Illegal Sand Transport in Telangana : ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ రాష్ట్రంలో పలుచోట్ల ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా సాగుతున్న ఈ దందాకు సంబంధించి పలు అంశాలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం కట్టడి దిశగా చర్యలకు శ్రీకారం చుట్టడం ప్రస్తుతానికి ఫలితాలనిస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల గనులశాఖపై నిర్వహించిన సమీక్షలో ఇసుక అక్రమ రవాణాపైనే ఎక్కువగా చర్చించారు. తాను పాదయాత్ర చేసినప్పుడు, ఇతర సందర్భాల్లో క్షేత్రస్థాయిలో గమనించిన అక్రమాలను ముఖ్యమంత్రి అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.
హుజూరాబాద్ ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతాం : ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
Officers Actions on Sand Smuggling : తన అంచనా ప్రకారం 25 శాతం అనధికారికంగా ఇసుక తరలివెళ్తుందని అని రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అధికారులు తెలిపారు. రీచ్‌ల దగ్గర సీసీ కెమెరాలు లేకపోవడం, ఉన్నవి పనిచేయకపోవడం వంటి అంశాలపై అధికారులతో మాట్లాడారు. వేబ్రిడ్జిలు లేకపోవడం, ఒక పర్మిట్‌తో మూడు, నాలుగు లారీల్లో ఇసుక తీసుకెళ్లడం వంటివీ సమావేశంలో చర్చకు వచ్చాయి. రాష్ట్రంలో ప్రస్తుతం కేవలం ఏడు జిల్లాల్లో మాత్రమే తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ(టీఎస్‌ఎండీసీ) ఇసుక రీచ్‌లు ఉన్నాయి. ఫలితంగా ఇసుక రీచ్‌లు లేనిచోట అక్రమాలు ఎక్కువగా జరుగుతున్నట్లు క్షేత్రస్థాయి పరిస్థితులు చెబుతున్నాయి.
CM Revanth on Illegal Sand Transport : సమావేశం అనంతరం అధికారులు ఇసుక అక్రమాలను గుర్తించే చర్యలు చేపట్టారు. యాదాద్రి, మహబూబ్‌నగర్, సూర్యాపేట, కామారెడ్డి జిల్లాల్లో ఇసుక దందా జోరుగా జరుగుతున్నట్టు నిర్ధారించారు. కరీంనగర్, మహబూబ్‌నగర్, సూర్యాపేట, నల్గొండ వంటి జిల్లాల్లో టీఎస్‌ఎండీసీ రీచ్‌లు అసలే లేవని, దీంతో ఆయా జిల్లాల్లోని నదులు, ఉపనదుల నుంచి ఇసుక అక్రమంగా తరలుతోందని గుర్తించారు.
ఏం తెలివిరా బాబూ! - చెరువులో నుంచి ఇసుకను ఎలా తోడేస్తున్నారో చూడండి
Sand Smuggling in Telangana : మంజీరా, గోదావరి, మూసీ, దుందుభి నదీ పరీవాహక ప్రాంతాల నుంచి స్థానికావసరాల పేరుతో ఇసుకను తరలించి ఓచోట నిల్వచేసి, అక్కణ్నుంచి లారీల్లో నగరాలకు రవాణా చేస్తున్నారని, ఫలితంగా సర్కారు ఆదాయానికి భారీగా గండి పడుతోందని తేల్చారు. దీనికి అడ్డుకట్ట వేసే దిశగా అనేక చర్యలు చేపట్టారు. ఇసుక రీచ్‌లు లేని జిల్లాల్లో ఏర్పాటు చేయడం ఇప్పటికే ఉన్నచోట మరిన్ని తెచ్చే దిశగా టీఎస్‌ఎండీసీ అధికారులు కసరత్తు ప్రారంభించారు.
రోజూ లక్ష టన్నులపైనే : టీఎస్‌ఎండీసీ ఇసుకను ఆన్‌లైన్‌లో విక్రయిస్తోంది. కొద్దిరోజుల క్రితం వరకు సరాసరిన రోజుకు 40,000ల నుంచి 50,000ల టన్నుల మధ్య అందుబాటులో ఉంచేది. అరగంటలోనే అదంతా అమ్ముడయ్యేది. సాంకేతిక పరిజ్ఞానంపై పట్టున్న వారికే దొరికేది. దళారులు, లారీల యజమానులు బుకీలను పెట్టుకుని మరీ బుక్‌చేసుకునేవారు. దీంతో ఆన్‌లైన్‌లో దొరకనివారు తప్పనిసరిగా ఎక్కువ ధరకు వారి వద్ద కొనాల్సి వచ్చేది.
ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ బుకింగ్ విధానంలోని లోపాలను గనులశాఖ ముఖ్యకార్యదర్శి, టీఎస్‌ఎండీసీ ఇంఛార్జ్ ఎండీ మహేశ్ దత్ ఎక్కా నిర్ధారించారు. ఇందులో భాగంగా దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో బుకింగ్‌కు వీలుగా రోజూ కనీసం లక్ష టన్నులు అందుబాటులో ఉండేలా చూస్తున్నారు. కొన్నిరోజుల్లో అయితే 1.18 లక్షల టన్నుల ఇసుకను కూడా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు.
అక్రమాలను అరికట్టేందుకు సీసీ కెమెరాల నిఘా పెంచడంతోపాటు అవసరమైనచోట కొత్త ఇసుక రీచ్‌ల ఏర్పాటుపైనా దృష్టిసారిస్తున్నామని టీఎస్‌ఎండీసీ వర్గాలు తెలిపాయి. పోలీసు, రెవెన్యూ అధికారులు ఇసుక అక్రమ రవాణాను అరికట్టడంలో క్రియాశీలకంగా వ్యవహరించేలా చూడాలని కోరుతూ గనులశాఖ అన్ని జిల్లాల కలెక్టర్లకు లేఖలు రాశామని పేర్కొన్నాయి. మరోవైపు విజిలెన్స్ బృందాలూ రంగంలోకి దిగాయని, వాహనాలు ఓవర్‌లోడ్‌తో వెళ్లకుండా రవాణాశాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారని టీఎస్‌ఎండీసీ వర్గాలు వెల్లడించాయి.
ఇసుక మాఫియాను అడ్డుకునేందుకు యత్నించిన హోంగార్డును ట్రాక్టర్‌తో ఢీ కొట్టి హత్య
ఇసుక అమ్మకాలకు కొత్త పాలసీ విధానం - అక్రమంగా నిర్వహిస్తున్న స్టోన్ క్రషర్స్ సీజ్ : రేవంత్ రెడ్డి