ని వీలైనంత వరకు తగ్గించుకోవచ్చు. మరి ఈ దిశగా ఇక కదలాల్సింది ప్రభుత్వాలే.