Heavy Rains For Two Days in Telangana : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు, రేపు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లో భారీ వర్షాలు కురుసే అవకాశం ఉందని ఐఎండీ సంచాలకులు ప్రకటించారు.
రేపు కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు వాతావరణ శాఖ సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేశారు. మధ్యవిదర్భ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్న ప్రస్పుటమైన అల్పపీడన ప్రాంతం, ప్రస్తుతం అల్పపీడన ప్రాంతంగా బలహీన పడి పశ్చిమ విదర్భ పరిసర ప్రాంతంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొన్నారు.
దీనికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవరించి ఉందని వాతావరణ శాఖ సంచాలకులు వివరించారు. కోస్తాంధ్ర, యానాం పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టం నుంచి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపారు.
ముందస్తు ప్రణాళికలతో చర్యలు : రాష్ట్రంలోని మళ్లీ ఇవాళ, రేవు భారీ వర్షాల కురిసే అవకాశం ఉన్నందున ఈ మేరకు ఆయా జిల్లాల్లో అధికారులు పునరావాస, సహాయక చర్యలపై దృష్టి పెట్టారు. భారీ వర్షాలు కురిసే అవకాశమున్న జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉంటూ ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని ఇప్పటికే సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. ఏ విధమైన ఆస్తి, ప్రాణ నష్టం కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
మరోవైపు రాష్ట్రంలో గోదావరి మహోగ్రరూపం దాలుస్తోంది. మహారాష్ట్ర నుంచి భారీగా వరద ఉత్తర తెలంగాణను ముంచెత్తుతోంది. రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి వద్ద త్రివేణి సంగమం వరద ప్రవాహం పెరుగుతోంది. తెలంగాణ- మహారాష్ట్ర మధ్య ఉన్న బ్రిడ్జిని ఆనుకుని ప్రవాహం కొనసాగుతుంది. దాంతో అధికారులు మహారాష్ట్రకు రాకపోకలు నిలిపివేసారు.