ICFAI VC On Hostel Incident : ఐసీఎఫ్ఏఐ యూనివర్సిటీలో యువతికి అనుమానాస్పద రీతిలో గాయలవడంపై విశ్వవిద్యాలయ వీసీ డాక్టర్. ఎల్ఎస్ గణేష్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. లా చివరి సంవత్సరం చదువుతున్న లేఖ్య వర్ధిత విషయంలో పలు మీడియా సంస్థలు యాసిడ్ అని చూపించాయని అవి తప్పుడు ప్రచారమని తెలిపారు. యువతి ఒంటిపై 40 శాతం కాలిన గాయాలు ఉన్నాయన్న వీసీ, ప్రస్తుతం విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. ఘటన వేడి నీళ్ల వళ్లే జరిగిందని యూనివర్సిటీ యాజమాన్యం భావిస్తున్నట్లుగా తెలిపారు.
VC Clarifies On Hostel Incident : ఐసీఎఫ్ఏఐ వసతిగృహ సమీపంలో ఎలాంటి యాసిడ్ అందుబాటులో లేదని వివరించారు. గర్ల్స్ హాస్టల్లో పటిష్ఠ భద్రత ఉంటుందని అమ్మాయి తప్ప వేరే వాళ్లు ఎవరూ ఆమె గదిలోకి వెళ్లే అవకాశం లేదని స్పష్టం చేశారు. యువతి బాత్రూంలో స్నానం చేసిన తర్వాత తనంత తానే బయటకు వచ్చి ప్రాథమిక చికిత్స కోసం యూనివర్సిటీ క్లినిక్‌కు వెళ్లిందని తెలిపారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించినట్లు వెల్లడించారు.
క్లూస్‌టీం వివరాలు సేకరించింది : యువతి చదువుల్లో ముందుంటుందని మానసికంగా శారీరకంగా ఇలాంటి ఇబ్బందులు లేవని వీసీ పేర్కొన్నారు. 15వ తేదీ సాయంత్రం ఘటన జరిగిన తర్వాత యూనివర్సిటీ నుంచి ఎలాంటి ఫిర్యాదు చేయలేదని పేర్కొన్న అధికారులు క్లూస్ టీం ఆ రోజు విచారణ చేపట్టి బకెట్ వాటర్‌తో పాటు అక్కడున్న వస్తువుల్ని తీసుకొని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించినట్లు వెల్లడించారు. దీనికి సంబంధించి సమగ్రంగా విచారణ జరిగిన తర్వాత పూర్తి విషయాలు తెలుస్తాయని అన్నారు. కాగా యువతి స్వస్థలం తిరుపతి అని తెలిపారు.
"గాయపడిన లేఖ్య వర్థిత అనే విద్యార్థిని 7:20కి రూం నుంచి బయటకు వచ్చి తన ఒంటిపై బొబ్బలు వచ్చాయని చెప్పింది. వెంటనే ఆమెకి మా క్లినిక్‌లో చికిత్స అందించాం. అనంతరం ఓ మంచి ఆసుపత్రికి వైద్యం కోసం తరలించాం. యువతిపై యాసిడ్ దాడి జరిగిందని మీడియాలో వస్తున్న కథనాలు అవాస్తవం. యువతి ఒంటిపై 40 శాతం కాలిన గాయాలున్నాయి. లేఖ్యకు గతంలో ఎలాంటి ఆరోగ్యసమస్యలు లేవు. కారిడార్లో సీసీటీవీ విజువల్స్ పోలీసులకు అందించాము. ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు"- డాక్టర్ ఎల్. ఎస్. గణేశ్, ఐసీఎఫ్ఏఐ వీసీ