Hydra Operations In Hyderabad : చిన్న చినుకుకే చిత్తడి! కాలనీలు, బస్తీల్లో మోకాళ్ల లోతు నీళ్లు!చెరువులను తలపించే రోడ్లు పిల్ల కాలువలను మరిపించే వీధులు!కాలానికి అతీతంగా హైదరాబాద్ మహానగరంలో కనిపించే దృశ్యాలివి! కానీ, దీనికి కారణమేంటి? అంటే వరద నీటిని మోసుకెళ్లే నాలాలు, వాన నీటితో నిండాల్సిన చెరువులు, కుంటలను కబ్జాలకు గురికావడమే కదా. అక్రమార్కుల అత్యాశకు, అవినీతి అధికారుల ధన దాహానికి చెరువులు కుంటలు కబ్జాకు గురి కావడంతోనే వరద నీరు నగరాన్ని ముంచెత్తు తుంది. నీటి వనరులను నామరూపాలు లేకుండా చేసి భారీ భవనాలు, కాలనీలు వెలుస్తుండటంతో వాటి మనుగడ ప్రశ్నార్థకరంగా మారింది.
చెరువుల పరిరక్షణతో పాటు ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలకు అడ్డుకట్ట వేసేలా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ-హైడ్రాని ప్రభుత్వం ఈ మధ్యే ఏర్పాటు చేసింది. కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో ఏర్పాటైన హైడ్రా చెరువుల కబ్జాలు, అక్రమ కట్టడాలపై దృష్టి సారించింది. ఈ మేరకు గ్రేటర్‌తో పాటు ఓఆర్ఆర్ వరకు ఉన్న 56 చెరువులు, కుంటలపై నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్-ఎన్ఆర్ఎస్సీ అధ్యయనం ఆధారంగా ముందుకెళ్లేందుకు హైడ్రా సిద్ధమైంది.
ఎన్ఆర్ఎస్సీ అధ్యయనంలో కనివినీ ఎరగని స్థాయిలో జరిగిన జలవనరుల విధ్వంసం బయపడింది. 44 ఏళ్ల కింద 10 వేల 461 ఎకరాల్లో విస్తరించిన జలవనరులు గతేడాది చివరికి 3 వేల 974 ఎకరాలకు తగ్గింది. అందులో దాదాపు 61 % చెరువులు మాయమవ్వగా 39 % మాత్రమే మిగిలినట్లు తేలింది. ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో హైదరాబాద్ మనుగడ ప్రశ్నార్థకరంగా మారనుందని హైడ్రా భావిస్తోంది.
ఎన్ఆర్ఎస్సీ శాటిలైట్ వివరాలతోపాటు 2005 నుంచి 2020 వరకు గూగుల్ మ్యాప్‌లు పరిశీలించిన హైడ్రా చెరువుల విధ్వంసంపై ఆందోళన వ్యక్తం చేసింది. 4ఏళ్లలో చెరువుల పూర్తిస్థాయి నీటి మట్టం, బఫర్‌జోన్ల ప్రాంతాలు అన్యాక్రాంతమైనట్లు గుర్తించింది. చెరువులు కుంచించుకుపోయి వాటిలోకి వెళ్లాల్సిన వరద నీరు దారి మళ్లీ నివాస ప్రాంతాలను ముంచెత్తుతున్నట్లు తేల్చింది. జీహెచ్ఎంసీతో పాటు నగర శివారు ప్రాంతాల్లోని చెరువుల ఆక్రమణలను పరిశీలిస్తే ఎంతటి విఘాతం కలుగుతుందో అర్థమవుతుంది.
జీహెచ్ఎంసీలోని 6 జోన్లలో 7వేల 139 ఎకరాల ఎఫ్టీఎల్ ఉండగా 2014లో 592 ఎకరాలు, 2020లో 592ఎకరాల ఎఫ్టీఎల్ ఆక్రమణలకు గురైంది. 1250ఎకరాల బఫర్‌జోన్ ఉండగా 2014లో 327ఎకరాలు, 2020లో 415ఎకరాల భూమి కబ్జాకోరల్లో చిక్కుకుంది. అలాగే 2014లో 6వేల 235, 2020లో 8వేల 822 అక్రమ నిర్మాణాలు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించినట్లు హైడ్రా గుర్తించింది. బఫర్‌జోన్‌లోనూ 2014లో 3వేల 872, 2020లో 5వేల 957 అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు హైడ్రా తేల్చింది.
ఎఫ్టీఎల్, బఫర్‌జోన్లు కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టడంతో కీసర మండలం తుమ్మలకంట చెరువు, బతుకమ్మకుంటలు నామ రూపాల్లేకుండా పోయాయి. కుంట్లూరు చెరువు 90%, ఉప్పల్ నల్ల చెరువు 90%, కొంపల్లి చెరువు, 88%, జిల్లెలగూడ చెరువు 85 %, బండ్లగూడ చెరువు 83 %, ఫిర్జాదిగూడ చెరువు 73%, సఫిల్‌గూడ చెరువు 66 %, సరూర్‌నగర్ చెరువు 56%, నాగోల్‌చెరువు 41 %, మీరాలం చెరువు 32 %, జల్‌పల్లి చెరువు 31 %, కాప్రా చెరువు 27%, జీడిమెట్ల ఫాక్స్ సాగర్ 22 % ఆక్రమణలకు గురయ్యాయి. హైదరాబాద్ నగరానికి తలమానికమైన నిలిచే హుస్సేన్ సాగర్ సైతం 21% కబ్జా అయినట్లు హైడ్రా పరిశీలనలో వెల్లడైంది.
భాగ్యనగరంలో మూసీ మురికి వదిలించేదెలా? - కలుషిత నీటి నుంచి మంచినీటిగా మారేదెప్పుడు?
కొన్ని సందర్భాల్లో నీటిపారుదల శాఖ నుంచి కూడా అక్రమంగా ఎన్వోసీలు జారీ అవుతున్నాయి. బఫర్‌జోన్లలో వెలుస్తున్న భవనాలకు నిర్మాణ పనులు పూర్తి కాకుండానే అక్యుపెన్సీ జారీ అయిపోతుంది. ఇలాంటి వ్యవహారాల పై రోజుకు వందల్లో హైడ్రాకు ఫిర్యాదులు అందుతున్నాయి. వాటిని లోతుగా విచారణ చేస్తోన్న హైడ్రా నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలను నేలమట్టం చేస్తోంది. నెలరోజుల్లో గాజులరామారం, శాస్త్రిపురం, చందానగర్, బాచుపల్లి, గండిపేట పరిధిలోని ఖానాపూర్‌లో అక్రమంగా నిర్మించిన బహుళ అంతస్తుల భవనాలను అధికారులు కూల్చివేశారు. నెల రోజుల్లో దాదాపు 100 ఎకరాల ప్రభుత్వ భూములను హైడ్రా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
మూడంచెల కార్యాచరణతో రంగంలోకి : నీటి వనరుల సంరక్షణ కోసం మూడంచెల కార్యాచరణతో రంగంలోకి దిగి యాక్షన్ మొదలు పెట్టింది హైడ్రా. మొదటి దశలో పూర్తిస్థాయి నీటిమట్టం, బఫర్‌జోన్లలో కొత్త నిర్మాణాలు అడ్డుకోవడం, కబ్జాదారుల విషయంలో కఠినంగా వ్యహరించడం లాంటివి ఉంటాయి. రెండో దశలో ఇప్పటికే కట్టిన నివాసాలు, ఇతర నిర్మాణాల అనుమతలు రద్దు చేయడంతోపాటు వాటికి అనుమతి ఇచ్చిన అధికారులపై చర్యలకు హెచ్ఎండీఏ అధికారులకు లేఖ రాసింది.
ప్రభుత్వం హైడ్రాకు ప్రాధాన్యత ఇవ్వడమే కాక స్వయంగా ముఖ్యమంత్రే ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సంస్థ బలోపేతానికి 3500 మంది సిబ్బందినీ నియమించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రత్యేక పోలీస్ స్టేషన్‌తో పాటు దాదాపు 300 మంది సిబ్బందిని డిప్యుటేషన్‌పై హైడ్రాకు కేటాయించారు. అక్రమ నిర్మాణాలపై ప్రజలకు అవగాహన కోసం ప్రత్యేక వెబ్ సైట్ కూడా హైడ్రా సిద్ధం చేస్తోంది.
చెరువుల పరిరక్షణ కోసం హైడ్రా చేస్తున్న కృషిని పలువురు పర్యావరణ నిపుణులు అభినందిస్తున్నారు. అదే సమయంలో 44 ఏళ్ల కిందట శాటిలైట్ మ్యాప్‌ల ఆధారంగా కూల్చి వేస్తుండటం ఆందోళన కలిగిస్తుందని అంటున్నారు. సరైన విచారణ జరిపి అక్రమంగా నిర్మించిన వాటిని మాత్రమే కూల్చివేయాలని సూచిస్తున్నారు. అంతేకాక ఆక్రమణలకు అడ్డుకట్ట వేయడంతోనే చెరువుల పరిరక్షణ పూర్తికాదని, వాటిలోకి మురుగునీరు చేరకుండా కూడా చూడాలని సూచిస్తున్నారు.
నిరంతరంగా కొనసాగాల్సిన కార్యచరణ : హైదరాబాద్ మహానగరంలో నీటి వనరుల పరిరక్షణ 6 నెలలు, ఏడాదిలో ముగిసే ప్రక్రియ కాదని నిరంతరంగా కార్యచరణ కొనసాగుతుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అంటున్నారు. నోటీసులు ఇచ్చి కాలయాపన చేసే సంస్థ హైడ్రా కాదని ఘంటాపథంగా చెబుతోన్న రంగనాథ్ ఆక్రమదారుల్లో రియల్టర్లు, బిల్డర్లు, రాజకీయ నాయకులు ఎవరున్నా ఉపేక్షించేది లేదని హెచ్చరిస్తున్నారు.
మూసీకి మంచిరోజులు వచ్చినట్లేనా - ఫలితాలు రావాలంటే ఏం చేయాలి? - Musi Riverfront Development